పశ్చిమాసియాలో మరో రచ్చ... ఇరాక్ వర్సెస్ ఇరాన్!

ఇందులో భాగంగా... ఎర్బిల్‌ పట్టణంలోని గూఢాచార స్థావరాలు, ఇరాన్‌ వ్యతిరేక ఉగ్రవాద సంస్థలను లక్ష్యంగా చేసుకొని క్షిపణులు ప్రయోగించినట్లు ఇరాన్‌ రెవల్యూనరీ గార్డ్స్‌ ప్రకటించింది.

Update: 2024-01-16 03:54 GMT

ఇజ్రాయెల్‌ - హమాస్‌ మధ్య యుద్ధం ప్రారంభమై 100రోజులు దాడేశాయి. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా... ఈ ఘర్షణలకు ఇప్పట్లో తెరపడే సూచనలు కనిపించడం లేదని అంటున్నారు. ఇటీవల హెజ్‌ బొల్లా సైతం ఎంటరై... ఇజ్రాయెల్‌ పై దాడులకు దిగడంతో ఈ రచ్చ మరింత పెరిగింది. హెజ్ బొల్లా ఎంట్రీతో సమస్య మరింత క్లిష్టమయ్యిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరోపక్క ఇరాన్‌ మద్దతున్న హౌతీ రెబెల్స్‌ ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలే లక్ష్యంగా పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో అమెరికా, బ్రిటన్‌ సైన్యాలు యెమెన్‌ లోని హౌతీ స్థావరాలపై ఇటీవల ప్రతీకార దాడులు చేశాయి. ఈ సమయంలో హౌతీ రెబల్స్ మరింతగా రెచ్చిపోతున్నారు. ఇలా పశ్చిమాసియా ప్రాంతం వరుస ఘర్షణలతో అట్టుడుకుతోన్న నేపథ్యంలో... తాజాగా మరో రచ్చ తెరపైకి వచ్చింది.

అవును... పశ్చిమాసియాలో ఇప్పటికే ఉన్న టెన్షన్ చాలదన్నట్లుగా సరికొత్త సమస్య తెరపైకి వచ్చింది. ఇరాక్‌ లోని కుర్దిస్థాన్‌ ప్రాంతంపై దాడులు చేసినట్లు ఇరాన్‌ ప్రకటించింది. ఇందులో భాగంగా... ఎర్బిల్‌ పట్టణంలోని గూఢాచార స్థావరాలు, ఇరాన్‌ వ్యతిరేక ఉగ్రవాద సంస్థలను లక్ష్యంగా చేసుకొని క్షిపణులు ప్రయోగించినట్లు ఇరాన్‌ రెవల్యూనరీ గార్డ్స్‌ ప్రకటించింది. ఇదే సమయంలో సిరియాలోని ఉగ్రవాద సంస్థ శిబిరాలను సైతం ధ్వంసం చేసినట్లు చెప్పింది.

అదేవిధంగా... ఇరాక్‌ లో కుర్దిస్థాన్‌ ప్రాంతంలోని ఇజ్రాయెల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ మొస్సాద్‌ ప్రధాన కార్యాలయంపైనా దాడి చేసినట్లు ఇరాన్‌ ప్రకటించగా... ఆ దాడులను "కుర్దిష్‌ ప్రాంతీయ ప్రభుత్వ భద్రతా మండలి" కన్ ఫాం చేసింది. ఈ దాడుల్లో నలుగురు పౌరులు మరణించగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలైనట్లు పేర్కొంది.

ఈ విషయాలపై స్పందించిన కుర్దిస్థాన్ ప్రాంతీయ భద్రతా మండలి... ఇరాన్‌ దుందుడుకు చర్యలు తమ ప్రాంతంతో పాటు ఇరాక్‌ సార్వభౌమాధికారంపై దాడిగానే భావిస్తున్నామని తెలిపింది. ఈ నేరాన్ని అంతర్జాతీయ సమాజం తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. ఇదే సమయమొలో... ఈ దాడుల్లో తమ అధికారులకు ఎలాంటి హానీ జరగలేదని వైట్ హౌస్ లోని జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి తెలిపారు.

ఇల ఉన్నపలంగా ఇరాక్ పై ఇరాన్ దాడులు చేయడంతో పశ్చిమాసియాలో మరో యుద్ధం తప్పదా అనే చర్చ మొదలైంది. ఇప్పటికే బాంబు దాడులతో అతలాకుతలమవుతున్న పశ్చిమాసియాలో.. తాజాగా మరో యుద్ధం మొదలైతే ఇది పెను ప్రమాదాలకు దారితీసే ప్రమాదం లేకపోలేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News