పవన్ జాతీయ రాజకీయం సూపర్ హిట్!

ఆయన బీజేపీ కోసం మహారాష్ట్రలో చేసిన ప్రచారం సూపర్ హిట్ అయింది.

Update: 2024-11-23 07:50 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ హిస్టరీలో తొలిసారి తెలుగు రాష్ట్రాలు దాటి జాతీయ స్థాయిలో ప్రచారం చేశారు. ఆయన బీజేపీ కోసం మహారాష్ట్రలో చేసిన ప్రచారం సూపర్ హిట్ అయింది. దాంతో పవన్ ఇమేజ్ నేషనల్ వైడ్ గా మారింది. ఆయనను ఇపుడు బీజేపీ అత్యంత సన్నిహిత మిత్రుడిగానే కాదు ప్రజాకర్షణలో చాలా మంది కంటే ముందున్న నేతగా అగ్ర స్థాయి నాయకుడిగా చూడాల్సిన అవసరం ఏర్పడింది.

పవన్ మహారాష్ట్ర ఎన్నికల్లో రెండు రోజుల పాటు ప్రచారం చేశారు. ఆయన ప్రసంగాలు సైతం వాడిగా వేడిగా సాగాయి. ఇసుక వేస్తే రాలనంతగా జనాలు పవన్ సభలకు తరలి వచ్చారు. పవన్ మరాఠీలో మాట్లాడుతూ తనదైన ఆవేశపూరిత ప్రసంగాలు చేస్తూ అక్కడి వారిని విశేషంగా ఆకట్టుకున్నారు

మహారాష్ట్రలో బీజేపీ కూటమి సాధించిన విజయంలో పవన్ పాత్ర కూడా ఈ విధంగా చాలానే ఉంది అని అంటున్నారు. పవన్ రోడ్డు షోలతో పాటు అనేక బహిరంగ సభలు నిర్వహించారు. ఆయన సభలకు జనాలు పోటెత్తారు. అంతటా పవన్ మానియా సాగింది.

పవన్ పంచులు ఆయన వేసే డైలాగులు ప్రత్యర్థుల మీద చేసిన కామెంట్స్ ఓటర్లను ఉర్రూతలూగించాయి. పవన్ బీజేపీ కూటమి రావాల్సిన ఆవశ్యకతను చెబుతూనే కాంగ్రెస్ ని ఆ కూటమిని పెద్ద ఎత్తున విమర్శించారు.ఆ విధంగా ఆయన ఓటర్లలో కొత్త ఆలోచనలు నింపారు.

ఒక విధంగా చెప్పాలీ అంటే పవన్ బీజేపీకి ఒక అద్భుతమైన ప్రజాకర్షణ కలిగిన నాయకుడిగా ఈ ఎన్నికలలో కనిపించారు దాంతో పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన అన్ని చోట్లా బీజేపీ అభ్యర్ధులు విజయ దుందుభి మోగించడమే కాకుండా భారీ మెజారిటీలు సాధిస్తున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ పవన్ ని తుఫాను గా పేర్కొన్నారు. కానీ మహా ఎన్నికల్లో పవన్ సునామీగా మారారు. ఆయన కాంగ్రెస్ ని చీల్చి చెండాడుతూ బీజేపీకి విజయం చేకూర్చిన తీరుని అంతా చూసి అలనాటి ఎన్టీఆర్ తో పోలిక తెస్తున్నారు. అప్పట్లో ఎన్టీఆర్ సైతం ఉత్తరాదిన అనేక ప్రచార సభల్లో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించి విపక్ష పార్టీల అభ్యర్ధుల విజయంలో ముఖ్య పాత్ర పోషించారు. అలా ఎన్టీఆర్ జాతీయ నాయకుడిగా మారిపోయారు.

ఇపుడు పవన్ కూడా జాతీయ రాజకీయ తెర మీద కొత్తగా ఆవిష్కృతం అవుతున్నారు. పవన్ స్టామినా ఏమిటో బీజేపీ కళ్లారా చూసింది. పైగా మోడీ అంటే పవన్ కి ఇష్టం. పవన్ అంటే మోడీకి అభిమానం. దాంతో పవన్ జాతీయ జైత్ర యాత్ర మహా రాష్ట్ర నుంచే స్టార్ట్ అయింది అని ముందు ముందు పవన్ జాతీయ స్థాయిలో ఏ విధంగా ఎదుగుతారు అన్నది అంచనాలకే అందదని అంటున్నారు. ఒక తెలుగు వాడుగా పవన్ సాధించిన విజయంగా కూడా దీనిని అంతా చెబుతున్నారు సో ఆల్ ది బెస్ట్ పవన్ అని అనాల్సిందే మరి.'

Tags:    

Similar News