హైదరాబాద్ కు కొత్త సొగసు... సోలార్ సైక్లింగ్ ట్రాక్!

ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగిన ఎకో ఫ్రెండ్లీ సోలార్ సైకిల్ ట్రాక్ ను హైదరాబాద్ మెట్రో డెవలప్ మెంట్ అథారిటీ అందుబాటులోకి తీసుకొచ్చింది.

Update: 2023-10-02 16:38 GMT

అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని చెబుతున్న హైదరాబాద్ కి తాజాగా మరో సొగసు వచ్చి చేరింది. ఇందులో భాగంగా... భారతదేశంలోనే తొలి సోలార్ సైక్లింగ్ ట్రాక్.. హైదరాబాద్ లో ప్రారంభమైంది. హైదరాబాద్‌ అవుటర్‌ రింగ్‌ రోడ్డును ఆనుకుని 23 కి.మీ. మేర నిర్మించిన సైకిల్‌ ట్రాక్‌ ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తోంది.

అవును... హైదరాబాద్ నగర వాసులకు సరికొత్త సైకిల్ ట్రాక్ అందుబాటులోకి వచ్చింది. ఇందులో భాగంగా... ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగిన ఎకో ఫ్రెండ్లీ సోలార్ సైకిల్ ట్రాక్ ను హైదరాబాద్ మెట్రో డెవలప్ మెంట్ అథారిటీ అందుబాటులోకి తీసుకొచ్చింది. మంత్రి కేటీఆర్ ఈ ట్రాక్ ను ప్రారంభించారు. అనంతరం హైదరాబాద్‌ సైక్లిస్ట్‌ గ్రూప్‌ (హెచ్‌.సీ.జీ) ప్రతినిధులతో కలిసి మంత్రి కాసేపు సైకిలు తొక్కారు.

ఈ సందర్భంగా స్పందించిన మంత్రి కేటీఆర్... ఈ తరహా ట్రాక్‌ దేశంలోనే మొదటిది అని.. దక్షిణ కొరియాలో ఉన్న ట్రాక్‌పై అధికారులతో అధ్యయనం చేయించి ఇక్కడ ఏర్పాటు చేశామని తెలిపారు. ఇదే సమయంలో దీనితోపాటు త్వరలోనే నానక్‌ రాంగూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్, కోకాపేట నియోపోలిస్‌, బుద్వేల్‌ లలోనూ ఇటువంటి సైకిల్‌ ట్రాక్ లను నిర్మిస్తామని తెలిపారు.

ఇదే సమయంలో గండిపేట చెరువు చుట్టూ 46 కి.మీ. సైకిల్‌ ట్రాక్‌ ఏర్పాటు చేస్తామని తెలిపిన మంత్రి కేటీఆర్... అంతర్జాతీయ సైక్లింగ్‌ వేడుకలకు వేదికగా హైదరాబాద్ నిలవనుందని చెప్పారు. ఇదే సమయంలో... ఈ సైకిల్‌ ట్రాక్‌ పై ఉన్న సోలార్ పైకప్పుతో 16 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

సుమారు 100 కోట్ల రూపాయల వ్యయంతో 4.25 మీటర్ల వెడల్పుతో 23 కిలో మీటర్ల మేర మూడు లేన్లల్లో ఈ ట్రాక్ ను నిర్మించారు. ఇందులో భాగంగా నానక్ రాంగూడ నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు 8.5 కిలోమీటర్లు.. అదేవిధంగా నార్సింగ్ నుంచి కొల్లూరు వరకు 14.5 కిలోమీటర్లు నిర్మించారు.

ఈ ట్రాక్ పై వివిధ రకాల ఫుడ్ కోర్టులు అందుబాటులో ఉంటాయి. సందర్శకులకు, సైకిలిస్ట్ లకు త్రాగు నీరు సదుపాయం ఉంటుంది. ఇదే సమయలో రెస్ట్ రూంస్ కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక ట్రాక్ కు ఇరువైపులా సువాసనలను వెదజల్లే పూల మొక్కలను ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News