ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మరో మలుపు.. ఇక భీకరమే..

గత ఏడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్ పై దాడి చేసిన హమాస్ ఉగ్రవాదులు 200 మంది పౌరులను బందీలుగా పట్టుకెళ్లారు.

Update: 2024-09-01 16:30 GMT

గత ఏడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్ పై దాడి చేసిన హమాస్ ఉగ్రవాదులు 200 మంది పౌరులను బందీలుగా పట్టుకెళ్లారు. వీరిలో ఇజ్రాయెలీలతో పాటు అమెరికన్లు, జర్మన్లు, బ్రిటన్ కు చెందినవారు ఉన్నారు. వీరిలో 100 మంది పైగా ఇంకా బందీలుగా ఉన్నట్లు సమాచారం. వీరిని విడిపించడంతో పాటు ఇజ్రాయెట్-హమాస్ మధ్య కాల్పుల విరమణకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, ఈ ప్రయత్నం మీద నీళ్లు పోసేలా ఓ దారుణం చోటుచేసుకుంది. హమాస్‌ బందీలుగా పట్టుకున్నవారిలో ఆరుగురు చనిపోయారు. దక్షిణ గాజాలోని రఫా నగరంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్‌) చేపట్టిన ఆపరేషన్‌ లో వీరి మృతదేహాలను గుర్తించారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు.

ఆ సొరంగాలు మహా భయంకరం..

గాజాలో హమాస్ సొరంగాలు మహా దుర్బేధ్యం. వీటిలోనే బందీలు ఉంచుతున్నట్లు సమాచారం. తాజాగా చనిపోయినది ఇక్కడే. కాగా, ఇజ్రాయెల్‌ సైన్యం వెళ్లేందుకు ముందే వీరిని హమాస్‌ ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా హతమార్చారు. అక్టోబరు నుంచి వీరిని చిత్రహింసలు పెట్టారు. కాగా, గతవారం రఫాలోని ఓ సొరంగం నుంచి ఓ బందీని ఐడీఎఫ్‌ విడిపించింది. అయితే, దానికి కిలోమీటరు దూరంలోనే ఉన్న సొరంగంలో తాజా మృతదేహాలు లభించాయి.

అమెరికా ఊరుకుంటుందా?

ప్రపంచంలో భూమ్మీద ఎక్కడైనా సరే తమ పౌరుడికి ఇబ్బంది కలిగితే అమెరికా సైన్యం రంగంలోకి దిగుతుంది. తాజాగా హమాస్ హతమార్చిన బందీల్లో ఇజ్రాయెల్‌-అమెరికన్‌ హెర్ష్‌ గోల్డ్‌ బర్గ్‌ పొలిన్ (23) ఉన్నాడు. దీనిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ధ్రువీకరించారు. అతడి మరణానికి ప్రతీకారం తప్పదని హెచ్చరించారు.

బందీల ప్రాణాలు పణం..

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. బందీల ప్రాణాలను పణంగా పెట్టి యుద్ధం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆయనపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు గాజాలోని 40,691 మంది మరణించారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది. అయితే, ఒప్పందంలో భాగంగా హమాస్‌ చెరలో ఉన్న బందీల్లో కొందరిని ఇప్పటికే విడుదల చేశారు. ప్రాణాలతో ఉన్నవారు ఎందరో తెలియదు.

Tags:    

Similar News