క్రికెట్ బాల్స్ నూ వదలని హెచ్ సీఏ అవినీతి రొచ్చు.. ఈడీ వేట ముమ్మరం

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ).. అవినీతికి మారు పేరు.. జట్ల ఎంపికలో విమర్శలకు పెట్టింది పేరు..

Update: 2024-10-17 20:30 GMT

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ).. అవినీతికి మారు పేరు.. జట్ల ఎంపికలో విమర్శలకు పెట్టింది పేరు.. వందల కోట్లు దుర్వినియోగం అభియోగాలు.. ఏ ప్రాజెక్టు తీసుకున్నా ఆరోపణలే.. ఆఖరికి మ్యాచ్ టికెట్లలోనూ గోల్ మాల్.. పైగా హెచ్ సీఏలో కుమ్ములాటలు.. మొదటి నుంచి ఇదే ధోరణి.. ఇప్పుడు ఉప్పల్ స్టేడియంలో బ్లాక్ టికెట్ల దందాపై ఈడీ గట్టిగా నజర్ పెట్టింది. దీంతో మున్ముందు మరిన్ని చిక్కులు తప్పవా అన్నట్లుంది పరిస్థితి.

బీసీసీఐ పరిశీలనకు వెళ్తుందా..?

బీసీసీఐ పరిధిలో 30 కిపైగా రాష్ట్రాల క్రికెట్ సంఘాలు ఉన్నాయి. దీంతో ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం కుదరడం లేదా..? లేక చూసీ చూడనట్లుగా వదిలేస్తున్నదా? అనేది తెలియదు కానీ హెచ్ సీఏ వ్యవహార శైలిపై బోర్డు పెద్దలు ఎప్పుడు స్పందిస్తారనేది చూడాల్సి ఉంది. మొన్నటివరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు జైషా బీసీసీఐ కార్యదర్శిగా ఉన్నారు. అత్యంత శక్తిమంతమైన వ్యక్తి అయిన జై షా హయాంలో కూడా హెచ్ సీఏ విషయంలో చర్యలు తీసుకోలేకపోయారన్న విమర్శలున్నాయి.

మూడు కంపెనీలకు నోటీసులు

హెచ్ సీఏ అవకతవకలకు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. తాజాగా దర్యాప్తు సంస్థ మూడు కంపెనీలకు సమన్లు జారీ చేసింది. ఈడీ ఇప్పటికే టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, హెచ్ సీఏ అధ్యక్షుడు మొహమ్మద్ అజహరుద్దీన్ ను ఈ నెల 8న విచారించింది. కొన్ని గంటల పాటు ఆయన విచారణ జరిగింది. అజహర్ ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగానే బాడీ డ్రెంచ్ ఇండియా, సర స్పోర్ట్స్, ఎక్స్లెంట్ ఎంటర్ ప్రైజెస్ కు ఈడీ నోటీసులిచ్చింది. వీటన్నిటినీ ఈ నెల 22న విచారణకు రావాలని ఆదేశించింది.

క్రికెట్ బంతుల కొనుగోళ్లలోనూ..

ఉప్పల్ స్టేడియంలో నిధుల గోల్ మాల్ ఆరోపణలున్నాయి. స్టేడియంలోని జనరేటర్లు, జిమ్ పరికరాలు ఆఖరికి క్రికెట్ బంతులు, ఇతర వస్తువుల కొనుగోలులోనూ అవకతవకలు జరిగాయంటూ ఈడీ విచారణ జరుపుతోంది. కాగా, బంతుల కొనుగోలులోనూ అవినీతి అనేది వినేందుకు ఎబ్బెట్టుగా ఉంది. కాగా, మొహమ్మద్ అజహరుద్దీన్ 2000 నుంచి మూడేళ్ల పాటు హెచ్ సీఏ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ సమయంలో రూ.కోట్ల నిధుల గోల్ మాల్ జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఏడాది ఆగస్టులో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ ఆడిట్ నిర్వహించింది. ఈ ఆడిట్ లోనే క్రికెట్ బంతుల కొనుగోలులోనూ అవకతవకలు బయటపడ్డాయి. దీంతోనే ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అజహర్ పై మొత్తం నాలుగు కేసులు నమోదవడం గమనార్హం.

Tags:    

Similar News