బాబుకు బిగ్ టాస్క్ పెట్టి జగన్.. !
ఆలపాటికి సహకరించే విషయంలో కూటమి నేతలు పెద్దగా స్పందించడం లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా నాయకులు వ్యవహరిస్తున్నారు.
వైసీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు జగన్.. సీఎం చంద్రబాబుకు బిగ్ టాస్కే పెట్టారు. తన ప్రమేయం లేదని, తన పార్టీ నాయకులు కూడా పోటీకి లేరని జగన్ చెబుతున్నా.. ప్రస్తుతం జరుగుతున్న మండలి ఎన్నికల్లో వైసీపీ ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోంది. ఉమ్మడి గుంటూరు, కృష్ణాజిల్లాల పరిధిలో పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమన్న వాదన ఉంది. కానీ.. కొన్ని పొరపాట్లు ఉన్నాయి.
ఆలపాటికి సహకరించే విషయంలో కూటమి నేతలు పెద్దగా స్పందించడం లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా నాయకులు వ్యవహరిస్తున్నారు. మరోవైపు.. వైసీపీ పోటీలేకపోయినా.. పరోక్షంగా ఇక్కడ కమ్యూనిస్టులకు మద్దతు ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని కూటమి నేతలు ముఖ్యంగా టీడీపీ నాయకులు కూడా గుర్తించారు. అందుకే.. చంద్రబాబు పదే పదే అందరూ కలిసి మెలిసి ఉండాలని కోరుతున్నారు.
ఇక, వైసీపీ పోటీ పెట్టని నేపథ్యంలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను కూడా.. టీడీపీ అభ్యర్థులు నెగ్గుకురావడం కష్టం కాదన్న అభిప్రాయం తొలినాళ్లలో ఉండేది. కానీ, ఇప్పుడు పోలింగ్ డేట్ దగ్గర పడు తున్న నేపథ్యంలో అనూహ్యంగా ఈ పోటీ పెరుగుతుండడం గమనార్హం. వైసీపీ మద్దతు వామపక్షాలకు ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో కమ్యూనిస్టులు కొట్టినా కొట్టొచ్చన్న అభిప్రాయం ఉంది. ఇది .. చంద్రబాబు కు తీవ్ర ఇబ్బందే!
వైసీపీ వంటి బలమైన పార్టీ పోటీలో లేకున్నా.. టీడీపీ అభ్యర్థులు విజయం దక్కించుకోకపోతే.. అది చం ద్రబాబు రాజకీయ వ్యూహానికి పెద్ద ఇరకాటంగా మారే అవకాశం ఉంది. తాడేపల్లిలోనే ఉంటున్నప్పటికీ.. జగన్ ఈ ఎన్నికలను తనదైన శైలిలో శాసించే పరిస్థితి వచ్చిందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు పదే పదే నాయకులకు చెబుతున్నారు. చిన్న ఎన్నికైనా.. పెద్ద ప్రభావం చూపుతుందని కూడా అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.