భారత్ మరో మైలురాయి.. హైపర్ సోనిక్ క్షిపని ప్రయోగం సక్సెస్

క్షిపణి పరీక్ష విజయవంతం అయినట్లు దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు.

Update: 2024-11-17 07:20 GMT

భారత్ మరో అరుదైన ఘనతను సాధించింది. మొదటిసారి దీర్ఘశ్రేణి హైపర్ సోనిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. తద్వారా దీర్ఘశ్రేణి హైపర్ సోనిక్ క్షిపణులున్న జాబితాలో భారత్ సైతం చేరింది. కాగా.. ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్‌లో ఈ ఉదయం ఈ క్షిపణి పరీక్ష సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. క్షిపణి పరీక్ష విజయవంతం అయినట్లు దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు.

హైపర్ సోనిక్ క్షిపణి ప్రయోగానికి సంబంధించిన వీడియోను ఈ మేరకు రక్షణ శాఖ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను సైతం ఛేదింగల సామర్థ్యం ఈ క్షిపణికి ఉంది. దీంతో భారత్ మరో మైలురాయిని క్రాస్ చేసింది. పలురకాల వార్ హెడ్‌లను అమర్చేలా దీనిని డిజైన్ చేశారు. క్షిపణి గమనాన్ని వివిధ వేదికల నుంచి జాగ్రత్తగా ట్రాక్ చేసినట్లు పేర్కొంది. చివరి దశలో అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఢీకొన్నట్లు డీఆర్డీవో సైతం వెల్లడించింది.

ప్రయోగం విజయవంతం కావడంపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. దీర్ఘశ్రేణి హైపర్ సోనిక్ క్షిపణి విజయవంతం చేసినందుకు బృందాన్ని అభినందించారు. భారతదేశం ప్రధాన మైలురాయిని సాధించిందని పేర్కొన్నారు. ఇది చారిత్రాత్మక క్షణం అని వివరించారు.

ఈ క్షిపణి గంటకు 6,200 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణించగలదు. దీనికి మరింత పదును పెడితే గంటకు 24,140కిలోమీటర్ల వేగాన్ని సైతం అందుకోగలవు. అంత స్పీడ్‌లో శత్రుదేశాల రాడార్లు, గగనతల రక్షణ వ్యవస్థలకు చిక్కకుండా తన దిశను మార్చుకోగలదు. దీనికి ఘన ఇంధన ఇంజిన్ అమర్చి ఉండడంతో దాదాపు 30 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంటుంది. అక్కడి నుంచి రాకెట్ ఇంజిన్ సెపరేట్ అవుతుంది. దీనికి అమర్చిన గ్లైడ్ వెహికల్ మాత్రం లక్ష్యం దిశగా దూసుకుపోతుంది. రక్షణ వ్యవస్థలను ఛేదించి దాడిచేసే హైపర్ సోనిక్ ఆయుధాలను రష్యా తయారుచేసింది. చైనా సైతం 2017లో డీఎఫ్ 17 మధ్యశ్రేణి క్షిపణిపై అమర్చిన హైపర్ సోనిక్ ఆయుధాన్ని పరీక్షించింది. చైనా లాంగ్ మార్చ్ రాకెట్‌తో ఫోబ్స్‌ను పోలిన ఆయుధాన్ని పరిశీలించింది. అమెరికా సైతం తాజాగా హైపర్ సోనిక్ పరిజ్ఞానాన్ని విజయవంతం చేసింది. మరోవైపు.. భారత్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఉత్తర కొరియాలు ఈ తరహా పరిజ్ఞానానికి ప్రయోగాలను ముమ్మరం చేశాయి. అయితే.. తాజాగా భారత్ ప్రయోగించి సక్సెస్ అయింది.

Tags:    

Similar News