భారతీయులకు యూఎస్ విద్యార్థి వీసాల్లో తగ్గుదల... ఎందుకలా?
ఆ విద్యాసంవత్సరంలో చైనా విద్యార్థుల సంఖ్య 2.77 లక్షలు మాత్రమే.
అమెరికాలోని ఇంటర్నేషనల్ విద్యార్థుల్లో తొలిసారిగా భారత్ అగ్రస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. అక్కడ ఉన్న విదేశీ విద్యార్థుల్లో ఎన్నో ఏళ్లుగా ప్రథమ స్థానంలో ఉన్న చైనాను వెనక్కి నెట్టిన భారత్... 2023-24 నాటికి 3.30 లక్షల మంది విద్యార్థులతో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. ఆ విద్యాసంవత్సరంలో చైనా విద్యార్థుల సంఖ్య 2.77 లక్షలు మాత్రమే.
మొత్తం మీద అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థులు సుమారు 11.26 లక్షల మంది ఉండగా.. వారిలో 29 శాతం భారతీయులే ఉండటం గమనార్హం. ఈ స్థాయిలో రికార్డ్ సృష్టించిన తర్వాత.. ఈసారి ఆ సంఖ్యలో భారీ తగ్గుదల కనిపించిందనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ గణాంకాలు తెరపైకి వచ్చాయి.
అవును... అమెరికాలో ఉన్నతవిద్య అభ్యసించేందుకు మన దేశం నుంచి ఏటా వేల మంది విద్యార్థి వీసాలపై అగ్రరాజ్యానికి వెళ్తుంటారు. అయితే... ఈసారి ఆ సంఖ్యలో భారీ తగ్గుదల కనిపించింది. ఈ ఏడాది జనవరి – సెప్టెంబర్ మధ్య భారతీయ విద్యార్థులకు జారీ చేసే ఎఫ్-1 స్టూడెంట్ వీసాలు 38 శాతం తగ్గాయంటూ గణాంకాలు తెరపైకి వచ్చాయి.
బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ వెబ్ సైట్ లో అందుబాట్లో ఉంచిన నివేదికల డేటా ప్రకారం... ఈ సంవత్సరం జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య 64,008 మంది భారతీయ విద్యార్థులకు ఎఫ్-1 వీసాలను జారీ చేశారు. అయితే... గత ఏడాది 1,03,495తో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువ కావడం గమనార్హం.
వాస్తవానికి కోవిడ్ తర్వాత భారతీయ విద్యార్థులకు వీసాలు ఈ స్థయిలో తగ్గడం ఇదే తొలిసారి. ఈ సంఖ్య 2021లో ఇదే సమయానికి 65,235 గా ఉండగా... 2022లో 93,181 మంది భారతీయ విద్యార్థులకు విద్యార్థి వీసాలు దక్కాయి. అయితే మహమ్మారి హీట్ సంవత్సరం 2020లో కేవలం 6,646 ఎఫ్-1 వీసాలు మాత్రమే భారతీయులకు జారీ చేయబడ్డాయి.
అయితే ఈ క్షీణత భారతీయ విద్యార్థులకు మాత్రమే కాదు.. చైనా విద్యార్థులకు జారీ చేసిన వీసాల్లోనూ తగ్గుదల కనిపించింది. ఇందులో భాగంగా... ఈ ఏడాది జనవరి – సెప్టెంబర్ నెలల్లో 73,781 మంది చైనీస్ విద్యార్థులకు వీసాలు అందాయి. కాగా.. గతఏడాది ఇదే సమయంలో ఈ సంఖ్య 80,603గా ఉంది. అంటే.. తగ్గుదల సుమారు 8% అన్నమాట.
అయితే ఈ తగ్గుదల వెనుక ఖచ్చితమైన కారణం అస్పష్టంగా ఉన్నప్పటికీ.. ఈ ఏడాది గరిష్ట వీసా దరఖాస్తు సీజన్ లో భారతీయుల కోసం కేటాయించిన సుమారు 20,000 స్టూడెంట్ వీసా అపాయింట్ మెంట్ స్లాట్లు ఉపయోగించబడలేదని అంటున్నారు.