అతడి దగ్గర 26 కార్లు.. క్రాస్ చెక్ చేస్తే షాకింగ్ నిజాలు
ఎన్ని స్కాంలు.. మరెన్ని మాయలు తెర మీదకు వచ్చినా మారని పరిస్థితి. దీనికి తగ్గట్లే.. బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. తాజాగా మరో కేటుగాడి ఉదంతాన్ని హైదరాబాద్ పోలీసులు బట్టబయలు చేశారు.
ఇలా పెట్టుబడి పెట్టండి.. అలా డబ్బులు సంపాదించండి. ఇటీవల కాలంలో సంపద సృష్టి మీద మోజు అంతకంతకూ ఎక్కువ అవుతోంది. అందుకే.. ఎవరైనా ఇలా పెట్టుబడి పెడితే అలా డబ్బులు వచ్చేస్తాయని కథ చెప్పినంతనే.. ట్యూన్ కావటమే కాదు లక్షల రూపాయిలు పెట్టుబడి రూపంలో పెట్టేస్తున్నారు. అడ్డంగా బుక్ అవుతున్నారు. ఎన్ని స్కాంలు.. మరెన్ని మాయలు తెర మీదకు వచ్చినా మారని పరిస్థితి. దీనికి తగ్గట్లే.. బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. తాజాగా మరో కేటుగాడి ఉదంతాన్ని హైదరాబాద్ పోలీసులు బట్టబయలు చేశారు.
ఏపీలోని కోనసీమ జిల్లాకు చెందిన విశ్వ ఫణీంద్ర జీవనోపాధి కోసం హైదరాబాద్ కు వచ్చాడు. తన అడ్డాను గాజులరామారంలో పెట్టాడు. వీవీఆర్ కార్ ట్రావెల్స్ పేరుతో ఒక ట్రావెల్ ఏజెన్సీని షురూ చేశాడు. కార్లను అద్దె పేరుతో తీసుకొని.. ప్రతి నెలా ఆకర్షణీయమైన మొత్తాన్ని ఇస్తానంటూ మాటలు చెప్పేవాడు. దీంతో.. అతడి మాటలకు ఆకర్షితులైన పలువురు అతనితో కారు అద్దె డీల్ కుదుర్చుకునేవాడు.
చెప్పిన మాట మీద కట్టుబడి ఉన్నట్లుగా బిల్డప్ ఇస్తూ.. మూడు.. నాలుగు నెలలు అద్దె మొత్తాన్ని ఠంఛన్ గా చెల్లించేవాడు. ఆ తర్వాత ఏవో మాటలు చెప్పేవాడు తప్పించి.. డబ్బులు ఇచ్చేవాడు కాదు. ఈ క్రమంలో ట్రావెల్ ఆఫీసు మూసేసి.. జంప్ అయ్యాడు. దీంతో.. అతడితో డీల్ చేసుకున్న పలువురు లబోదిబో అంటూ పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసిన వారు.. ఎట్టకేలకు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. అనేక మందితో అద్దె పేరుతో డీల్ చేసుకున్న అతడు.. ఆ కార్లను ఏపీకి తీసుకెళ్లి తక్కువ ధరలకు అమ్మేసేవాడు. ఇలా మొత్తం 26 కార్లను సేకరించి.. అమ్మినట్లుగా గుర్తించారు. వాటిని రికవరీ చేసిన పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్ల విలువ దగ్గర దగ్గర రూ.2.5కోట్ల వరకు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. అందుకే.. ఎవరైనా డబ్బులు భారీగా వస్తాయని మాటలు చెప్పినంతనే వారి మాటలకు పడిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ఒక్క మాటను పదే పదే గుర్తు తెచ్చుకోవటం చాలా అవసరం. ఇంతకూ ఆ మాటేమంటారా? అదేనండి.. డబ్బులు ఊరికే రావు!