తొందరపడిన కేటీఆర్.. సెల్ఫ్ గోల్ తో అడ్డంగా బుక్

రోజు గడిచినంతనే.. పొద్దుపొద్దున్నే అధికారపక్షం మీద ఏదో ఒక మాట అనాలి? మైలేజీ పొందాలన్న ఆత్రుత అంతకంతకూ ఎక్కువ అవుతోంది.

Update: 2025-02-12 07:42 GMT

తహతహ తప్పేం కాదు. అందులోనూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారపక్షం చేసే తప్పుల్ని ఎండగట్టాలని.. ప్రజల తరపున పోరాటం చేయాలని.. వారి ఆందోళనల్ని పాలకులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలన్న ఆలోచన మంచిదే. అయితే..ఆ తొందరలో తప్పులు చేయకూడదు. అడ్డంగా బుక్ కాకూడదు. తాజాగా మిర్చి రైతుల విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలతో అడ్డంగా బుక్ అయ్యారు. ప్రభుత్వంపై ఏదో ఒక విమర్శలు చేయాలన్న తొందరలో సరైన క్రాస్ చెక్ చేయాలన్న సోయి మరిచి అడ్డంగా బుక్ అయ్యారు.

రోజు గడిచినంతనే.. పొద్దుపొద్దున్నే అధికారపక్షం మీద ఏదో ఒక మాట అనాలి? మైలేజీ పొందాలన్న ఆత్రుత అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఒక్క రోజు గ్యాప్ ఇవ్వకుండా నిత్యం ఏదో ఒక ఇష్యూ మీద రేవంత్ ప్రభుత్వాన్నిఇష్టారాజ్యంగా తిట్టేయటం.. నిందలు వేయటం.. ఆరోపణాస్త్రాల్ని సంధించటం కేటీఆర్ కు ఒక అలవాటుగా మారింది. ఈ క్రమంలో ఆయన మాదిరే.. ఆయన టీంకు తొందరెక్కువైంది. ఇంతకూ అసలేం జరిగిందంటే..

ఒక మిర్చి రైతు ఆవేదనను కేటీఆర్ ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. అందులో సదరు రైతు తన ఆవేదన వ్యక్తం చేస్తూ.. ‘‘కనీసం మూడు వేల రూపాయిల మద్దతు ధర కూడా మిర్చి పంటకు రావటం లేదు. మేం బతికేదెలా?’’ అన్నది రైతు ఆవేదన. సదరు మిర్చి రైతు ఆవేదన వీడియోను పోస్టు చేసి.. ‘‘మాయమాటలు నమ్మిన పాపానికి.. మిర్చి రైతుల కంట్లో కారం కొడతారా? ఇద్దరు ఆడపిల్లల తండ్రిని అరిగోస పెడతారా? ఇందిరమ్మ రాజ్యంలో చెప్పిన మార్పు ఇదేనా? ఖమ్మం జిల్లా చింతకాని మండలం నావరంలో లక్షలు అప్పు చేసిన ఈ రైతు మిర్చి పండిస్తే.. రూ.2-3వేలకే తెగనమ్మమంటారా? సాక్ష్యాత్తు వ్యవసాయ మంత్రి ఇలాకాలోనే.. గిట్టుబాటు ధర లేక అల్లాడుతుంటే.. రైతులేం కావాలి? ఖమ్మంలో ముగ్గురు మంత్రులు ఉన్నా.. ఏం చేసుకోవాలె? బోనస్ పేరుతో బోగస్ మాటలు ఆపండి. మిర్చి రైతుకు కనీస మద్దతు ధర ఇప్పించండి’’ అంటూ ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు.

కేటీఆర్ పోస్టు చూస్తే.. మిర్చి పండించిన రైతు కంటే..ఆయన పోస్టు ఘాటే ఎక్కువగా ఉంది. అయితే.. ఈ పోస్టుపై అధికారపక్షం ఊహించని రీతిలో రియాక్టు అయ్యింది. దెబ్బకు కేటీఆర్ టీంకు దిమ్మ తిరిగిపోయింది. ఎందుకంటే.. సదరు రైతు వీడియో.. ఆయన ఆవేదనతో చేసిన వ్యాఖ్యలు మొత్తం కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనివి. అయితే.. కేటీఆర్ టీం ఆ విషయాన్ని గుర్తించే విషయంలో పొరపాటు పడటం.. పాత వీడియోను కొత్త వీడియోగా భావించి.. అత్యుత్సాహంతో పెట్టిన పోస్టు అడ్డంగా బుక్ అయ్యేలా చేసిందని చెప్పాలి

నిజానికి ఈ వీడియోలోని తప్పును కాంగ్రెస్ సానుభూతిపరులు ఎలా పట్టుకున్నారంటే.. ఇప్పుడు మిర్చి రైతులకు తాము పండించిన పంటకు టన్నుకు రూ.12-14వేల మధ్యలో పలుకుతోంది. అందుకు భిన్నంగా రైతు మాటలు ఉండటంతో అనుమానం వచ్చినన కాంగ్రెస్ సోషల్ మీడియా టీం.. సదరు వీడియోను క్రాస్ చెక్ చేయగా.. అదంతా 2018 నాటి వీడియోగా తేల్చారు. దీంతో కేటీఆర్ సోషల్ మీడియా టీం ఒక్కసారిగా నాలుకర్చుకున్న పరిస్థితి. ఇప్పటికైనా కళ్లు తెరిచి.. ఏదో విషయం మీద నిత్యం రేవంత్ సర్కారును టార్గెట్ చేయాలన్న ఆత్రుత ఆపి.. నిజాయితీగా ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందుల్ని ప్రస్తావిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News