ఫంక్షన్ హాల్సే వారి టార్గెట్.. బంధువులమని చెప్పి..

వివాహం అంటే బంధుమిత్రులను అందరినీ పిలుచుకుంటూ ఉంటాం.

Update: 2024-12-16 11:30 GMT

వివాహం అంటే బంధుమిత్రులను అందరినీ పిలుచుకుంటూ ఉంటాం. ఎక్కడెక్కడి నుంచో పెళ్లికి వచ్చి ఆశీర్వదిస్తుంటారు. ఒకటి కాదు రెండు కాదు.. కొన్ని చోట్ల ఐదు రోజుల పెళ్లిళ్లు జరుపుతుంటారు. ఆ వారం రోజులపాటు ఉండే హడావిడి అంతా ఇంతా కాదు. అయితే... కొందరు పెళ్లి పేరు చెప్పుకొని ఇంట్లోకి చొరబడి రాబడికి పాల్పడుతుండడం ఆందోళన కలిగించే అంశం.

భాగనగరంలో గత నెల రోజులుగా పెళ్లిళ్లు బోలెడన్ని జరుగుతున్నాయి. ఇక వివాహాలు జరుగుతున్న సమయంలో ఉండే హడావిడి అంతాఇంతా కాదు. పెళ్లికి నెల రోజుల ముందు నుంచే హడావిడి ఉంటుంది. ఇక పెళ్లి రోజున ఎవరు వస్తున్నారో.. ఎవరు వెళ్తున్నారో కూడా గుర్తించలేని పరిస్థితులు ఉంటాయి. వచ్చిన వారిలో కూడా పొరపాటున కూడా మీరు ఎవరు అని అడగలేం. ఒకవేళ ఎవరినైనా అడిగితే నిజంగానే వారు బంధువులు అయితే ఇక వారితో సంబంధాలు కట్ అయినట్లే. పెళ్లికి పిలిచి అవమానించారంటూ ఫీలవుతారు. అందుకే పెళ్లికి ఎవరు వస్తున్నా.. ఎవరు వచ్చి తింటున్నారనేది కూడా ఎవరు పట్టించుకోరు. కానీ.. దీనిని ఆసరాగా చేసుకొని బంధువులు అనే ముసుగులో కొంత మంది దోపిడీలకు పాల్పడుతున్నారు.

హైదరాబాద్‌లోని షేక్‌పేట్‌లో ఎంతో హడావిడిగా ఓ వివాహ వేడుక జరుగుతోంది. దీనిని చూసిన ఇద్దరు మహిళలు బంధువులమని చెప్పి ఆ వివాహానికి వచ్చారు. పెళ్లికి చుట్టాలు ఎలా అయితే రెడీ అయి వస్తారో వారు కూడా అదే తీరుగా ముస్తాబై వచ్చారు. అందరినీ పలకరిస్తూ ఏకంగా పెళ్లి కూతురు గదికి చేరుకున్నారు. కొద్దిసేపటి వరకు అక్కడున్న వారితో ముచ్చటించి.. కాసేపటికే మాయం అయ్యారు.

బంధువులంతా తేరుకునే సరికే వారు అక్కడి నుంచి జంప్ అయ్యారు. అప్పటికే ఆ గదిలోని హారం మిస్ అయింది. దాంతో సీసీ టీవీ కెమెరా ఫుటేజీలో అంతా వెతికారు. ఇక అప్పుడు అసలు విషయం బయటపడింది. చోరీ జరిగినట్లు గుర్తించారు. అలాగే.. ఆసిఫ్‌నగర్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. అక్కడ కూడా వివాహం జరుగుతున్న ఇంట బంగారం మాయమైంది. కుటుంబసభ్యులంతా పెళ్లి పనుల్లో బిజీగా ఉంటే.. బంధువుల పేరిట ఇంట్లోకి ప్రవేశించి సొత్తు ఎత్తుకెళ్లారు. చివరకు పోలీసులకు చిక్కారు. ఇటీవల ఓ వ్యాపారి కొడుకు పెళ్లి వేడుకలోనూ ఇదే జరిగింది. వరుడి స్నేహితుడిని అని చెప్పుకుంటే వచ్చి సెల్‌ఫోన్లు కొట్టేశాడు. ఆదిభట్ట పరిధిలో ఫంకన్ హాలులో జరిగిన పెళ్లిలో బంధువుల వేషంలో వచ్చిన దొంగల ముఠా భారీ ఎత్తున నగదు, నగలున్న బ్యాగును మాయం చేసింది. అయితే.. అంతర్రాష్ట్ర దొంగల ముఠానే ఫంక్షన్ హాల్స్‌లో చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇలా ఇప్పటివరకు 20కి పైగా చోరీలు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అందుకే.. పెళ్లి వేడుకలోనూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Tags:    

Similar News