ఇండియా కూటమిలో కాంగ్రెస్ ఒంటరేనా?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి తరఫున పోటీ చేస్తున్న ఆప్, కాంగ్రెస్ పార్టీల్లో ఎక్కువ పక్షాలు ఆమ్ ఆద్మీ పార్టీ పక్షాన్నే నిలుస్తున్నాయి.

Update: 2025-01-08 22:30 GMT

విపక్షంలో అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ జాతీయస్థాయిలో ఒంటరి అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. హరియాణా, మహారాష్ట్ర ఎన్నికల్లో పరాభవం కాంగ్రెస్ పై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. విపక్ష ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ ను మిగతా మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా దూరం చేస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ కు మింగుడుపడని విధంగా మిత్రపక్షాలు అడుగులు వేస్తున్నాయి.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి తరఫున పోటీ చేస్తున్న ఆప్, కాంగ్రెస్ పార్టీల్లో ఎక్కువ పక్షాలు ఆమ్ ఆద్మీ పార్టీ పక్షాన్నే నిలుస్తున్నాయి. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీకి టీఎంసీ మద్దతు ప్రకటించడం ద్వారా ఈ విషయం మరోసారి స్పష్టమైంది. ఇప్పటికే ఇండియా కూటమిలోని శివసేన (యూబీటీ), సమాజ్ వాదీ పార్టీలు ఆప్ కి మద్దతు తెలిపాయి. తాజాగా ఇప్పుడు ఆ జాబితాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని టీఎంసీ చేరింది. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్, బీజేపీలు ప్రధాన ప్రత్యర్థులుగా తలపడుతున్నాయి.

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండి కూటమిలో ఆప్ కీలక భాగస్వామిగా పనిచేసింది. ఆ ఎన్నికల అనంతరం జరిగిన హరియాణా ఎన్నికల్లో ఆప్ ఒంటరిగా పోటీ చేసింది. ఇది కాంగ్రెస్ విజయావకాశాలను తీవ్రంగా దెబ్బతీసింది. ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్ లోని కీలకమైన సమాజ్ వాదీ పార్టీ సైతం ఆప్ పార్టీకి భాసటగా నిలుస్తోంది. ఇప్పుడు బెంగాల్ లోని అధికార టీఎంసీ సైతం ఆప్ కి దగ్గరైంది. ఈ వరుస పరిణామాలు చూస్తే ఇండి కూటమిలో కాంగ్రెస్ ఒంటరి అయ్యే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఇండియా కూటమిలోని పార్టీలు కాంగ్రెస్ సారథ్యాన్ని శల్య సారథ్యంగా భావిస్తున్నాయి. ఆ పార్టీ నాయకత్వంలో బీజేపీపై పోరాడితే ఎలాంటి ప్రయోజనం ఉండదని విపక్షంలోని కీలకమైన పార్టీలు భావిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో కాంగ్రెస్ ను వదిలించుకునే క్రమంలో మిగిలిన అన్ని పార్టీలు ఏకమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ మొండి వైఖరి వల్లే మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవాల్సివచ్చిందని, బీజేపీది పైచేయి అయిందని విపక్షాలు నమ్ముతున్నాయి. దీంతో రానున్న కాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లోని కీలక పార్టీలు కాంగ్రెస్ కు దూరంగా జరుగుతున్నట్లు భావిస్తున్నారు.

ప్రస్తుతం ఆప్ పార్టీకి దగ్గరైన మూడు పార్టీలు మూడు ప్రధాన రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నవే కావడం గమనార్హం. ఉత్తరప్రదేశ్ లోని ప్రతిపక్షమైన సమాజ్ వాదీ పార్టీ కాంగ్రెస్ ను కాదని ఆప్ తో జతకట్టేందుకు సిద్ధమవుతుండటం విశేషం. అదేవిధంగా యూపీ తర్వాత పెద్దరాష్ట్రాలైన మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్లోని కీలక పార్టీలు శివసేన (యూబీటీ), టీఎంసీ కూడా ఆప్ వైపే మొగ్గుచూపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇండి కూటమిలో కాంగ్రెస్ ఒంటరి అయ్యే అవకాశాలు ఉన్నాయని జాతీయ స్థాయిలో రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News