మత్స్యకారుడు మృతి... పాక్ కర్కసత్వం, భారత్ నిర్లక్ష్య ఫలితం!
అవును... శిక్షాకాలం పూర్తైనప్పటికీ పాకిస్థాన్ జైల్లోనే మగ్గుతున్న భారతీయ మత్స్యకారుల విషయం తీవ్ర కలకలం రేపుతోంది.
ప్రస్తుతం భారతదేశానికి చెందిన సుమారు 180 మంది మత్స్యకారుల శిక్షా కాలం పూర్తైనప్పటికీ పాకిస్థాన్ జైళ్లలోనే మగ్గుతున్నారనే విషయం తీవ్ర కలకలం రేపుతోంది. వారి విడుదలకు పాక్ అధికారులు పలు కారణాలతో ఆలస్యం చేస్తూ వస్తున్నారని అంటున్నారు. ఈ వ్యవహారంపై భారత్ పలుమార్లు చర్చలు జరిపినా పురోగతి కనిపించకపోవడంతో.. నష్టాలు తెరపైకి వస్తున్నాయి.
అవును... శిక్షాకాలం పూర్తైనప్పటికీ పాకిస్థాన్ జైల్లోనే మగ్గుతున్న భారతీయ మత్స్యకారుల విషయం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో.. ఈ మధ్యకాలంలో అక్కడున్న జైళ్లలో మన మత్స్యకారులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. దీంతో.. భారతదేశానికి చెందిన వారిపై జైళ్లలో పాక్ అధికారుల ప్రవర్తన ఏ స్థాయిలో ఉంటుందో అనేది ఆందోళన కలిగిస్తుంది.
ఈ క్రమంలోనే గత రెండేళ్లలో సుమారు ఎనిమిది మంది భారతీయ మత్స్యకారులు పాక్ జైల్లో మృతిచెందినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో భారతీయ మత్స్యకారుడు పాక్ అధికారుల కర్కసత్వం, భారత అధికార్ల నిర్లక్ష్యం ఫలితంగా మృతి చెందినట్లు తెలుస్తోంది. శిక్షాకాలం ముగిసిన తర్వాత కూడా విడుదలలో జాప్యం కారణంగా నిండు ప్రాణం బలైపోవడం గమనార్హం.
ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి చెందిన అధికారిక వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఇందులో భాగంగా... 2022లో ఓ కేసుకు సంబందించి భారతదేశానికి చెందిన మత్స్యకారుడు బాబును పాకిస్థాన్ అధికారులు అరెస్ట్ చేశారని.. అప్పటి నుంచి అతడు కారాచీలోని ఓ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడని.. ఇటీవలే అతడి శిక్షా కాలం పూర్తైందని తెలిపారు.
అయినప్పటికీ బాబు అనే మత్స్యకారుడిని విడుదల చేయకుండా పాకిస్థాన్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. ఈ క్రమంలోనే గురువారం (జనవరి 23) అతడు జైల్లోనే ప్రాణాలు విడిచాడని వెల్లడించారు. దీంతో... ఇదంతా భారత అధికారుల నిర్లక్ష్యం, అలసత్వం, అసమర్థత ఫలితమా? అనే ప్రశ్న లేవనెత్తబడుతుందని అంటున్నారు!
ఇదే సమయంలో... పాకిస్థాన్ జైల్లో మగ్గిపోతున్న మిగిలిన భారతీయుల విషయంలో అయినా అధికారులు అలర్ట్ గా ఉండాలని పలువురు సూచిస్తున్నారు. అలాకానిపక్షంలో తుది శ్వాస కూడా స్వదేశంలో విడిచే అవకాశాన్ని వారు కోల్పోతారని అంటున్నారు.