'లవ్' ఎఫెక్ట్: పాకిస్థాన్‌లోకి భారత యువకుడు తర్వాత ఏం జరిగింది?
సోషల్ మీడియా మాధ్యమం 'ఫేస్‌బుక్'లో పరిచయమైన పాకిస్థాన్ యువతిని ప్రేమించిన యూపీ యువకుడు ఆ దేశంలోకి అక్రమంగా ప్రవేశించాడు.
'ప్రేమ కోసమై వలలో పడెనో.. పాపం పసివాడు!'-అంటూ.. ఆ అబ్బాయి కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. సోషల్ మీడియా మాధ్యమం 'ఫేస్‌బుక్'లో పరిచయమైన పాకిస్థాన్ యువతిని ప్రేమించిన యూపీ యువకుడు ఆ దేశంలోకి అక్రమంగా ప్రవేశించాడు. తన ప్రేమను చాటుకున్నాడు. మనసారా ప్రేమించిన యువతిని కూడా కలుసుకున్నాడు. పెళ్లి చేసుకుందాం.. రా! అంటూ ఆహ్వానించాడు. కానీ.. ఇక్కడే కథ యూటర్న్ తీసుకుంది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే!
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాకు చెందిన బాదల్ బాబు(30) అనే యువకుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు. ఈ క్రమంలో ఫేస్‌బుక్‌లో దాయాది దేశం పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన యువతి సారా రాణితో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా.. తర్వాత కాలంలో ప్రేమగా మారింది. ''ప్రేమే నేరమౌనా?!'' అంటూ.. పాకిస్థాన్‌తో మనకున్న వైరాన్ని కూడా మరిచిపోయి.. అక్రమ పద్ధతిలో సరిహద్దులు దాటేసి.. పంజాబ్‌కు చేరుకున్నాడు.
తన ప్రియురాలు సారా రాణిని ఆమె సొంత ప్రాంతం మండి బహుద్దీన్‌లో కలుసుకున్నాడు. మనసు పంచుకున్నాడు.. ఏడడుగులు నడుద్దామని ప్రతిపాదించాడు. కానీ, అప్పటికే భారత్ నుంచి ఓ యువకుడు వచ్చాడని ఉప్పందండంతో పాకిస్తాన్ పోలీసులు బాదల్ బాబును అరెస్టు చేశారు. అటు సారా రాణిని కూడా అదు పులోకి తీసుకుని.. వీరి వ్యవహారంపై కూపీలాగారు. ఈ క్రమంలో విషయాన్ని సదరు యువతి పోలీసులకు వెల్లడించింది. తాము రెండున్నరేళ్లుగా ఫేస్‌బుక్‌లో పరిచయస్తులమేనని.. ప్రేమించుకున్నదీ వాస్తవమే నని చెప్పింది.
కానీ, పెళ్లి ప్రతిపాదనకు మాత్రం తాను అంగీకరించలేదని సారారాణి నిర్మొహమాటంగా చెప్పేసింది. దీంతో తెల్ల మొహం వేయడం బాదల్ బాబు వంతైంది. ఈ వ్యవహారాన్ని ఇటు భారత అధికారులు, అటు పాకిస్థాన్ అధికారులు కూడా అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తున్నారు. నిగూఢంగా విచారిస్తున్నారు కూడా! చివరకు ఏం జరుగుతుందో చూడాలి. ఏదేమైనా 'నా చెలి రోజావే' అంటూ.. దేశం విడిచి వెళ్లిన యువకుడికి మాత్రం ప్రేమ నిలిచింది.. కానీ, పెళ్లి దక్కలేదు!!