రెండేళ్ల తర్వాత ఐటీలో కొత్త సందండి.. ఈ స్కిల్స్ కి ఫుల్ డిమాండ్!
దీంతో... పలు నైపుణ్యాలకు గిరాకీ పెరుగుతుందని చెబుతున్నారు.
ఐటీ రంగంలో దేశీయ కంపెనీలకు భారీ ప్రాజెక్టులు దక్కడంతో సుమారు రెండేళ్ల విరామం తర్వాత ఐటీ రంగంలో మళ్లీ కొత్త సందడి కనిపిస్తోందని అంటున్నారు. దీంతో... పలు నైపుణ్యాలకు గిరాకీ పెరుగుతుందని చెబుతున్నారు. ఫలితంగా కొత్త ఏడాది కొత్త ఉద్యోగాలతో పాటు ప్యాకేజీలు పెరిగే అవకాశం పుష్కలంగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అవును... ఆర్థిక మాంద్య పరిస్థితులతో పాటు ఇతర సవాళ్ల ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సంస్థలు ఐటీ ప్రాజెక్టులను వాయిదా వేసుకొవడంతో దేశీయ ఐటీ కంపెనీలకు కొత్త ప్రాజెక్టులు దక్కడం ఇటీవల ఎంతో కష్టంగా మారిందని అంటున్నారు. ఫలితంగా.. ఐటీ రంగంలో పింక్ స్లిప్ ల టెన్షన్, కొత్త నియామకాలు లేకపోవడం జరిగిందని అంటున్నారు.
ఈ విషయంలో ఆ దేశం, ఈ దేశం అనే తారతమ్యాలేవీ లేకుండా.. పెద్దగా కొత్త ప్రాజెక్టులు రాకపోవడంతో అటు అమెరికా లోనూ, ఇటు భారత్ లోనూ ఐటీ కెంపెనీలు వీలైనంత తక్కువ సిబ్బందితోనే నెట్టుకొచ్చాయని అంటున్నారు. అయితే... ఇప్పుడు మళ్లీ పరిస్థితుల్లో మార్పు వస్తోందని, కొత్త ప్రాజెక్టుల సందడి నెలకొందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో... దేశంలోని పలు అగ్రశ్రేణి ఐటీ కంపెనీలు ఈ ప్రాజెక్టులపై అధికంగా సంపాదిస్తున్నాయని చెబుతున్నారు. ఇందులో భాగంగా... దేశీయ ఐటీ రంగ దిగ్గజాలైనా టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్.సీ.ఎల్., విప్రో వంటి సంస్థలూ ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ పలు ప్రాజెక్టులు సంపాదించాయి!
వీటిలో టీసీఎస్, విప్రో సంస్థలు ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో అతిపెద్ద డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ ప్రాజెక్టులు సంపాదించినట్లూ ప్రకటించగా.. జూన్ త్రైమాసికంతో పోలిస్తే రెంట్టింపు సంఖ్యలో ఈ తరహా ప్రాజెక్టులనూ టీసీఎస్ దక్కించుకుందని అంటున్నారు. వీటీతో పాటు అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టులనూ ఈ సంస్థ అధికంగా దక్కించుకుంది!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జెన్ ఏఐ విభాగాల్లో సుమారూ రూ.12,750 కోట్ల విలువైన 600 ప్రజెక్టులపై టీసీఎస్ పనిచేస్తోందని చెబుతున్నారు. ఇదే క్రమంలో... టెక్ మహీంద్ర.. ఏఐ, జెన్ ఏఐ ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి సిద్ధపడుతోందని అంటున్నారు. అదేవిధంగా... హెచ్.సీ.ఎల్. టెక్నాలజీస్ కూడా ఏఐ విభాగాలపై దృష్టి సారిస్తోందని చెబుతున్నారు.
ఈ విధంగా ఐటీ కంపెనీలు చేపట్టే కొత్త ప్రాజెక్టుల వల్ల నూతన సంవత్సరంలో ఏఐ, డేటా, క్లౌడ్ విభాగాల్లో నియామకాలు పెరగడంతోపాటు.. మంచి మంచి ప్యాకేజీలు లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని.. నిపుణులు చెబుతున్నారు!!