మహిళా ఓటర్లను నమ్ముకుంటే మునిగిపోతారా?

తమకు గెలుపు ఖాయమని.. మహిళలకు ఇచ్చిన డబ్బులు కచ్ఛితంగా ఓటు రూపంలో తిరిగి వస్తుందని తెలుగుదేశం పార్టీ భావించింది.

Update: 2024-06-05 10:21 GMT

ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల వేళలో.. మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు వీలుగా.. పోలింగ్ కు రోజుల ముందు ‘పసుపు కుంకుమ’ పేరుతో నాటి చంద్రబాబు ప్రభుత్వం వారి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు వేయటం తెలిసిందే. పోలింగ్ కు రోజుల ముందు వేసిన డబ్బులు కావటంతో మహిళా ఓటర్లు తమకు ఓట్లు వేస్తారని భారీగా లెక్కలు వేశారు. అదే విషయాన్ని చెప్పుకున్నారు. తమకు గెలుపు ఖాయమని.. మహిళలకు ఇచ్చిన డబ్బులు కచ్ఛితంగా ఓటు రూపంలో తిరిగి వస్తుందని తెలుగుదేశం పార్టీ భావించింది.

కట్ చేస్తే.. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓటమిపాలైంది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి నేత్రత్వంలోని వైసీపీ 151 సీట్లతో సంచలన విజయాన్నిసొంతం చేసుకున్నారు. తన ఐదేళ్ల పాలనలో డీబీటీ పద్దతి ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాల పేరుతో ప్రతి నెలా.. రెండు నెలలకు ఒకసారి డబ్బులు వారి చేతులకు వెళ్లేలా ప్లాన్ చేయటం.. బటన్ నొక్కే కార్యక్రమంతో లక్షలాది మంది మహిళలకు అన్నలా ఉన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ఫీలయ్యారు.

తాజాగా జరిగిన ఎన్నికల వేళలోనూ.. తమ సంక్షేమ పథకాల ద్వారా మహిళల చేతికి భారీగా డబ్బులు ఇచ్చిన నేపథ్యంలో.. వారు తిరిగి తమకు ఓటు రూపంలోఅధికారాన్ని కట్టబెడతారని భావించటమే కాదు.. ఇదే విషయాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. భారీగా పోలైన ఓట్లు తమకు అనుకూలంగా పడ్డాయని భావించారు. పెరిగిన మహిళా ఓటర్ల శాతం కూడా తమకు పట్టం కట్టేందుకే అన్నట్లుగా ఫీలయ్యారు. కట్ చేస్తే.. ఈసారి ఎన్నికల్లో గత ఎన్నికలకు మించి టీడీపీ కూటమికి ఏకంగా 164 సీట్లు వచ్చాయి.

విపక్షానికి చివరకు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి. ఈ రెండు ఉదంతాల్ని చూస్తే అర్థమయ్యేది ఒక్కటే. మహిళా ఓటర్లను ప్రలోభాలకు గురి చేసి.. వారి బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు వేయటం ద్వారా తమకు ఓట్లు వేస్తారని అనుకోవటానికి మించిన తప్పు పని మరొకటి లేదన్న విషయాన్ని రాజకీయ పార్టీలు గుర్తిస్తే మంచిది. సంక్షేమ పథకాలన్నవి పేద.. అణగారిన వర్గాలు.. ఆర్థికంగా బలహీనంగా ఉన్న వారికి చేయూతను ఇచ్చి.. వారి బతుకును మరింత సౌకర్యంగా ఉండేలా చేయటమే ప్రభుత్వ లక్ష్యంగా ఉండాలి. అందుకు భిన్నంగా ఇవాళ నీకిస్తున్నా.. ఎన్నికల వేళ నాకు ఇవ్వాలన్న వ్యాపార ధోరణితో ఎప్పటికైనా ఇబ్బందే.

ఇదే విషయాన్ని ప్రతి ఎన్నికల్లోనూ మహిళలు తమ ఓటు ద్వారా స్పష్టం చేస్తున్నారని చెప్పాలి. రాజకీయ పార్టీకి ఓటరుకు మధ్య అనుబంధం భావోద్వేగంతో ఉండాలే తప్పించి.. వినియోగదారుడికి వ్యాపారస్తుడికి మధ్యనున్నట్లుగా ఉంటే.. ఎవరికి వారు వారి లాభాలు.. ప్రయోజనాలకే పెద్దపీట వేస్తారే తప్పించి.. ఎమోమషనల్ గా కనెక్టు కాదన్న లాజిక్ ను అధికారంలో ఉన్న వారు మర్చిపోతున్నారు. మన ఇంటి చివర ఉన్న కిరాణా షాపు అతని దగ్గర వస్తువుల ధరలు ఎక్కువైనప్పటికీ చిన్న చిన్న వస్తువుల్ని ఇంటి దగ్గర ఉన్న షాపు అతను దగ్గరే కొంటాం. చిన్న వాటి కోసం దూరాన ఉండే హోల్ షాపులో తక్కువ ధరకు వస్తున్నా వెళ్లం. కానీ.. ఇంటి అవసరాలు పెద్దగా ఉన్నప్పుడు.. కాస్త కష్టమైనా.. ముఖ పరిచయం లేకున్నా తక్కువ ధరకు వస్తువులు దొరికే హోల్ సేల్ షాపుకు వెళతాం. ఎందుకో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

సంక్షేమ పథకాల కోసం ప్రతి ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. కాస్తంత ఎక్కువ తక్కువ. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుణ్యమా అని సంక్షేమ పథకాలకు భారీ ఎత్తున నిధుల్ని ఖర్చు చేయటమనే సంస్క్రతి ఎక్కువైంది. అలా ఇవ్వకపోతే నేరంగా మారి.. అధికారంలోకి రామన్న భయంలోకి పార్టీలు వెళ్లిపోయాయి. దీంతో అధికారంలో ఎవరున్నా కూడా సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిందే. కానీ.. ఆ పేరుతో ఓట్లు వస్తాయనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఇక..ఒక వర్గాన్ని టార్గెట్ చేసి.. ఆ వర్గానికి మేలు చేస్తే ఆ వర్గంలోని వారంతా గంపగుత్తిగా ఓట్లు వేస్తారనుకోవటం కూడా భ్రమే. ఇప్పటి డిజిటల్ ప్రపంచంలో అలాంటి ఆలోచనలు కాలం చెల్లినవిగా భావించాలి. ఈ విషయం తాజాగా వెల్లడైన ఏపీ ఎన్నికల్ని చూసిన తర్వాత అయినా అర్థమవుతుందని చెప్పాలి. ఇకనైనా.. మహిళా ఓటర్లకు మేలు చేస్తే ఓట్ల వర్షమే అనుకుంటే తప్పులో కాలేసినట్లే. కానీ.. అదే మహిళల జీవితాలు మెరుగుపడేలా నిజాయితీగా కష్టపడితే.. ఓట్లు వర్షం కురుస్తుందన్న వాస్తవాన్ని ఏ రాజకీయ పార్టీ ఎప్పటికి గుర్తిస్తుందో చూడాలి.

Tags:    

Similar News