సౌత్ - నార్త్... మొగ్గలోనే తుంచాల్సిన విషయం ఇది!

ఇందులో వాస్తవం పాళ్లు ఎక్కువే అని చెబుతుంటారు! ఈ సమయంలో నార్త్ ఇండియాలోని ఓ సంస్థ చేసిన నిర్వాకం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Update: 2024-12-19 03:52 GMT

హిందీని మాపై రుద్దొద్దు అని.. టాక్సులు కట్టేది దక్షిణాది రాష్ట్రాలు అయితే బడ్జెట్ లో కేటాయింపులు అధికంగా ఉత్తరాధి రాష్ట్రాలకు కేటాయిస్తున్నారని రకరకాల కామెంట్లు వినిపిస్తుంటాయని అంటుంటారు. ఇందులో వాస్తవం పాళ్లు ఎక్కువే అని చెబుతుంటారు! ఈ సమయంలో నార్త్ ఇండియాలోని ఓ సంస్థ చేసిన నిర్వాకం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అవును... సాధారణంగా ఏదైనా ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడితే.. అందులో విద్యార్హతలు, అవసరమైతే ఫిజికల్ ఫిట్ నెస్ కి సంబంధించిన సర్టిఫికెట్లు కోరడం సహజం. కానీ... దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం అనే వ్యత్యాసం చూపిస్తూ నోటిఫికేషన్ లో "నోట్" పొందుపరచడం చేసింది ఓ సంస్థ. దీంతో... నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... నొయిడాకు చెందిన ఓ కన్సల్టింగ్ సంస్థ తన రిక్రుట్ మెంట్ ప్రక్రియలో దక్షిణ భరత అభ్యర్థుల పట్ల వివక్ష చూపిందన్న ఆరోపణలపై తీవ్ర విమర్శల పాలైంది. ఇందులో భాగంగా... తాము ప్రకటించిన ఉద్యోగాలకు దక్షిణ భారతదేశానికి చెందిన వ్యక్తులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదని సంస్థ తన ఉద్యోగ ప్రకటనలో పేర్కొంది.

ఆ ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు అన్నింటి గురించి చెబుతూ... చివర్లో 'నోట్ ' అని పేర్కొని... దక్షిణ భారతదేశానికి చెందిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు కాదు' అని పేర్కొంది. దీంతో... ఈ వివక్షాపూరిత నిబంధన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది.

ఇటువంటి పద్దతులు కార్మిక చట్టాలను ఉల్లంఘించడమే అని... ప్రాంతీయ విభజన, పక్షపాతాన్ని ప్రోత్సహించడమే అని పలువురు అభిప్రయపడుతున్నారు. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన సమానత్వ హక్కును పేర్కొంటూ సంస్థపై చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇలాంటి ఆలోచనను, దాన్ని ఆచరణలో పెట్టిన విధానాన్ని మొగ్గలోనే తుంచాలని కోరుతున్నారు!

కాగా... సంస్థ అడిగిన క్వాలిఫికేషన్స్ లో... డేటా అనాలసిస్, ఎస్.క్యూ.ఎల్. స్కిల్స్ తో 4+ సంవత్సరాల అనుభవంతో పాటు నిరూపితమైన మల్టీ టాక్సింగ్ సామర్థ్యాలు, అవసరమైన వ్యాపార అవసరాలను డాక్యుమెంట్ చేయడం, హిందీ రాయడం, మాట్లాడటంలో నిష్ణాతులు అయ్యి ఉండాలి అన్నట్లుగా అర్హతలు పేర్కొంది.

అక్కడితో ఆగని సదరు సంస్థ... "నోట్" అని... దక్షిణ భారతదేశానికి చెందిన అభ్యర్థులు ఈ స్థానానికి అర్హులు కాదు అంటూ పేర్కొంది. ఇప్పుడు ఈ 'గమనిక ' నెట్టింట తీవ్ర చర్చకు దారితీసిందని అంటున్నారు. తీవ్ర విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి.

Tags:    

Similar News