తొలిసారి చంద్రబాబు నుంచి లోకేష్‌కు ఊహించని అనుభవం!
దీంతో నిజంగానే కష్టపడే వారు కూడా.. చంద్రబాబు ఒక్కసారి పొగిడితే చాలని సంబర పడతారు.
ఫస్ట్‌టైమ్ ఏపీసీఎం చంద్రబాబు నుంచి ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. నారా లోకేష్‌ను తొలిసారి అందరి ముందూ.. చంద్రబాబు పొగడ్తలతో ముంచెత్తారు. నారా లోకేష్ ఎంత కష్టపడ్డారో.. నాకు తెలుసు! అని వ్యాఖ్యానించారు. నిజానికి చంద్రబాబు ఎవరినీ పొగడరు. ఎంతో కష్టపడితే తప్ప.. ఆయనను ఏ విషయంలోనూ మెప్పించలేమ ని అందరూ అంటారు. ఇది కూడా వాస్తవమే. ఎందుకంటే.. రోజుకు 18 గంటలు కష్టపడే చంద్రబాబు ముందు.. మిగిలిన వారి కష్టం పెద్దగా లెక్కలోకి రాదు. దీంతో నిజంగానే కష్టపడే వారు కూడా.. చంద్రబాబు ఒక్కసారి పొగిడితే చాలని సంబర పడతారు.
అలాంటిది.. నారా లోకేష్ ఏమీ కోరకుండానే..చంద్రబాబు నోటి నుంచి పొగడ్తల జల్లు కురిసింది. అది కూడా అన్ని జిల్లాల కలెక్ట ర్లతో నిర్వహించిన సదస్సు తొలి రోజే.. చంద్రబాబు అందరి ముందూ మంత్రి నారా లోకేష్ గురించి.. చెప్పుకొచ్చారు. ''కష్టం అంటే ఏమిటో నారా లోకేష్ అమెరికా పర్యటన చాటి చెబుతుంది'' అని చెప్పారు. విధ్వంసమైన ఏపీని పునర్నిర్మాణం చేస్తున్న క్రమంలో విశాఖలో గూగుల్ ను స్థాపించేందుకు నారా లోకేష్ కంకణం కట్టుకున్నారని తెలిపారు. తొలిసారి ఈ విషయం తనకు చెప్పినప్పుడు.. సాధ్యం కాదేమోనని అన్నట్టు తెలిపారు. కానీ, పట్టుదలతో నారా లోకేష్ సాధించారని చెప్పారు.
''ఇటీవలే ఐటీ మినిస్టర్ లోకేష్ అమెరికా వెళ్లారు. గూగుల్ కంపెనీ విశాఖ రావడానికి కృషి చేశారు. అలుపెరగకుండా శ్రమిస్తే ఫలితం వస్తుందనడానికి ఇదొక ఉదాహరణ. పాజిటివ్ గా పాటుపడితే ఫలితాలు కూడా పాజిటివ్ గానే ఉంటాయి. దానికి లోకేషే ఉదాహరణ'' అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. దీంతో కలెక్టర్ల సదస్సుకు వచ్చిన మంత్రులు, అధికారులు కూడా ఆశ్చర్య పోయారు. ఇక, టీడీపీ మంత్రులకు అయితే.. నోట మాట రాలేదు. బహిరంగ వేదికలపై గతంలోను.. ఇప్పుడు కూడా.. ఎవరినీ చంద్రబాబు పొగిడి ఉండకపోవడం.. ఎంత చేసినా.. ఇంకా ఏదో చేయాలని చెప్పడం వారు గుర్తు చేసుకున్నారు. నిజానికి నారా లోకేష్ కూడా.. చంద్రబాబు తనను పొగుడుతారని ఊహించలేదు. దీంతో ఆయన కన్నార్పకుండా..చంద్రబాబు వైపే చూస్తూ ఉండిపోయారు.