అప్పుడేమో దీక్షకు నో.. ఇప్పుడేమో సయ్యా?
తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా ఇందిరా పార్క్ వేదికను అడ్డాగా చేసుకుని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు
కాలం ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. బండ్లు ఓడలవుతాయి. ఓడలు బండ్లవుతాయి. అధికారంలో ఉన్నప్పుడు మనం చేసిన పనులే తరువాత మనకు నష్టాలు తీసుకొస్తాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి కూడా అలాగే ఉంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో ప్రతిపక్షాల గొంతు నొక్కేసింది. ఇక ఇప్పుడు ప్రజాగళం వినిపించాలని భావిస్తోంది. దీని కోసం ఇందిరా చౌక్ ను ఎంచుకుంటోంది.
తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా ఇందిరా పార్క్ వేదికను అడ్డాగా చేసుకుని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. అధికారంలోకి వచ్చాక అక్కడ ధర్నాలు చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేయడంతో కోర్టు కూడా మొట్టికాయలు వేసింది. ఇక ప్రస్తుతం ఇదే వేదికగా ఉద్యమాలు చేయాలని భావిస్తున్నారు. తాను చేస్తే కరెక్ట్ ఇతరులు చేస్తే కుదరదని చెప్పే కేసీఆర్ తీరుకు అందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం వరి కొనుగోలు చేయడం లేదని ఇదే వేదికపై ఆందోళన చేశారు. ఇప్పుడు కూడా ధర్నాలకు ఇందిరా పార్క్ వేదికను ఎంచుకుని ప్రజల పక్షాన పోరాడాలని చూస్తున్నారు. ఇది ఎంత వరకు సమంజసం. తన కోసమైతే ఒకే అంటూ తాను అధికారంలో ఉన్నప్పుడు నో చెప్పడం దేనికి సంకేతమని పలువురు రాజకీయ నేతలు ప్రశ్నిస్తున్నారు.
2000 సంవత్సరం నుంచి ఇందిరా పార్కు సమీపంలోనే ధర్నాలు చేసేవారు. అది అచ్చి రావడంతోనే అధికారంలోకి వచ్చారు. అధికారం చేజిక్కగానే ధర్నా చౌక్ వద్ద ఎలాంటి ఆందోళనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుని ప్రభుత్వం మీద మచ్చలేదని అనుకునేలా చేశారు. తరువాత ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లడంతో వారు ఓటుతోనే సమాధానం చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ధర్నా చౌక్ లో ఆంక్షలు సడలించింది. బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు రద్దు చేసింది. ప్రజలు ఎప్పుడైనా ధర్నా, ఆందోళన చేసుకోవచ్చని సూచించింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు సరైనవి కావని తెలియజేసింది. ఇందులో భాగంగా ఇప్పుడు ఇందిరా పార్కు వద్ద ఎవరైనా ఆందోళన చేసేందుకు అనుమతి ఇఛ్చింది.