బోర్డు తిప్పేయడంలో ఇదో రికార్డు.. హైదరాబాద్ లో రూ.850 కోట్ల మోసం

క్యాపిటల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనుబంధ ఫాల్కన్‌ ఇన్వాయిస్‌ డిస్కౌంటింగ్‌ కంపెనీ జనాన్ని నిలువునా ముంచింది.

Update: 2025-02-17 09:38 GMT

లక్షలు.. కోట్లు కాదు వందల కోట్లు.. వందలు వేలు కాదు.. 6 వేల మందిపైనే... బోర్డు తిప్పేయడం అంటే.. ఏమిటో అనుకున్నాం కానీ.. అందులోనూ రికార్డ నెలకొల్పడం అంటే ఇదేనేమో అన్నంతగా హైదరాబాద్ లో ఘరానా మోసం వెలుగుచూసింది. ఇన్వాయిస్‌ డిస్కౌంటింగ్‌ పేరుతో.. రూ.850 కోట్ల భారీ మోసం వెలుగుచూసింది.

క్యాపిటల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనుబంధ ఫాల్కన్‌ ఇన్వాయిస్‌ డిస్కౌంటింగ్‌ కంపెనీ జనాన్ని నిలువునా ముంచింది. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సైబరాబాద్‌ ఈవోడబ్ల్యూ (ఆర్థిక నేరాల విభాగం) పోలీసులు ప్రధాన కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ పవన్‌ కుమార్‌ ఓదెల, డైరెక్టర్‌ కావ్య నల్లూరిని అరెస్టు చేసి రిమాండ్‌ కు తరలించారు.

క్యాపిటల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ చైర్మన్‌ అమర్దీప్‌ కుమార్ కాగా, సీఈవోగా యోగేందర్‌ సింగ్‌ వ్యవహరిస్తున్నారు. వీరితోపాటు మరికొందరు నిందితులు దొరకలేదు. కాగా, అమర్దీప్, యోగేందర్‌, పవన్‌ కుమార్, కావ్య తదితరులు హైటెక్‌ సిటీ హుడా ఎన్‌ క్లేవ్‌లో క్యాపిటల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ పేరిట సంస్థను నెలకొల్పారు. దీనికి అనుబంధంగా ఫాల్కన్‌ ఇన్వాయిస్‌ డిస్కౌంటింగ్‌ సంస్థ.. ఫాల్కన్‌ క్యాపిటల్‌ వెంచర్స్‌ సహా మరికొన్నింటిని నెలకొల్పారు.

ఇన్వాయిస్‌ ల డిస్కౌంటింగ్‌ అంటే.. వ్యాపార వర్గాలు తక్షణ ఆర్థిక అవసరాలు తీర్చే వెసులుబాటు. సంస్థ తమ ఉత్పత్తిని మరో కంపెనీకి విక్రయించింది. దీనికి అవతలి సంస్థ వెంటనే డబ్బు చెల్లించకుండా కొన్ని రోజుల గడువుతో ఇన్వాయిస్‌ ఇస్తుంది. ఇలాంటి సమయంలో విక్రయ సంస్థకు డబ్బు అవసరం ఏర్పడితే ఆ ఇన్వాయిస్‌ ను మూడో సంస్థకు రాయితీకి అమ్మేస్తుంది. కానీ, ఇక్కడ ఈ పేరు ఉపయోగించి ఓ యాప్, వెబ్‌ సైట్‌ ద్వారా అధిక వడ్డీలు ఇస్తామని చెప్పి 2021 నుంచి డిపాజిట్లు సేకరించడం మొదలుపెట్టారు. తమకు ప్రఖ్యాత సంస్థలతో ఇలాంటి లావాదేవీలు ఉన్నాయంటూ నకిలీ ఒప్పంద పత్రాలను సృష్టించి ప్రచారం చేశారు. గడువును బట్టి కనిష్ఠంగా 11 శాతం.. గరిష్ఠంగా 21.95 శాతం వడ్డీ చెల్లిస్తామని ఇన్వాయిస్‌ లను అందుబాటులో ఉంచారు.

ఇన్వాయిస్‌ ల డిస్కౌంటింగ్‌ పేరుతో దీనిని 2021లో మొదలుపెట్టారు. నాలుగేళ్లలో 6,979 మంది నుంచి రూ.1,700 కోట్లు వసూలు చేశారు. ప్రారంభంలో చెల్లింపులు సక్రమంగా సాగగా కొన్ని నెలలుగా నిలిపివేశారు. మొత్తం రూ.850 కోట్లు చెల్లించకుండా దానిని 14 కంపెనీల్లోకి మళ్లించారు. బాధితులు నిలదీయడంతో నిందితులు జనవరి 15న కార్యాలయాన్ని మూసేసి పరారయ్యారు.

బాధితులు సైబరాబాద్‌ ఈవోడబ్ల్యూ పోలీసులను ఆశ్రయించడంతో మూడు కేసులు నమోదయ్యాయి. 40 మంది నిందితుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. పవన్, కావ్యలను అరెస్టు చేయగా నిందితులు గతంలో బ్లూలైఫ్‌ ఇంటర్నేషనల్‌ కంపెనీ పేరుతో గొలుసుకట్టు మోసానికి పాల్పడడంతో 2022లొ చేవెళ్ల పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కూడా వీరిపై కేసులు పెడుతున్నారు.

Tags:    

Similar News