మాకంటే చాయ్ వాలాతోనే సెల్ఫీలు.. భారత హాకీ ప్లేయర్ ఆవేదన

స్పోర్ట్స్ పట్ల కాస్తోకూస్తో అవగాహన ఉన్నవారిని సడన్ గా భారత జాతీయ క్రీడ ఏదని అడగండి.. ఠక్కున వారు సమాధానం చెప్పలేదు.

Update: 2024-09-27 15:30 GMT

స్పోర్ట్స్ పట్ల కాస్తోకూస్తో అవగాహన ఉన్నవారిని సడన్ గా భారత జాతీయ క్రీడ ఏదని అడగండి.. ఠక్కున వారు సమాధానం చెప్పలేదు. ఎందుకంటే.. మనందరిలోకి క్రికెట్ అంతగా పాతుకుపోయింది.. భారత జాతీయ క్రీడ హాకీ అని పుస్తకాల్లో చదువుకోవడమే కానీ.. దాని గురించి ఆలోచించే వారు, ఆ మ్యాచ్ లను చూసేవారు లేరనే చెప్పాలి. మొన్నటికి మొన్న భారత జట్టు ఒలింపిక్స్ లో వరుసగా రెండోసారి కాంస్య పతకం సాధించింది. అయినా పెద్దగా పట్టించుకున్నవారు లేరు. ఒడిశాలోని నవీన్ పట్నాయక్ ప్రభుత్వం పోషించడంతో భారత హాకీకి ప్రాణం పోసినట్లయింది.

ఆ సన్నివేశం కదిలించింది..

ఎవరు ఒప్పుకొన్నా ఒప్పుకోకున్నా భారత్‌ లో క్రికెట్‌ అంటేనే ఫాలోయింగ్ ఎక్కువ. మిగతా క్రీడల ఆటగాళ్లకు క్రికెటర్ల తర్వాతే గుర్తింపు. ఈ నేపథ్యంలో తమకు ఎదురైన నిరాశాజనకమైన ఘటన గురించి చెప్పాడు భారత హాకీ మిడ్‌ ఫీల్డర్‌ హార్దిక్‌ సింగ్‌. ఎయిర్‌ పోర్టులో అంతర్జాతీయ హాకీ ఆటగాళ్లు ఉన్నా.. వారిని పట్టించుకోకుండా కొందరు సోషల్‌ మీడియా స్టార్‌ డాలీ చాయ్‌ వాలాతో సెల్ఫీ దిగారని వాపోయాడు. దీనిని తలచుకుని తనకు తీవ్ర నిరాశ అలముకుందని చెప్పాడు. తమకు చాలా ఇబ్బందిగా అనిపించిందన్నాడు.

కెప్టెన్ ఉన్నప్పటికీ..

భారత హాకీ కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్. తాజాగా హార్దిక్ చెప్పిన ఘటనలో అతడితోపాటు హర్మన్‌ ప్రీత్‌ సింగ్‌, మన్‌దీప్‌ సింగ్‌ ఉన్నారు. అయితే, అదే సమయంలో సోషల్‌ మీడియా స్టార్‌ డాలీ చాయ్‌ వాలా విమానాశ్రయానికి వచ్చాడు. దీంతో ప్రజలు అతడితోనే సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారట. హాకీ ఆటగాళ్లను అసలు పట్టించుకోలేదట. దీంతో తాము ఒకరి ముఖం ఒకరం చూసుకున్నట్లు హార్దిక్ చెప్పాడు.కాగా, హర్మన్‌ 150 పైగా అంతర్జాతీయ గోల్స్‌ చేశాడు. మన్‌ దీప్‌ 100 పైగా గోల్స్‌ కొట్టాడు.

ఎవరీ డాలీ చాయ్ వాలా

డాలీ చాయ్‌వాలా టీ తయారీలో తన ప్రత్యేకతతో సోషల్‌ మీడియాలో సంచలనంగా మారాడు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ కూ టీ అందించాడు. ఇటీవల గేట్స్ భారత్ కు వచ్చినప్పుడు డాలీని కలిశారు. ఇదంతా డాలీ గొప్పదనమేనని.. అయితే ఒలింపిక్స్‌ లో రెండు సార్లు పతకాలు గెలిచిన తాము గుర్తింపునకు కూడా నోచుకోవడం లేదని హార్దిక్ వాపోయాడు. ఆటగాళ్లకు కీర్తి, డబ్బు ముఖ్యమే. కానీ అభిమానులు తమను చూస్తున్నప్పుడు, అభినందిస్తున్నప్పుడూ అంతకంటే ఆనందం మరొకటి ఉండదన్నాడు.

Tags:    

Similar News