పంతం నెగ్గించుకున్న జోగి రమేష్!
ఇది ప్రజల్లోనూ వ్యతిరేకతను పెంచేసింది. అయినా.. జగన్ లెక్కచేయలేదు.
వైసీపీ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ మరోసారి పంతం నెగ్గించుకున్నారు. గతంలో చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన తర్వాత.. ఆయన మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఏరికోరి జోగిని మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. సీనియర్లు, వివాద రహితులు ఉన్నా కూడా.. జగన్ జోగికి పట్టం కట్టారు. ఆయనపై విమర్శలు వచ్చినా.. సమర్థించుకున్నారు. ఫలితంగా జగన్ కేబినెట్‌లో వివాదాస్పద నాయకులే ఉన్నారన్న ప్రచారం జోరుగా సాగింది. ఇది ప్రజల్లోనూ వ్యతిరేకతను పెంచేసింది. అయినా.. జగన్ లెక్కచేయలేదు.
ఇక,ఇప్పుడు మరోసారి జోగి తన పంతం నెగ్గించుకున్నారు. తను ఆది నుంచి కోరుతున్న మైలవరం నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్ పదవిని ఆయన దక్కించుకున్నారు. దీనికి తాజాగా జగన్ అంగీకారం తెలిపారు. నిజానికి గత ఎన్నికలకు ముందే.. జోగి తన నియోజకవర్గం మార్చమని కోరారు. మైలవరం నుంచి పోటీ చేస్తానని కూడా చెప్పారు. అయితే.. మైలవరం కాకుండా.. జోగిని పెడన నియోజకవర్గం నుంచి పెనమలూరు నియోజకవర్గానికి షిఫ్ట్ చేశారు. ఇక, తాజా ఎన్నికల్లో జోగి ఓడిపోయారు. అయినా.. తరచుగా మీడియా ముందుకు వచ్చి.. కూటమి సర్కారుపై విమర్శలు చేస్తున్నారు. ఇటీవల తన కుమారుడిని అరెస్టు చేయడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. అగ్రిగోల్డ్ అంటే ఏంటో కూడా తమకు తెలియదని చెప్పారు.
ఇదిలావుంటే.. మైలవరం నియోజకవర్గంలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికే చెందిన సన్యాల తిరుపతి రావు అనే సాధారణ కార్యకర్తకు జగన్ టికెట్ ఇచ్చారు. ఆయన గెలుపు బాధ్యతను కూడా తానే తీసుకుంటానన్నారు. అయితే.. అక్కడ పార్టీ విఫలమైంది. ఇక, అప్పటి నుంచి తిరుపతి రావు యాక్టివ్‌గా లేకపోవడంతోపాటు.. పార్టీ కార్యాలయాన్ని కూడా తీసేశారు. ఇక, కార్యకర్తలు కూడా రేపోమాపో.. టీడీపీలోకి జంప్ చేసేందుకు రెడీ అయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇటు పార్టీని బతికించుకోవడం కోసం.. అటు జోగిని మరింత లాలించే క్రమంలో జగన్ ఆయనకు మైలవరం నియోజకవర్గం పార్టీ పగ్గాలను అప్పగించారు.
ముదరనున్న రాజకీయం..
జోగి రమేష్ సొంత నియోజకవర్గం మైలవరం కావడంతో ఇక్కడ ఆయన దూకుడు ఎక్కువగానే ఉండనుంది. ఇదేసమయంలో వైసీపీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో చేరి విజయం దక్కించుకున్న వసంతకృష్ణ ప్రసాద్‌కు, జోగికి మధ్య వివాదాలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు జోగిని తిరిగి మైలవరం పంపించడంతో ఈ ఇద్దరి మధ్య రాజకీయాలు జోరుగా సాగే అవకాశం ఉండనుందనే అంచనాలు వస్తున్నాయి. గతంలో అధికారంలో ఉన్నప్పుడే.. వసంత వర్సెస్ జోగి మధ్య గనుల వ్యవహారం.. సహా ఇసుక వంటి కీలక విషయాల్లో రోజుకో రగడ తెరమీదకి వచ్చింది. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.