నోరు జారిన ఫలితం..టార్గెట్ అవుతున్న సాయిరెడ్డి

కాకినాడ పోర్టు వ్యవహారానికి సంబంధించిన లావాదేవీల వ్యవహారాలలో ఆయన ప్రమేయం ఉందంటూ విజయసాయిరెడ్డికి ఈ నోటీసులు ఇచ్చారు.

Update: 2024-12-12 03:58 GMT

రాజ్యసభలో వైసీపీ పక్ష నాయకుడు వి విజయసాయిరెడ్డి ఒకపుడు క్యాలిక్యులేటెడ్ గా ఆచీ తూచీ మాట్లాడేవారు. అయితే ఆయన కొంతకాలంగా మాటలో జోరు పెంచారు. దాని ఫలితం కూడా జోరుగానే ఉంటోంది. ఆయన మీద ఏపీ సీఐడీ లుకౌట్ నోటీసుని ఇచ్చింది. కాకినాడ పోర్టు వ్యవహారానికి సంబంధించిన లావాదేవీల వ్యవహారాలలో ఆయన ప్రమేయం ఉందంటూ విజయసాయిరెడ్డికి ఈ నోటీసులు ఇచ్చారు. అంతే సాయిరెడ్డి ఆవేశంతో మండిపోయారు.

తన మీద లుకౌట్ నోటీసులు ఇవ్వడమేంటి అని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు మీద గరం గరం అయ్యారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ అయన చంద్రబాబుని మళ్లీ జైలులో పెడతామని హెచ్చరించే విధంగా వ్యాఖ్యలు చేశారు. తాము 2029 ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి వస్తామని అప్పటికి చంద్రబాబు బతికి ఉంటే జైలే గతి అన్నారు.

ఇక్కడ బతికే ఉంటే అన్న కామెంట్ టీడీపీ నేతలను ఇంకా మండించింది.దాంతో వైసీపీ ఎంపీ సాయిరెడ్డి మీద కేసు నమోదు చేయాలని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న నాయకత్వంలో టీడీపీ ప్రతినిధి బృందం విజయవాడలో పోలీసులను కలసి ఫిర్యాదు చేసింది. చంద్రబాబు మీద విజయసాయిరెడ్డి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని కూడా అందులో పేర్కొంది. దాంతో అక్కడ కేసు నమోదు అయింది.

మరో వైపు చూస్తే అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ లో కూడా సాయి రెడ్డి మీద ఇదే విషయంపై ఇంకో కేసు నమోదు అయింది. సాయిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అని బావులపాడుకు చెందిన టీడీపీ నేత గుడాల సత్య్నారాయణ కూడా ఖండించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి విజయసాయిరెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన అధికారికంగా ఫిర్యాదు చేశారు. దీంతో ఇక్కడా కేసు నమోదు అయింది.

అంతే కాదు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యల వెనుక కుట్ర దాగి ఉందని టీడీపీ నేతలు అంటున్నారు. దానిని గమనించి ఆయన ఆయన కదలికలపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టాలని కూడా పోలీసులను కోరారు. మొత్తం ఈ వ్వవహారంలో విజయసాయిరెడ్డి ఏమి సాధిస్తున్నారో కాని ఆయనను టార్గెట్ చేసి టార్గెట్ చేయాలని చూస్తున్న టీడీపీ నేతలు మరింతగా దొరుకుతున్నారు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News