భారత్ ధని"కుల" దేశం... ఇదిగో తాజా నివేదిక!
భారతదేశంలో ఆర్థిక అసమానతలు గణనీయంగా పెరుగుతున్నాయనే మాట ఎప్పటినుంచో వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
భారతదేశంలో ఆర్థిక అసమానతలు గణనీయంగా పెరుగుతున్నాయనే మాట ఎప్పటినుంచో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సంపద అంతా అతితక్కువ మంది చేతుల్లోనే ఉంటుందని.. ఫలితంగా ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరుగుతున్నాయని అంటారు. ఈ సమయంలో ఈ అభిప్రాయానికి బలం చేకూరుస్తూ వరల్డ్ ఇన్ ఈక్వాలిటీ ల్యాబ్ తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. సంపద అంతా అగ్రకులాల చేతుల్లోనే ఉన్నట్లు తెలిపింది.
అవును... భారత్ లో ఆర్థిక అసమానతలు గణనీయంగా పెరిగాయని చెబుతూ వరల్డ్ ఇన్ ఈక్వాలిటీ ల్యాబ్ ఒక నివేదిక విడుదల చేసింది. ఇందులో భాగంగా.. దేశంలోని బిలియనీర్ సంపదలో సుమారు 90శాతం అగ్రకులాల చేతుల్లోనే కేంద్రీకృతమైందని తెలిపింది. ఇదే క్రమంలో... అంపద పంపిణీకి సంబంధించిన అంశాలను వివరించింది.
దేశంలోని బిలియనీర్ల సంపదలో సుమారు 88.4 శాతం అగ్రకులాల మధ్య కేంద్రీకృతమై ఉందని.. అత్యంత అణగారిన వర్గాలలో షెడ్యూల్ తెగలకు (ఎస్టీ) చెందినవారు సంపన్న భారతీయులలో లేరని నివేదిక డేటా వివరణాత్మక విశ్లేషణను అందిస్తోంది. 2018 - 19 ఆల్ ఇండియా డెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సర్వే ప్రకారం జాతీయ సంపదలో అగ్రవర్ణాల వాటా సుమారు 55% గా వెల్లడించింది.
వాస్తవానికి 1980వ దశకంలో సంపద అసమానతలు పెరగడం ప్రారంభమయ్యాయని అంటారు. ఇది 2000వ సంవత్సరం నుంచి మరింత పీక్స్ కి చేరిందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే 2014-15 నుంచి 2022-223 మధ్యకాలంలో ఈ అసమానతలు శిఖరాగ్రానికి చేరుకున్నాయని గణాంకాలు చెబుతున్నాయి!
ఈ క్రమంలోనే టాప్ 1 మిలియనీర్ల జనాభా దేశంలోని మొత్తం సంపదలో సుమారు 40శాతానికి పైగా నియంత్రిస్తున్నట్లు తాజా నివేదిక పేర్కొంది. ఇది 1980లో 12.5 శాతంగా ఉండటం గమనార్హం!