చంద్రబాబు జమిలికి రెడీగా లేరా ?

అయితే బాబు ఈ విషయంలో అంత సుముఖంగా లేరని ఆయన నో అనే అంటారు అని ప్రచారం కూడా సమాంతరంగా మరో వైపు సాగుతోంది.

Update: 2024-09-19 13:29 GMT

రాజకీయంగా దిగ్గజ నేత. దేశ రాజకీయాల్లో కీలకమైన వారు, సీనియర్ మోస్ట్ లీడర్ చంద్రబాబు ఈ రోజున జాతీయ స్థాయిలో అతి ముఖ్యమైన అంశంగా ఉంటూ పెద్ద చర్చకు లేవదీస్తున్న జమిలి ఎన్నికల విషయంలో స్పందించినది అయితే లేదు అని అంటున్నారు. చంద్రబాబు ఏపీకి సీఎం, ఏపీలో ఎన్డీయే సర్కార్ సారధి, అంతే కాదు కేంద్రంలో మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కి బలమైన వారధి.

ఈ రోజున కేంద్రంలో ముచ్చటగా మూడోసారి మోడీ ప్రధానిగా ఉన్నారు అంటే దానికి కారణం చంద్రబాబు అని చెప్పాలి. అలా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని తన భుజాలు కాసి నిలబెడుతున్న చంద్రబాబు ఎన్డీయే ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలలో ఎంతవరకూ భాగస్వామిగా ఉన్నారు అన్నది ఒక ప్రశ్న. అదే సమయంలో మోడీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం దేశంలో ఒకే ఎన్నికలు అంటూ జమిలికి తెర తీసిన వైనం మీద ఆయన స్పందన ఏమిటి అన్నది కేవలం ఏపీనే కాదు దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది

ఎందుకంటే బాబు నిర్ణయమే ఇపుడు చాలా ప్రధానం. ఆయన జమిలికి ఎస్ అంటేనే బండి ముందుకు కదులుతుంది. ఆయన నో అంటే కేంద్రం ఈ విషయంలో కొంత ఆలోచనలో పడాల్సి ఉంటుంది. పార్లమెంట్ లో దీనిని సంబంధించిన బిల్లు ప్రవేశపెడితే టీడీపీ ఎంపీల మద్దతు అత్యంత కీలకంగా మారుతుంది. వారు కనుక ఓటింగ్ లో లేకపోతే బిల్లు కూడా వీగిపోతుంది.

అంటే బీజేపీకి జమిలి ఎన్నికలకు ఎంతటి ఉత్సాహం చూపించినా కూడా ఇక్కడ బాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందే. అంతటి కీ రోల్ ఎన్డీయే సర్కార్ లో ప్లే చేస్తున్న చంద్రబాబు ఒకే దేశం ఒకే ఎన్నిక అన్న బీజేపీ నినాదం మీద ఏమంటారు అన్నది ఒక చర్చగా ఉంది. అయితే బాబు ఈ విషయంలో అంత సుముఖంగా లేరని ఆయన నో అనే అంటారు అని ప్రచారం కూడా సమాంతరంగా మరో వైపు సాగుతోంది.

ఒకే దేశం ఒకే ఎన్నిక అన్నది అమలు చేస్తే మాత్రం బాబు దానికి ససేమిరా ఒప్పుకోరు అని కూడా అంటున్నారు. ఎందుకంటే ఏపీలో బాబు కంఫర్టబుల్ జోన్ లో ఉన్నారు. కనీ వినీ ఎరగని మెజారిటీ కూటమికి వచ్చింది. 164 సీట్లను ప్రజలు కట్టబెట్టి అయిదేళ్ళ పాటు తిరుగులేని అధికారాన్ని కట్టబెట్టారు.

అందువల్ల ఈ బ్రహ్మాండమైన ఏపీ ప్రజల మ్యాండేట్ ని కాదని మళ్లీ ఎన్నికలకు ఎవరు వెళ్తారు అన్నదే ప్రశ్న. బాబు లాంటి రాజకీయ వ్యూహకర్త అయితే అసలు దీనికి అంగీకరించే పరిస్థితి ఉండదనే అంటున్నారు. అయిదేళ్ళ క్రితం 23 సీట్లకు పరిమితం అయిన దారుణ సన్నివేశాన్ని టీడీపీ అధినేత చూశారు. బాబు రాజకీయ జీవితంలో ఎపుడూ ప్రజలు అద్భుతమైన మెజారిటీని టీడీపీ కట్టబెట్టలేదు. కానీ ఈ సుదీర్ఘ కాలంలో కన్న కలలు తీరిపోయేలా ఎలాంటి కొరత లేకుండా నూటికి తొంబై 98 శాతం సీట్లను 55 శాతం ఓట్ల షేర్ ని టీడీపీ కూటమి ఇస్తే దానిని వద్దు అని ఎవరు అనుకుంటారు.

అయిదేళ్ల పాటు ఈ అధికారాన్ని అర క్షణం కూడా వదలకుండా సగటు రాజకీయ నేతలు ఎవరైనా ఎంజాయ్ చేస్తారు. మరి అక్కడ ఉన్నది చంద్రబాబు. అపర చాణక్యుడు ఆయన. ఆయనకు ఈ విషయాలు తెలియవా. అందుకే బాబు మౌనంగా ఉంటున్నారు. ఆయన 2029లో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకే వెళ్లేందుకే మొగ్గు చూపిస్తారు. అంతే తప్ప జమిలికి జై కొట్టి మధ్యంతరానికి మొగ్గు చూపించరు అని అంటున్నారు.

ఇక రాజకీయంగా ఢక్కా మెక్కీలు తిన్న బాబుకు జనాల నాడి బాగా తెలుసు అని అంటున్నారు. ఒక నియోజకవర్గంలో ఎన్నికల తరువాత మళ్ళీ కొద్ది నెలల తేడాలో ఉప ఎన్నిక వస్తే ఫలితం కంప్లీట్ రివర్స్ గా వస్తుంది. అలాంటిది మధ్యంతరం అంటే ఈ ఫలితాలు రిపీట్ అవుతాయని నమ్మకం ఎవరికి ఉంటుంది అన్నది కూడా టీడీపీ అధినాయకత్వానికి తెలుసు అని అంటున్నారు.

పైగా ఎమ్మెల్యేలు అంతా ఏకంగా తొంబై వేలు ఎనభై వేలు డెబ్బై వేల ఓట్ల మెజారిటీతో గెలిచి వచ్చారు. మళ్లీ అలాంటి అద్భుతమైన సక్సెస్ వస్తుందో రాదో ఎవరికి తెలుసు అని అంటారు. అందుకే వారు కూడా తిరుగుబాటు బావుట ఎగరవేస్తారు అని అంటున్నారు. రాజకీయంగా మధ్యంతరం అంటే కూటమికి అత్మ హత్యా సదృశ్యం అని కూడా కూటమి పెద్దలు భావిస్తున్నారు అని అంటున్నారు.

అందువల్ల ఏ విధంగా చూసుకున్నా చంద్రబాబు జమిలికి జై కొట్టే అవకాశాలు లేవు అని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. మరి బాబు కీలకంగా ఉన్న ఎన్డీయే సర్కార్ మాత్రం మోడీ నాయకత్వంలో జమిలికి పోవాలనీ అనుకుంటోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News