భారత్ - జర్మనీ.. జననాంగ గాయంతో రెండేళ్ల చిన్నారి.. మరోసినిమా కథలా

''మిష్టర్ ఛటర్జీ వర్సెస్ నార్వే'' ఇదో బాలీవుడ్ సిన్మా.. కొన్నేళ్ల కిందట వచ్చిన ఈ సినిమాకు నిజ జీవిత కథే ప్రేరణ

Update: 2023-08-19 00:30 GMT

''మిష్టర్ ఛటర్జీ వర్సెస్ నార్వే'' ఇదో బాలీవుడ్ సిన్మా.. కొన్నేళ్ల కిందట వచ్చిన ఈ సినిమాకు నిజ జీవిత కథే ప్రేరణ. నార్వేలో ఉండే ఓ భారతీయ దంపతులు తమ చిన్నారిని కొట్టారంటూ అక్కడి పోలీసులు, అధికారులు కేసు నమోదు చేయడం.. బాలికను తీసుకెళ్లి సంరక్షణ కేంద్రంలో ఉంచడం.. ఇది ఆ తల్లిదండ్రులను ఎంతో క్షోభకు గురిచేసింది. దీనిపై వారు తీవ్రమైన పోరాటం చేసి ఎట్టకేలకు ఫలితం సాధించారు. వీరి కథ ఆధారంగానే మిస్టర్ ఛటర్జీ వర్సెస్ నార్వే సినిమా తెరకెక్కింది. ఔను.. యూరప్ దేశాల్లో పిల్లల సంరక్షణ చట్టాలు చాలా కఠినం. భారత్ లోలాగా ఎడాపెడా దండించడం అక్కడ కుదరదు. కనీసం, చిన్న దెబ్బ కొట్టినట్లు కనిపించినా చాలు.. తల్లిదండ్రుల నుంచి పిల్లలను తీసుకెళ్లిపోతారు. అలాంటిదే ఇప్పుడు జర్మనీలో ఓ భారతీయ దంపతులకు జరుగుతోంది. వీరి నుంచి రెండున్నరేళ్ల చిన్నారిని తీసుకెళ్లి రాజధాని బెర్లిన్‌ లోని 'ప్రత్యేక అవసరాలున్న పిల్లలను సంరక్షణ' కేంద్రంలో ఉంచారు.

బేబీ ''ఎం''..

భారతీయ తల్లిదండ్రులు.. లైంగికంగా వేధిస్తున్నారనే ఆరోపణలతో 2021 సెప్టెంబరులో తల్లిదండ్రుల నుంచి ఏడు నెలల వయసున్న పాపను జర్మనీ అధికారులు తీసుకెళ్లిపోయారు. 'బేబీ ఎం' అని పిలుస్తున్న ఆ పాప వయసు ఇప్పుడు రెండున్నరేళ్లు. అంటే రెండేళ్లుగా సంరక్షణ కేంద్రంలోనే ఉంది. తల్లిదండ్రుల హక్కులను రద్దు చేసి మరీ.. బాలికను జర్మనీ ప్రభుత్వం యూత్ వెల్ఫేర్‌ ఆఫీసుకు అప్పగించింది. ఇప్పుడు 'బేబీ ఎం' కేంద్రంగా భారత్ , జర్మనీ మధ్య దౌత్య వివాదం నడుస్తోంది. జూన్ లో బెర్లిన్ కోర్టు బేబీ ఎం తల్లిదండ్రుల హక్కులను రద్దు చేసింది. పాపను భారత్ పంపించాలనే తల్లిదండ్రుల డిమాండ్‌ ను కూడా కొట్టేసింది.

బిడ్డ అక్కడ.. తల్లిదండ్రులు ఇక్కడ..

'బేబీ ఎం' తల్లిదండ్రులు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. బిడ్డను చూడాలని అల్లాడుతున్నారు. ఆమెను తీసుకొచ్చేందుకు మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, ఈ దంపతుల్లో భర్తకు 2018లో జర్మనీలోఉద్యోగం వచ్చింది. 2021 ఫిబ్రవరి 2వ తేదీన 'బేబీ ఎం' పుట్టింది.

కాగా, కోర్టు పత్రాల్లో పేర్కొన్న ప్రకారం, పాపకు ఏడు నెలల వయస్సున్నప్పుడు జననేంద్రియంలో అయిన గాయానికి సంబంధించి జర్మనీ అధికారులు, తల్లిదండ్రులకు మధ్య వివాదం మొదలైంది. నెలల శిశువులో ఇంత తీవ్రమైన జననేంద్రియ గాయాన్ని తామెప్పుడూ చూడలేదని, చిన్నారిపై లైంగిక హింస జరిగి ఉంటుందనే అనుమానంతో జర్మనీ పిల్లల సంరక్షణ సేవల' అధికారులు చిన్నారిని తల్లిదండ్రుల దగ్గర్నుంచి తీసుకెళ్లిపోయారు. అయితే, దీనిని తల్లిదండ్రులు ఖండిస్తున్నారు.

చిన్నారిపై లైంగిక వేధింపులు జరిగినట్లు సూచించే ఆధారాలేమీ లేవని డాక్టర్లు ధ్రువీకరించినట్లు ఆస్పత్రి వర్గాలు కూడా చెప్పాయి. అభియోగాలు నమోదు చేయకుండా పోలీసులు కేసును మూసేశారని వెల్లడించాయి. ప్రమాదవశాత్తు పాపకు గాయమై ఉంటుందని తాము నమ్ముతున్నట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. చిన్నారి వైద్య రికార్డులను పరిశీలించిన అమెరికా, భారత్‌ కు చెందిన ఇద్దరు వైద్యులు కూడా తల్లిదండ్రుల వాదనతో ఏకీభవించారు. అది ప్రమాదవశాత్తు జరిగిన గాయమని భావిస్తున్నారు. తల్లిదండ్రులు ఉద్దేశపూర్వకంగా పదేపదే గాయపరిచి, ఆస్పత్రికి తీసుకెళ్లే అవకాశమే లేదని కోర్టుకు నివేదించిన పత్రాల్లో వైద్యులు పేర్కొన్నారు.

ఆమెకు అయిన గాయాలు 'ఇన్వేసివ్ ఎగ్జామినేషన్' కారణంగా మరింత తీవ్రంగా మారి ఉండొచ్చని వైద్యులు అభిప్రాయపడ్డారు.

అయితే, 'బేబీ ఎం'' ఇంట్లో సురక్షితంగా ఉంటుందనే విశ్వాసం తమకు లేదని జర్మనీ పిల్లల సంరక్షణ అధికారులు వాదించారు. కోర్టు కూడా వారి వాదనను అంగీకరించింది. ఇలా చిన్నారి రెండేళ్లుగా పిల్లల సంరక్షణ కేంద్రంలోనే ఉంది. ఈ కాలంలో పాపతో గడిపేందుకు చాలా తక్కువ సమయాన్ని తమకు కేటాయించారని తల్లిదండ్రులు చెబుతున్నారు. కాగా, చిన్నారి తల్లిదండ్రుల సొంత రాష్ట్రం గుజరాత్ గా తెలుస్తోంది. వీరికి జర్మన్ రాకపోవడం కూడా చిన్నారి గాయం విషయంలో వివరాలు చెప్పేందుకు ఓ ప్రధాన కారణంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News