పదవి ఊడినా అహంకారం తగ్గని చింతమనేని
అయిదేళ్ళ పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేగా చింతమనేని తన అధికారాన్ని అడ్డూ అదుపూ లేకుండా ఉపయోగించారు అనడానికి ఎన్నో ఉదాహరణలు నాడు ఉన్నాయి.
ఏలూరు జిల్లా దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అంటే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది తాసిల్దార్ వనజాక్షి మీద చేసిన దారుణ దాష్టికం. ఇది ఏపీ చరిత్రలోనే చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. అయిదేళ్ళ పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేగా చింతమనేని తన అధికారాన్ని అడ్డూ అదుపూ లేకుండా ఉపయోగించారు అనడానికి ఎన్నో ఉదాహరణలు నాడు ఉన్నాయి.
ఇసుక దందాలు చేయడమే కాకుండా నిబంధననలకు విరుద్ధంగా అటవీ భూములలో రోడ్లు వేయడం చింతమనేనికే చెల్లింది.అలా ఎందుకు చేస్తున్నారు అని అడ్డుకున్న అటవీ సిబ్బందిని కొట్టడమూ ఆయన ఖాతాలోనే ఉంది.
ఇక ఎస్సీలకు రాజకీయాలు ఎందుకు అని లూజ్ టంగ్ తో దుర్భాషలాడడం ఆయనకే సాధ్యం అని చెప్పుకుంటారు. బీసీలు బడుగులు అంటే ఈ మాజీ ఎమ్మెల్యేకు ఎంతో చులకనభావం అన్నది గత ఉదంతాలు రుజువు చేశాయి. తాను చేసిన అక్రమాలకు ఆయన మీద కేసులు పడ్డాయి. అరెస్ట్ అయి స్టేషన్ లో ఉండి బయటకు వచ్చిన చింతమనేనికి పులుపు మాత్రం ఇంకా చావలేదు అని అంటున్నారు.
ఎమ్మెల్యే పదవి పోయింది. జనాలు అయితే ఇంత అహంకారం ఉన్న ఎమ్మెల్యే మా కొద్దు అన్నారు. అంతా కలసి ఇంట్లో కూర్చోబెట్టారు. అయినా సరే చింతమనేనికి జనం ఇచ్చిన గుణపాఠం సారం మాత్రం బోధపడలేదు. యధా ప్రకారం తన జులుం చూపిస్తూ బడుగుల మీద నోరు చేయి చేసుకుంటున్నారు.
తాజాగా చింతమనేని మరో ఘాతుకానికి పాల్పడ్డారు, దీంతో గౌడ సంఘం వారు రోడ్డు మీద బైఠాయించి మరీ చింతమనేని కారును అడ్డగించారు. ఇంతకీ చింతమనేని ఏమి చేశారు అంటే దెందులూరు నియోజకవర్గంలోని పెదవేగి మండలం రామచంద్రాపురం అడ్డరోడ్డు దగ్గర వీరంకి లక్ష్మీనారాయణ అనే గొర్రెల కాపరిపై చింతమనేని దాడి చేశారు.
ఎందుకు దాడి చేశారు అంటే తన జీడి మొక్కల దగ్గరకి గొర్రెలు వెళ్లాయంటూ ఈ దాడికి పాల్పడ్డారు. నిజానికి అటుగా వెళుతున్న చింతమనేని కారు దిగి మరీ గొర్రెల కాపరి లక్ష్మీనారాయణను తిడుతూ ఆయన్ను కింద పడేసి గుండెల మీద తన్నడమే కాకుండా అతని గొర్రెలను దౌర్జన్యంగా తన కార్లో ఎక్కించుకొని తీసుకుపోయారు. దీని మీద గొర్రెల కాపరి లక్ష్మీనారాయణ పోలీస్లకు ఫిర్యాదు చేశాడు.
సరే ఇలా చేయడమే తప్పు అనుకుంటే చింతమనేని అహంకారం హద్దులు దాటేసింది. తనను ఆపేందుకు ఎవడొస్తాడో చూస్తానని ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకోమంటూ చింతమనేని ఆ గొర్రెల కాపరిని బెదిరించారు. ఇక ఈ సంఘటనకు అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలే సాక్ష్యమని గొర్రెల కాపరి తన బాధ చెప్పుకున్నాడు.
ఇదిలా ఉంటే ఈ సంఘటన తెలిసిన వెంటనే దెందులూరు నియోజకవర్గం గౌడ సంఘం అధ్యక్షుడు మట్టా శంకర్ గారి ఆధ్వర్యంలో ప్రజలు రామచంద్రాపురం అడ్డరోడ్డుకు చేరుకొని చింతమనేని కారును అడ్డగించి నిలదీశారు. అయితే యధాప్రకారం చింతమనేని బుకాయించేసారు. అసలు తాను కొట్టలేదని చెబుతూ జస్ట్ అలా తోశాను అంతే అని యాక్షన్ కూడా చేసి చూపించారు. జనాలు అంతా అలా పోగు అయ్యేసరికి ఈ మాజీ ఎమ్మెల్యే కారు ఎక్కి అక్కడ నుంచి మెల్లగా జారుకున్నారు.
ఈ ఘటన చూస్తే అయిదేళ్ళ క్రితం జనం ఇచ్చిన తీర్పులో ఏ మాత్రం తప్పు లేదనే అంతా అంటున్నారు. మొత్తానికి చింతమనేనికి ఇంకా బలుపు తగ్గలేదని కూడా అంటున్నారు. ఈ మాజీ ఎమ్మెల్యేని వచ్చే ఎన్నికల్లో కూడా ఓడిస్తే తప్ప పొగరు కిందికి దిగదని ప్రజలు అంటున్నారు.
చింతమనేని ప్రభాకర్ ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు అన్నది కూడా టీడీపీ అధినాయకత్వం ఆలోచించాల్సి ఉందని అంటున్నారు. చింతమనేని వంటి వారు ఇలా దురుసుతనం చేయడం అంటే అది కచ్చితంగా పార్టీ మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది అని అంటున్నారు. ఈ విషయంలో ఆయన్ని దారికి తేవాల్సిన బాధ్యత అయితే టీడీపీ హై కమాండ్ మీదనే ఉందని అంటున్నారు. ఇలాంటి వారికే టికెట్లు ఇస్తామని టీడీపీ హై కమాండ్ భావిస్తే మాత్రం భారీ మూల్యం మళ్ళీ చెల్లించుకోక తప్పదు అని అంటున్నారు.