68 కిలోల బంగారం చేసిన యాదగిరి గుట్ట స్వర్ణ గోపురం వీడియో చూశారా?

తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కొత్తగా నిర్మించిన స్వర్ణ గోపురంతో మరింత దేదీప్యమానంగా వెలుగొందుతోంది.

Update: 2025-02-23 07:58 GMT

తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కొత్తగా నిర్మించిన స్వర్ణ గోపురంతో మరింత దేదీప్యమానంగా వెలుగొందుతోంది. సూర్య కిరణాలు స్వర్ణ గోపురంపై పడినప్పుడు ఆ వెలుగులు కిలోమీటర్ల దూరం వరకు కనిపించి భక్తుల మనసుకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి.

- సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం

ఈ పవిత్ర బంగారు గోపుర ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు హెలికాప్టర్‌లో యాదగిరిగుట్టకు చేరుకున్న సీఎం, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయం 11:54 గంటలకు మూలా నక్షత్రం, వృషభ లగ్నం, పుష్కర అంశంలో లక్ష్మీనరసింహ స్వామికి స్వర్ణ విమాన గోపురాన్ని అంకితం చేశారు. పండితుల ఆధ్వర్యంలో బంగారు విమాన గోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణ నిర్వహించారు.

- భవ్యమైన స్వర్ణ విమాన గోపురం

ఈ స్వర్ణ విమాన గోపురం సాధారణ గోపురంలా కాకుండా ఎంతో విశిష్టంగా నిర్మించబడింది. దీని ఎత్తు 50.5 అడుగులు కాగా, పూర్తిగా బంగారు తాపడం చేయబడింది. ఈ గోపుర నిర్మాణానికి 68 కేజీల బంగారం వినియోగించగా.. రూ. 3.90 కోట్లు ఖర్చు అయింది. అదనంగా గోల్డ్ ప్లేటింగ్ తయారీ, అమరిక కోసం మరో రూ. 8 కోట్లు వెచ్చించబడింది. చెన్నైకి చెందిన మెసర్స్ స్మార్ట్ క్రియేషన్స్ కంపెనీ ఈ పనులను విజయవంతంగా పూర్తి చేసింది.

-కేసీఆర్ కల.. రేవంత్ చేతుల మీదుగా సాకారం

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ప్రభుత్వం హయాంలో స్వర్ణ గోపుర నిర్మాణం ప్రతిపాదించబడింది. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత రాష్ట్ర పాలన మారడంతో ఈ ప్రారంభోత్సవం ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరిగింది. అయినప్పటికీ ఈ బంగార గోపురం సంకల్పం కేసీఆర్ కలగన్నట్లుగానే నెరవేరింది.

- భక్తులకు తిరుమల వాతావరణం

మార్చి 1 నుంచి యాదగిరిగుట్టలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. స్వర్ణ గోపుర ప్రారంభంతో యాదగిరిగుట్ట ప్రాశస్త్యం మరింత పెరిగింది. భక్తులకు ఇప్పుడు ఈ దేవస్థాన సందర్శన తిరుమలకు వెళ్లిన అనుభూతిని కలిగించనుంది. నిలువెత్తు బంగారు గోపురం అందరి దృష్టిని ఆకర్షిస్తూ భక్తుల హృదయాలలో భక్తిభావాన్ని నింపుతోంది.

Tags:    

Similar News