చాంపియన్స్ ట్రోఫీ జట్టు.. గంభీర్-రోహిత్ విభేదాలు బట్టబయలు

భారత క్రికెట్ జట్టు రోజుకో వివాదంలో చిక్కుకుంటోంది.. కోచ్-కెప్టెన్, కెప్టెన్-సీనియర్ స్టార్.. ఇలా ఒకటి పోతే ఒకటి వివాదాలు తెరపైకి వస్తున్నాయి.

Update: 2025-01-19 12:30 GMT

భారత క్రికెట్ జట్టు రోజుకో వివాదంలో చిక్కుకుంటోంది.. కోచ్-కెప్టెన్, కెప్టెన్-సీనియర్ స్టార్.. ఇలా ఒకటి పోతే ఒకటి వివాదాలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా చాంపియన్స్ ట్రోఫీ జట్టు ఎంపికపైనా ఇలాంటి వార్తలే వస్తున్నాయి. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మలు తలోదారి అన్నట్లుగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.

హార్దిక్ వైపు గంభీర్, గిల్ వైపు రోహిత్.. సెలక్షన్ కమిటీ కన్వీనర్ అజిత్‌ అగార్కర్‌ సారథ్యంలోని కమిటీ

ఇంగ్లండ్ తో మూడు వన్డేల సిరీస్ తో పాటు ఫిబ్రవరిలో జరిగే చాంపియన్స్ ట్రోఫీకీ టీమ్ ఇండియాను శనివారం ప్రకటించింది. ఈ సందర్భంగా మీడియా ముందుకు గంభీర్ కాకుండా రోహిత్ శర్మ రావడం గమనార్హం. దీంతోనే గంభీర్ అయిష్టంగా ఉన్నట్లు కథనాలు వచ్చాయి. ఇక జట్టు ఎంపిక సమావేశంలో పాల్గొన్న గంభీర్.. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు వైస్ కెప్టెన్సీ ఇవ్వాలని ప్రతిపాదించాడట. రోహిత్ మాత్రం వైస్ కెప్టెన్ గా యువ బ్యాటర్ శుభ్ మన్ గిల్ ను తెరపైకి తెచ్చాడట. రోహిత్ కు అగార్కర్ మద్దతు పలకడంతో గిల్ కు వైస్ కెప్టెన్సీ దక్కింది.

వాస్తవానికి పెద్ద టోర్నీలకు జట్టు ప్రకటించినప్పుడు కోచ్ మీడియా ముందుకు వస్తాడు. కానీ, కొన్ని విషయాల్లో తన మాట నెగ్గకపోవడంతో గంభీర్ మీడియాతో మాట్లాడలేదు. హార్దిక్ విషయంలోనే కాదు.. కేరళ బ్యాట్స్ మన్ సంజూ శాంసన్ ప్రస్తావనలోనూ గంభీర్ మాట చెల్లలేదట. చివరగా దక్షిణాఫ్రికాపై ఆడిన వన్డేలో సెంచరీ కొట్టిన శాంసన్ ను తీసుకోవాలని గంభీర్ కోరగా.. రోహిత్, అగార్కర్ మాత్రం పంత్ ఎంపికయ్యాడని సమాచారం.

విజయ్‌ హజారే టోర్నీ సందర్భంగా కేరళ నిర్వహించిన శిబిరానికి శాంసన్ దూరంగా ఉన్నాడు. దేశవాళీల్లోనూ ఆడలేదు. అవే అతడికి ప్రతికూలంగా మారినట్లు తెలుస్తోంది. కాగా, శాంసన్ ను ఎంపిక చేయకపోవడం పట్ల కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ కేరళ క్రికెట్ అసోసియేషన్‌ పై విమర్శలు చేశాడు. ‘సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హాజారే ట్రోఫీ మధ్య శిక్షణ శిబిరం జరిగిందని.. తాను రాలేనంటూ శాంసన్‌ ముందుగానే లేఖ రాశాడని... అయినా అతడిని జట్టు నుంచి తొలగించారని.. అది శాంసన్‌ ను జాతీయ జట్టు నుంచి తప్పించడానికి దారితీసిందని థరూర్ ట్వీట్ చేశారు. ఫామ్‌ లో ఉన్నా క్రికెట్‌ పాలకుల అహం (ఈగో) కారణంగా శాంసన్‌ కెరీర్‌ దెబ్బతిన్నదని తప్పుబట్టారు.

Tags:    

Similar News