గమనించారా? హైడ్రా.. మూసీపై రేవంత్ సర్కారు వెనకడుగు?

చివరకు హైడ్రా అన్నంతనే సామాన్యులు మండిపడే వరకు వెళ్లింది. దీంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో హైడ్రా కూల్చివేతల విషయంలో తక్షణం నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చింది.

Update: 2024-10-17 10:30 GMT

గత డిసెంబరులో కొలువు తీరిన రేవంత్ సర్కారు గురించి నాలుగు ముక్కలు చెప్పండంటే.. అందరికి గుర్తుకు వచ్చేది హైడ్రానే. మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం..భారీగా చేపట్టిన రైతు రుణమాఫీ.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాల కంటే కూడా హైడ్రా కూల్చివేతలు.. మూసీ పేరుతో జరిగిన హడావుడితో పాటు రాష్ట్రంలో నీరసించిన రియల్ ఎస్టేట్ వ్యాపారం మీదనే చర్చంతా జరుగుతోంది. నిజానికి హైడ్రా విషయంలో రేవంత సర్కారుకు మొదట్లో పాజిటివ్ గానే ఉన్నప్పటికి.. ఎప్పుడైతే మధ్యతరగతి.. దిగువ మధ్యతరగతికి సంబంధించిన వారి అంశాల్లో ప్రదర్శించిన దూకుడు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా చేసింది.

నిజానికి రేవంత్ సర్కారు హైడ్రా విషయంలో ఐపీఎస్ అధికారి రంగనాథ్ కు ప్రీ హ్యాండ్ ఇచ్చిందనే చెప్పాలి. అయితే.. ఆ సదవకాశాన్ని వినియోగించుకునే విషయంలో రంగనాధ్ దూడుకు రేవంత్ సర్కారుకు పెద్ద తలనొప్పిగా మారింది. తాము చేపట్టే చర్యల కారణంగా చోటు చేసుకునే పరిణామాల్నిగుర్తించే విషయంలో రంగనాధ్ వైఫల్యం రేవంత్ సర్కారుకు పెద్ద తలనొప్పిగా మారింది. చివరకు హైడ్రా అన్నంతనే సామాన్యులు మండిపడే వరకు వెళ్లింది. దీంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో హైడ్రా కూల్చివేతల విషయంలో తక్షణం నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చింది.

అదే సమయంలో దిద్దుబాటు చర్యల్ని చేపట్టి.. భవిష్యత్తులో హైడ్రాను మళ్లీ రంగంలోకి దింపితే.. కూల్చివేతల లెక్కలు ఎలా ఉండాలి? ఏయే అంశాల మీద ఏ రీతిలో రియాక్టు కావాలన్న దానిపై మదింపు జరుగుతున్నట్లు చెబుతున్నారు. హైడ్రా కారణంగా ప్రభుత్వానికి జరిగిన డ్యామేజ్ నేపథ్యంలో.. ఇప్పట్లో మళ్లీ హైడ్రాను తెర మీదకు తీసుకొచ్చి.. దూకుడు దాని కార్యకలాపాలు నిర్వహించే పరిస్థితి లేదన్న మాట వినిపిస్తోంది.

మరోవైపు.. మూసీ ప్రక్షాళన మీద ఫోకస్ చేసిన రేవంత్ సర్కారు దీనిపై పెద్ద కసరత్తే చేసింది. గత ప్రభుత్వం మూసీ ప్రక్షాళన కోసం రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసినప్పటికి దాన్ని అమలు చేసే విషయంలో ఆలస్యం చేసింది. గత ప్రభుత్వం తయారు చేసిన రోడ్ మ్యాప్ కు కొన్ని మార్పులు చేసిన రేవంత్ సర్కారు.. కాస్త వేగంగా వెళ్లే ప్రయత్నం చేసింది. ఈ విషయంలోనూ రేవంత్ సర్కారుకు ఎదురుదెబ్బలు తప్పలేదు. వేలాది మంది మూసీ నిర్వాసితులు ఉన్నప్పుడు వారికి ఇంటి సౌకర్యంతో పాటు.. మధ్యతరగతి.. ఎగువ మధ్యతరగతికి చెందిన ఆస్తుల సేకరణ ఎలా? వాటికి అవసరమైన నిదులు భారీగా ఉండటంతో దాని పరిష్కారం ఏమిటన్నది ప్రశ్నగా మారింది.

ఈ క్రమంలో ప్రభుత్వానికి మైలేజీ కంటే డ్యామేజీనే ఎక్కువగా చేస్తున్న హైడ్రా.. మూసీ విషయంలో గతంలో మాదిరి దూకుడు ప్రదర్శించకుండా ఆచితూచి అడుగులు వేయాలన్న ఆలోచనలో రేవంత్ సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైతే హైడ్రాను పూర్తిగా ఆపేసినట్లుగా చెబుతున్నారు. భవిష్యత్తులో హైడ్రాను తెర మీదకు తీసుకొస్తే.. ఏం చేయాలి? ఎలా చేయాలి? విమర్శలకు దూరంగా ఉండేలా ఎలాంటిచర్యలు తీసుకోవాలన్న దానిపై కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా అయితే.. రేవంత్ సర్కారుకు తలనొప్పుల్ని తెచ్చి పెట్టిన ఈ రెండు ఇష్యూలను కొంతకాలం నెమ్మదించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News