ఈ 'కోత'లు మాంద్యానికి భయాలేనా?

తన కార్యకలాపాలను క్రమబద్ధీకరించుకోవడంతో మొత్తం శ్రామిక శక్తిలో 15 శాతానికి పైగా శ్రామిక శక్తిని తగ్గించుకుంటామని బాంబుపేల్చింది.

Update: 2024-08-03 04:02 GMT

కోవిడ్‌ అనంతర పరిస్థితులు, రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం, ఇజ్రాయెల్‌ – హమాస్‌ పోరు, ఇప్పుడు ఇరాన్‌ – ఇజ్రాయెల్‌ మధ్య కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం వైపు నడిపిస్తున్నాయనే భయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇందుకు తగ్గట్టే అమెరికాకు చెందిన దిగ్గజ చిప్‌ తయారీ సంస్థ.. ఇంటెల్‌ తన కంపెనీలో 15 శాతం ఉద్యోగాల్లో కోత ఉంటుందని స్పష్టం చేసింది. తన కార్యకలాపాలను క్రమబద్ధీకరించుకోవడంతో మొత్తం శ్రామిక శక్తిలో 15 శాతానికి పైగా శ్రామిక శక్తిని తగ్గించుకుంటామని బాంబుపేల్చింది.

ఇటీవల ముగిసిన త్రైమాసికంలో ఇంటెల్‌ 1.6 బిలియన్‌ డాలర్ల నష్టాన్ని చవిచూసింది. ఇది కూడా ఉద్యోగులను తగ్గించుకోవాలనుకోవడానికి కారణం. నష్టాలను పూడ్చుకోవడంలో భాగంగా ఈ ఏడాది వ్యయంలో సుమారు 20 బిలియన్‌ డాలర్లను తగ్గించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

కీలకమైన ఉత్పత్తి, టెక్నాలజీ ప్రాసెస్‌ రంగాల్లో వృద్ధిని సాధించినప్పటికీ తమ రెండో త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా లేవని ఇంటెల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ పాట్‌ గెల్సింగర్‌ వివరించారు. రెండో త్రైమాసికంలో తాము ఊహించిన దానికంటే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొన్నామన్నారు.

ఇంటెల్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ డేవిడ్‌ జిన్స్నర్‌ ప్రకారం.. ఇంటెల్‌.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌. పర్సనల్‌ కంప్యూటర్ల తయారీ, తదితరాలతో రెండో త్రైమాసిక ఆదాయం తీవ్రంగా ప్రభావితమైంది.

ఈ నేపథ్యంలో వ్యయాలను కుదించడం, లాభాలను మెరుగుపరుచుకోవడంలో భాగంగా సంస్థకు మంచి చేసే నిర్ణయాలను తీసుకోకతప్పడం లేదని ఇంటెల్‌ పేర్కొంది.

ఇందులో భాగంగానే జూన్‌ లో ఇంటెల్‌ ఇజ్రాయెల్‌ లో ప్రధాన ఫ్యాక్టరీ ప్రాజెక్ట్‌ విస్తరణను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది, దీన్ని చిప్‌ ప్లాంట్‌ కి అనుబంధంగా 15 బిలియన్‌ డాలర్ల ఖర్చుతో నిర్మించతలపెట్టారు.

కాగా ఇంటెల్‌ గత సంవత్సరం చివరి నాటికి 124,800 మంది ఉద్యోగులను కలిగి ఉంది. దీని ప్రకారం 15 శాతానికి పైగా తొలగింపులు అంటే 18 వేల మందికి ఉద్వాసన తప్పదని చెబుతున్నారు.

గత కొన్ని దశాబ్దాలుగా ఇంటెల్‌ ల్యాప్‌ ట్యాప్స్, చిప్స్, డేటా సెంటర్లలో ఉండే చిప్స్‌ తయారీ ద్వారా మార్కెట్‌ లో గుత్తాధిపత్యం సాధించింది. అయితే ఇటీవల కాలంలో దానికి ఎన్వీడియా నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఎన్వీడియా ప్రత్యేక ఏఐ ప్రాసెసర్లపైన దృష్టి సారించింది.

అమెరికా పెట్టుబడిదారులను కూడా ఆర్థిక మాంద్యం భయం వెంటాడుతోంది. అమెరికాలో జూలైలో తయారీ రంగం ప్రగతి తగ్గింది. నిరుద్యోగం సంఖ్య కూడా పెరిగింది. ఏకంగా నిరుద్యోగుల సంఖ్య 2,49,000కి పెరిగింది. అమెరికా పదేళ్ల బాండ్లు పనితీరు కూడా క్షీణించింది. భయాలతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను మార్కెట్‌ నుంచి ఉపసంహరించుకున్నారు. దీంతో నాస్‌ డాక్, డోజోన్స్‌ వంటి స్టాక్‌ మార్కెట్లు కూడా నష్టపోయాయి.

Tags:    

Similar News