రూ.15,000 కోట్ల వ్యవహారం... హైదరాబాద్ కు ట్రంప్ కుమారులు!
ఈ సమయంలో డొనాల్డ్ ట్రంప్ కుమారులు త్వరలో భారత్ లో పర్యటించనున్నారని అంటున్నారు.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా డొనాల్డ్ ట్రంప్ పేరు మారుమోగిపోతోన్న సంగతి తెలిసిందే. తాజాగా అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన అభిమానులు, రిపబ్లికన్లు హర్షం వ్యక్తం చేస్తుండగా.. పలు దేశాలు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని అంటున్నారు. ఈ సమయంలో డొనాల్డ్ ట్రంప్ కుమారులు త్వరలో భారత్ లో పర్యటించనున్నారని అంటున్నారు.
అవును... అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ రికార్డ్ స్థాయిలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేస్తున్నారు. ఓ పక్క భారతీయులు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేలా జన్మతః పౌరసత్వం రద్దుకు సంబంధించి ఆర్డర్లు జారీ చేశారు. దీనిపై తీవ్ర చర్చ జరుగుతుంది. మరోపక్క మోడీతో ట్రంప్ కి ఉన్న అనుబంధం మేరకు.. భారత్ - అమెరికా బంధం మరితం బలపడే అవకాశం ఉందని అంటున్నారు.
ఆ సంగతి అలా ఉంటే... యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ కుమారులు త్వరలో భారత్ లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా... భారత్ లో నూతనంగా నిర్మించనున్నట్లు చెబుతున్న ఐకానిక్ ‘ట్రంప్ టవర్స్’ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ముంబై, గురుగ్రామ్, బెంగళూరు, నొయిడాతో పాటు హైదరాబాద్ లోని ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ట్రంప్ కుమారులు వస్తారని అంటున్నారు.
ఈ నేపథ్యంలో ఈ ఐదు ప్రాంతాల్లోనూ వారు పర్యటించనున్నారని తెలుస్తోంది. ఈ పర్యటన అనంతరం అమెరికాలోని ట్రంప్ టవర్స్ సంఖ్యను భారత్ లోని ట్రంప్ టవర్స్ సంఖ్య అధిగమించబోతోందని అంటున్నారు. ఈ సమయంలో... అమెరికా వెలుపల ఎక్కువ ట్రంప్ టవర్స్ ఉన్న దేశాల్లో భారత్ టాప్ ప్లేస్ లో ఉండబోతోందని చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆరు కొత్త ప్రాజెక్టులు ప్లాన్ చేశారని చెబుతున్నారు.
వాస్తవానికి ఇప్పటికే భారత్ లోని ముంబై, పూణె, కోల్ కతా, గుర్గావ్ ప్రాంతాల్లో 4 ట్రంప్ టవర్లు ఉండగా.. ఇవి రాబోయే ఆరేళ్లలో 10కి విస్తరించనున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా రాబోయే ఆరు టవర్లు... ముంబై, గుర్గావ్, పూణెతో పాటు నొయిడా, బెంగళూరు, హైదరాబాద్ లలో పట్టాలెక్కనున్నాయని చెబుతున్నారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు ఉన్న బిజినెస్ కంటే రెట్టింపు వ్యాపారం జరగబోతుందని అంచనా వేస్తున్నారు.
ఇందులో భాగంగా.. భారత్ లోని నాలుగు ట్రంప్ టవర్లలోని మొత్తం 800 లగ్జరీ నివాసాల మొత్తం అమ్మకపు విలువ రూ.7,500 కోట్లు కాగా... త్వరలో చేపట్టనున్న ఆరు కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన ఫ్లాట్ల అమ్మకాల విలువ రూ.15,000 కోట్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డొనాల్డ్ ట్రంప్ కుమారులు భారత్ లో పర్యటించనున్నారని అంటున్నారు.