అయోధ్య రామాలయానికి హైదరాబాద్ తలుపులు.. అదెలానంటే?

బంగారు పూతతో కూడిన 18 ప్రదాన ద్వారాల తలుపులతో పాటు మరో 100 తలుపుల్ని తయారు చేశారు. యాదాద్రి ఆలయంలోని కలప కళాక్రతులను కూడా ఇక్కడే తయారు చేశారు.

Update: 2023-12-26 04:53 GMT

యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రామాలయ ప్రారంభానికి టైం దగ్గరకు వచ్చేస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా ఎంపిక చేసిన వస్తువుల్ని సిద్ధం చేయిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు హైదరాబాద్ వంతు వచ్చింది. భారీ గంటలను తమిళనాడులో సిద్ధం చేయిస్తుండగా.. రామాలయానికి వినియోగించే ద్వారాలు హైదరాబాద్ లోని న్యూ బోయిన్ పల్లిలో సిద్ధం చేయిస్తున్నారు. గత ఏడాది జూన్ లో మొదలైన తలుపులు తయారీ పని ఇప్పుడు పూర్తి కావొస్తోంది.

న్యూబోయిన్ పల్లికి చెందిన అనురాధ టింబర్ డిపోలో రూపొందిస్తున్న ఈ తలుపుల తయారీ కోసం తమిళనాడుకు చెందిన కుమారస్వామి.. రమేశ్ తో పాటు మొత్తం 60 మంది దీని కోసం పని చేస్తున్నారు. రాత్రింబవళ్లు కష్టపడుతోన్న ఈ టీం.. ఈ తలుపులకు వినియోగించే చెక్కను బలార్షా టేకును ఉపయోగిస్తున్నారు. బంగారు పూతతో కూడిన 18 ప్రదాన ద్వారాల తలుపులతో పాటు మరో 100 తలుపుల్ని తయారు చేశారు. యాదాద్రి ఆలయంలోని కలప కళాక్రతులను కూడా ఇక్కడే తయారు చేశారు.

అయోధ్యలోని రామ మందిర ప్రాంగణానికి అవసరమైన తలుపు తయారీలో నాణ్యమైన కలపను వినియోగిస్తున్నట్లుగా టింబర్ డిపో యజమాని చెబుతున్నారు. పనులు దాదాపు పూర్తి అయ్యాయని.. తమ శిల్పకళ బాగుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తమను అభినందించినట్లుగా పేర్కొన్నారు. అయోధ్య రామమందిర తలుపుల్ని తయారు చేసే అవకాశం తమకు దక్కటం ఎంతో గర్వంగా ఉందని చెబుతున్నారు.

తలుపుల్ని తయారు చేసే టెండర్ల కోసం దేశంలోని పేరున్న ఎన్నో కంపెనీలు పోటీ పడిన విషయాన్ని అనురాధ టింబర్ డిపో యజమాని చదలవాడ శరత్ బాబు తెలిపారు. తలుపుల టెండర్ కోసం ఎల్ అండ్ టీ, టాటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలు పోటీ పడ్డాయని.. గత ఏడాది ఇంటర్వ్యూలకు తమను పిలిచారని తెలిపారు.తమకు యాదాద్రి తో పాటు పలు దేవాలయాలకు పని చేసిన అనుభవం ఉండటంతో తమకు అవకాశం దక్కినట్లుగా పేర్కొన్నారు. మొత్తంగా అయోధ్య రామాలయ తలుపులు హైదరాబాద్ నుంచి వెళుతుండటం ఆసక్తికర అంశంగా చెప్పక తప్పదు.

Tags:    

Similar News