ఔరా.. అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్.. ప్రతిష్ఠాత్మక ఇస్రో స్పే డెక్స్ వాయిదా

ఇటుక, ఇటుక పేర్చుకుంటూ వెళ్లి నిర్మించే అద్భుతమే స్పేడెక్స్. వందల కిలోమీటర్ల ఎత్తులో ఏమాత్రం తేడా రాకుండా ఈ కసరత్తు చేస్తారు.

Update: 2024-12-30 09:47 GMT

స్పేడెక్స్.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన ప్రతిష్ఠాత్మక ప్రయోగం.. ఈ ఏడాదిలో చివరి ప్రయోగం కూడా.. ఏమిటీ దీని విశిష్ఠత..? అంటే.. రోదసిలో డాకింగ్.. ఈ ప్రయత్నం చేసి విజయం సాధించిన దేశాలు మూడే మూడు. అవి అమెరికా, రష్యా, చైనా. వాటి సరసన చేరేందుకు భారత్ సైతం ప్రయోగానికి సిద్ధమైంది. ఈ మేరకు అంతరిక్షంలో ‘డాకింగ్’ కు ప్రయత్నం చేసింది. ఇది విజయవంతం అయితే సొంత అంతరిక్ష కేంద్రం నిర్మాణానికి అడుగు పడినట్లే. అందుకే స్పేస్‌ డాకింగ్‌ ఎక్స్‌పెరిమెంట్‌ (స్పేడెక్స్‌) ప్రయోగం అంత ప్రత్యేకమైనదిగా చెబుతున్నారు.

ఇటుక, ఇటుక పేర్చుకుంటూ వెళ్లి నిర్మించే అద్భుతమే స్పేడెక్స్. వందల కిలోమీటర్ల ఎత్తులో ఏమాత్రం తేడా రాకుండా ఈ కసరత్తు చేస్తారు. దీనినే డాకింగ్‌ గా అంటారు. ఈ సంక్లిష్ట టెక్నాలజీని ఒడిసిపట్టి, రోదసి పరిశోధనల్లో తదుపరి అధ్యాయంలోకి అడుగు పెట్టేందుకు ఇస్రో సమాయత్తమైంది. పీఎస్‌ఎల్‌వీ-సి60 రాకెట్‌ ద్వారా స్పేడెక్స్‌ పేరిట జంట ఉపగ్రహాలను భూ కక్ష్యలో అనుసంధానం చేసే బృహత్తర ప్రయోగాన్ని చేపట్టింది

అంతరిక్షంలో రెండు వేర్వేరు వ్యోమనౌకలు అనుసంధానం కావడమే డాకింగ్‌. టెక్నికల్ గా ఇది చాలా సవాళ్లతో కూడుకున్నది. మానవ ప్రమేయం పరిమితం. గంటకు వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వ్యోమనౌకలు.. అంతలోనే వేగాన్ని నియంత్రించుకుంటూ పరస్పరం చేరువవుతూ, కమ్యూనికేషన్‌ సాగిస్తూ సున్నితంగా అనుసంధానం కావాలి. కాస్త తేడా వచ్చినా ఢీకొని పేలిపోతాయి.

రోదసిలో అంతరిక్ష కేంద్రం వంటి భారీ నిర్మాణాలకు అవసరమైన ఆకృతులను ఒకేసారి రాకెట్‌ లో తరలించలేరు. విడి భాగాలను దఫదఫాలుగా కక్ష్యలోకి చేర్చి.. అనుసంధానం చేసే ప్రయోగమే డాకింగ్‌. మనందరం చెప్పుకొనే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్నీ (ఐఎస్‌ఎస్‌) ఇలాగే నిర్మించారు. వ్యోమగాములు, సరకులను తరలించే వ్యోమ నౌకలు కూడా డాకింగ్‌ ద్వారా ఆ స్టేషన్‌ తో అనుసంధానం కావాల్సిందే. భారత్‌ కూడా సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించబోతోంది. దానికోసమే స్పేడెక్స్‌ ప్రయోగం.

అడ్డుపడిన అంతరిక్ష ట్రాఫిక్

భూమ్మీద ట్రాఫిక్ జామ్ అంటే.. బెంగళూరు, హైదరాబాద్ నగరాలను చూసి చెప్పొచ్చు. కానీ, అంతరిక్షంలోనూ ట్రాఫిక్‌ జామ్‌ అయిందట. స్పే డెక్స్ ప్రయోగం అందుకే వాయిదా పడింది. అంతరిక్షంలో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. రాకెట్‌ వెళ్లాల్సిన అదే కక్ష్యలో ఇతర ఉపగ్రహాలు అనుసంధానం చెందాయని ఇస్రో చైర్మన్ సోమ్‌నాథ్‌ తెలిపారు. దీంతో సోమవారం రాత్రి 9.58 గంటలకు బదులు 10 గంటల 15 సెకన్లకు రీ షెడ్యూల్‌ చేశామని చెప్పారు.

Tags:    

Similar News