ఆ దేశంలో భారతీయ విద్యార్థుల నిరసన!
దీంతో ఒళ్లు మండిన భారత్.. మన దేశంలో ఉంటున్న కెనడా దౌత్య సిబ్బందిని సగానికి సగం తగ్గించుకోవాలని ఆల్టిమేటం జారీ చేసింది.
ఉత్తర అమెరికా దేశమైన కెనడా.. భారత వ్యతిరేకతను మానుకోవడం లేదు. కెనడాలో ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వ్యవహారంలో ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన విమర్శలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. నిజ్జర్ ను భారత ప్రభుత్వ ఏజెంట్లే హత్య చేశారంటూ ఆరోపించి ట్రూడో కలకలం రేపారు. ఈ వ్యవహారంతో తమకే సంబంధం లేదని భారత్ చెప్పినప్పటికీ ట్రూడో పట్టించుకోలేదు. దీంతో ఒళ్లు మండిన భారత్.. మన దేశంలో ఉంటున్న కెనడా దౌత్య సిబ్బందిని సగానికి సగం తగ్గించుకోవాలని ఆల్టిమేటం జారీ చేసింది. అంతేకాకుండా కెనడాకు తాత్కాలికంగా వీసాల జారీని నిలిపేసింది.
అయినప్పటికీ అడపదడపా జస్టిన్ ట్రూడో భారత్ పై విషం కక్కుతూనే ఉన్నారు. ఇటీవల తమ దేశ ఇమ్మిగ్రేషన్ నిబంధనలను మార్చారు. దీంతో ఆ దేశంలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులతోపాటు అంతర్జాతీయ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో కెనడాలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐస్ లాండ్ ప్రావిన్స్ లో ఇమ్మిగ్రేషన్ నిబంధనలు మార్చటంతో తాము దేశ బహిష్కరణ ఎదుర్కొంటున్నామని భారతీయ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ప్రాంతీయ చట్టాల మార్పును వ్యతిరేకిస్తూ వందలాది మంది భారతీయ విద్యార్థులు ధర్నాకు దిగారు. రెండు వారాల నుంచి కొనసాగుతున్న నిరసనలు కెనడా ప్రభుత్వం దిగొచ్చే వరకు కొనసాగిస్తామని చెబుతున్నారు.
కాగా ఇటీవల కెనడాలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐస్ లాండ్ రాష్ట్రం వలసదారులను తగ్గించుకోవటం కోసం ఇమ్మిగ్రేషన్ నిబంధనలను మార్చింది. భారీగా వలసదారులు తమ రాష్ట్రానికి రావడంతో హెల్త్ కేర్, నివాస సదుపాయాలపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆందోళన చెందుతోంది. దీంతో ఇప్పటికే అక్కడ ఉంటున్న భారతీయ విద్యార్థులకు వర్క్ పర్మిట్లు రద్దయ్యాయి. ఈ క్రమంలో వారు తిరిగి భారత్ కు వెళ్లిపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
కాగా భారత విద్యార్థుల నిరసనలపై భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణదీర్ జైశ్వాల్ మాట్లాడారు. భారత్ నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు చదువుకోవడానికి కెనడా వెళ్తున్నారని ఆయన గుర్తు చేశారు. చైనా తర్వాత కెనడాలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయ విద్యార్థులే ఎక్కువగా ఉన్నారని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో భారత విద్యార్థుల సమస్యలపై కెనడా దృష్టి సారించాల్సి ఉందని చెప్పారు. కాగా భారత విద్యార్థులు దేశ బహిష్కరణ పరిస్థితులను ఎదుర్కొంటున్నట్టు తమకు తెలియదన్నారు.
కెనడాలో ఒకరిద్దరు భారతీయ విద్యార్థులకు ఇబ్బంది తలెత్తి ఉండవచ్చని రణధీర్ జైశ్వాల్ తెలిపారు. అయితే ఇదంత పెద్ద సమస్య కాదని ఆయన కొట్టిపారేశారు.
మరోవైపు విద్యార్థుల వాదన మరోలా ఉంది. తమ నిరసనలు కొనసాగుతాయని.. తమ హక్కులు నెరవేర్చుకునేందుకు తప్పదని అంటున్నారు. తమకు న్యాయం జరిగేవరకు ఈ ఆందోళనలు కొనసాగిస్తామని తేల్చిచెబుతున్నారు.