జగన్ తగ్గడం సరే.. నాయకుల మాటేంటి?
కొన్ని రోజులు బింకానికి పోయినా.. పట్టుదలలకు ప్రాధాన్యం ఇచ్చినా.. నాయకుల తిరోగమనం.. పార్టీ పతనావస్థకు చేరుకుంటోందన్న సంకేతాల నేపథ్యంలో జగన్ తనను తాను తగ్గించుకుంటూ వచ్చారు.
నేను మారాను.. నేనేమిటో తెలుసుకున్నాను.. ఇక నుంచి గ్యాపులు రాకుండా లేకుండా చూసుకుంటాను. అని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తన పరివారానికి హామీ ఇస్తున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన దరిమిలా వైసీపీ అధినేత చాలా వరకు తనను తాను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని రోజులు బింకానికి పోయినా.. పట్టుదలలకు ప్రాధాన్యం ఇచ్చినా.. నాయకుల తిరోగమనం.. పార్టీ పతనావస్థకు చేరుకుంటోందన్న సంకేతాల నేపథ్యంలో జగన్ తనను తాను తగ్గించుకుంటూ వచ్చారు.
ఈ క్రమంలోనే గత నాలుగు రోజులుగా ఆయన పార్టీ నాయకులకు ''నేను మారాను. మిమ్మల్ని కూడా పట్టించుకుంటాను. మీ మాటే వింటాను'' అంటూ.. మొర పెట్టుకుంటున్నారు. ప్రజల మధ్యకు వెళ్లాలని వారి సమస్యలు వినాలని.. వారితో మమేకం కావాలని కూడా చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ పార్టీ కోసం పని చేయాలని అంటున్నారు. వాస్తవానికి ఎన్నికలకు ముందు వరకు తనంతటి వాడు రాజకీయాల్లో ఉన్నా డంటే.. అది తానేనని చెప్పుకొచ్చారు జగన్.
తను ఎంచుకున్నవారికి మాత్రమే టికెట్లు ఇచ్చారు. కాదన్న వారిని బయటకు పంపేశారు. తన మన అన్న తేడా కూడా చూడలేదు. దీంతో సీనియర్ల నుంచి దిగ్గజ నాయకుల వరకు చాలా మంది ఉసూరు మంటూ బయటకు వచ్చారు. ఇక, గెలుపు గుర్రం ఎక్కడం మాట అటుంచి గత ఎన్నికల్లో వైసీపీకి చావు దెబ్బ తగిలింది. ఫలితంగా 11 స్థానాలకే పరిమితమయ్యారు. ఈ ప్రభావం తర్వాత కూడా.. జగన్ పునరాలోచన చేయలేక పోయారు. తనకు తానే కట్టుకున్న బంగారు పంజరంలో ఉండిపోయారు.
అయితే.. కాలం చాలా బలమైంది. సీనియర్ల నుంచి అనేక మంది నాయకులు పార్టీని వదిలేస్తున్నారు. కడప జిల్లాలో కార్పొరేషన్ రేపో మాపో కుదేలయ్యే పరిస్థితి వచ్చేసింది. దీంతో తనను తాను తెలుసుకున్న జగన్.. పార్టీ నాయకులను కార్యకర్తలను తరచుగా బతిమాలే పరిస్థితి వచ్చింది. ఉండండి.. ఇది మన పార్టీ అని తన నోటి వెంట అంటున్నారంటే.. మానసికంగా జగన్ చాలా దిగివచ్చినట్టే. అయితే.. ఇప్పటి వరకు పార్టీలో అవమానాలు ఎదుర్కొన్నారని చెబుతున్న కొందరు నాయకులు ఏమేరకు దిగి వస్తారనేది ప్రశ్న. వారు కలిసి జగన్‌తో అడుగులు వేస్తారా? లేక.. తమ దారి తాము చూసుకుంటారా? అనేది చూడాలి.