మూవీ సీన్ కాదు.. ఇరాన్ క్షిపణులను ఇజ్రాయెల్ ఎలా ఎదుర్కొందంటే?
ఎప్పుడేం జరుగుతుందో అన్నట్లు ఉండే పశ్చిమాసియా ప్రాంతం మరోసారి భగ్గుమంది. తరచూ ఏదో అనిశ్చితి పరిస్థితి.
ఎప్పుడేం జరుగుతుందో అన్నట్లు ఉండే పశ్చిమాసియా ప్రాంతం మరోసారి భగ్గుమంది. తరచూ ఏదో అనిశ్చితి పరిస్థితి. తాజాగా ఇజ్రాయెల్ మీద ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగటం ద్వారా రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో అర్థం కానట్లుగా పరిస్థితులు మారిపోయాయి. ఇజ్రాయెల్ మీద దాడి చేస్తానన్న ఇరాన్ అన్నంత పని చేసింది. హెజ్ బొల్లా.. హమస్ అగ్రనేతల్ని అంతమొందించినందుకు ప్రతిగా ఇజ్రాయెల్ మీద దాడికి తెగ బడింది ఇరాన్.
మంగళవారం రాత్రి ఒక్కసారిగా 180 క్షిపణుల్ని ప్రయోగించింది. వీటిల్లో చాలా వరకు ఇజ్రాయెల్ యారో ఎయిర్ డిఫెన్స్ రక్షణ వ్యవస్జత సమర్థంగా ఎదుర్కోవటం గమనార్హం. ఇజ్రాయెల్ కున్న అత్యాధునిక సాంకేతికత కారణంగా.. ఇరాన్ క్షిపణి దాడికి సమర్థంగా తిప్పి కొట్టిందని చెప్పాలి. ఇరాన్ జరిపిన క్షిపణుల దాడిని ఇజ్రాయెల్ ఎలా ఎదుర్కొందన్నవిషయాన్ని చెప్పే వీడియో ఒకటి వైరల్ గా మారింది.
ఇరాన్ ప్రతీకార దాడి నేపథ్యంలో దాదాపు కోటి మంది వరకు ఇజ్రాయెల్ ప్రజలు బాంబు షెల్టర్లలో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్లుగా చెబుతున్నారు. ఇజ్రాయెల్ తన ఎక్స్ ఖాతాలో తమపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడికి సంబంధించిన వీడియోను షేర్ చేయటంతో పాటు.. ‘‘ఇది సైన్స్ ఫిక్షన్ సినిమా కాదు. ప్రస్తుతం ఇజ్రాయెల్ పరిస్థితి. ఇరాన్ క్షిపణుల కారణంగా దాదాపుకోటి మంది బాంబు షెల్టర్లలో ఉన్నారు’’ అని పేర్కొంది.
మరోవైపు ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల ప్రయోగానికి సంబంధించి ఒక విమాన ప్రయాణికుడు రికార్డు చేసినట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్అవుతోంది. దుబాయ్ వెళుతున్న విమానం నుంచి ఒక వ్యక్తి రికార్డుచేసినట్లుగా చెబుతున్నారు. టెహ్రాన్ (ఇరాన్) ప్రయోగించిన కొన్ని క్షిపణులు జోర్డాన్ గగనతలంలోకి వచ్చాయి. ముందస్తు చర్యల్లో భాగంగా జోర్డాన్ తమ గగనతలంలో విమాన రాకపోకల్ని నిలిపేస్తున్నట్లు ప్రకటించారు.