జగన్ ని నమ్ముకుంటే న్యాయమే...క్యాడర్ కి అసలైన సందేశం !

సిద్ధం పేరుతో కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే ప్రాంతీయ సదస్సులను ఆయన శనివారం విశాఖ జిల్లా భీమునిపట్నం నుంచి ప్రారంభించారు.

Update: 2024-01-27 13:00 GMT

నన్ను నమ్ముకున్న వారికి ఎపుడూ అన్యాయం చేయలేదు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ జిల్లా భీమిలీ సభ సాక్షిగా క్యాడర్ కి అసలైన సందేశం ఇచ్చారు. వైసీపీని జగన్ ని నమ్మిన వారికి మంచి చేశాను అని ఆయన అన్నారు. సిద్ధం పేరుతో కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే ప్రాంతీయ సదస్సులను ఆయన శనివారం విశాఖ జిల్లా భీమునిపట్నం నుంచి ప్రారంభించారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ తనకు ఉన్నది విశ్వసనీయత అన్నారు. తాను చెప్పింది చేస్తాను అన్నారు. నమ్మించి మోసం చేయడం చంద్రబాబు నైజం అని దుయ్యబట్టారు. దేశంలో ఏ రాజకీయ పార్టీలో లేని విధంగా క్యాడర్ ని ఆదరిస్తోంది వైసీపీ మాత్రమే అని జగన్ చెప్పారు. వైసీపీలో ఎవరైనా ఏ పదవికైనా పోటీ పడవచ్చు అని జగన్ అన్నారు.

వార్డు మెంబర్ నుంచి ఎంపీ దాకా అన్ని పదవులకూ అందరూ సమర్ధులే అన్నారు. ఈ విషయంలో సామాజిక న్యాయాన్ని తుచ తప్పకుండా అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదే అని ఆయన చెప్పారు. ఈ రికార్డు ఒక్క వైసీపీకే సొంతం అన్నారు. బడుగుల కోసం కార్పోరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత కూడా వైసీపీదే అన్నారు.

వాలంటీర్ల ద్వారా అన్ని పనులు గ్రామాల్లో పట్టణాలలో జరుగుతున్నాయని అనుకోవద్దు అని ఆయన అన్నారు. వారు కూడా వైసీపీ మీద అభిమానంతో ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన మనలోకి వారే అని గుర్తించాలని అన్నారు. ప్రజలకు మంచి చేయాలన్నదే వైసీపీ కార్యకర్త లక్ష్యంగా ఉండాలని ఆయన సూచించారు.

మాట ఇస్తే తప్పడం వైసీపీలోనే లేదని అన్నారు. అలాగే జగన్ని నమ్ముకుంటే వారికి కచ్చితంగా న్యయం చేస్తాను అని కూడా అన్నారు. పార్టీ అంటే తన ఒక్కడిదే అనుకుంటే పొరపాటు ఇందులో ప్రతీ కార్యకర్తకూ వాటా ఉందని అన్నారు. తాను కూడా మీలాంటి వాడినే అని జగన్ చెప్పడం విశేషం.

ఇదిలా ఉంటే గత నాలుగైదేళ్ళుగా వైసీపీలో క్యాడర్ కి సరైన న్యాయం జరగలేదు అన్న అసంతృప్తి ఉన్న వారి కోసమే జగన్ ఇలా మాట్లాడారు అని అంటున్నారు. మీరే పార్టీ అయినపుడు దిగులెందుకు అన్నది జగన్ ఇచ్చిన సందేశంగా ఉంది. అలాగే మనమంతా కలసి పేదలకు న్యాయం చేయాలన్నదే టార్గెట్ అన్నారు. ఈ విషయంలో ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అన్న భేద భావం లేదని అన్నారు.

వైసీపీ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది అంటే అదంతా బడుగులు పేదల కోసమే అన్నారు ఆ విషయాన్ని ప్రతీ ఇంటికీ చేరవేయాల్సిన బాధ్యత క్యాడర్ కి ఉందని జగన్ సూచించారు ప్రతిపక్షాలకు ప్రజలు ఎందుకు ఓటేస్తారు అని కూడా జగన్ అనడం విశేషం. ఎంతో మంచి చేసి ఎన్నో రకాలుగా అభివృద్ధి చేసిన వైసీపీకే మరోమారు జనాలు పట్టం కడతారు అన్న దృఢ విశ్వాస్వాన్ని జగన్ వ్యక్తం చేశారు.

చేసిన మేలు చెప్పుకుంటే చాలు అని క్యాడర్ కి సూచించారు. చంద్రబాబు పాలనను జగన్ పాలనను జనాల ముందు పెట్టి వారినే ఏ ప్రభుత్వంలో మంచి జరిగిందో చెప్పాలని కోరాలని జగన్ అన్నారు. వైసీపీ మళ్లీ తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వస్తుందని అన్నారు. ఏకంగా 175 సీట్లూ వైసీపీవే అని జగన్ అన్నారు. ఈసారి యుద్ధంలో టీడీపీ సహా అన్ని పార్టీలు మట్టి కరుస్తాయని జగన్ జోస్యం చెప్పారు.


Tags:    

Similar News