బాబు అంటే జగన్ కి అంత నమ్మకమా ?

జగన్ చంద్రబాబుతో గత పుష్కర కాలంగా రాజకీయ పోరాటం చేస్తున్నారు.

Update: 2024-09-12 03:53 GMT

జగన్ చంద్రబాబుతో గత పుష్కర కాలంగా రాజకీయ పోరాటం చేస్తున్నారు. అయితే ఏ పోరాటంలో విజయం అయినా వ్యూహాలను బట్టి ఆధారపడి ఉంటుంది. శత్రువు బలాన్ని అంచనా వేయడం దానికి తగినట్లుగా ప్రతి వ్యూహాలను రూపొందించడం మీదనే సక్సెస్ వస్తుంది. జగన్ వరకూ తీసుకుటే 2009 తరువాత వైఎస్సార్ మరణానంతరం ఆయనకు చంద్రబాబు డైరెక్ట్ ప్రత్యర్ధి అయ్యారు.

ఆ విధంగా ఇద్దరి మధ్యన అనేక రాజకీయ పోరాటాలు జరిగాయి. వైఎస్సార్ అనే కవచ కుండలాలు ధరించిన జగన్ ని బాబు ఒక దశలో ఎదుర్కోలేక పోయారు. ఆ సానుభూతి మంత్రం అంతా 2019 దాకా పనిచేస్తూ వచ్చింది. జగన్ అపుడు మధ్యాహ్న మార్తాండుడిగా కనిపించారు.

ఆయన 2014 నుంచి 2019 మధ్యలో విపక్ష నేతగా ఉన్నా కూడా అధికార పక్షాన్ని గడగడలాడించారు. అయితే జగన్ చేసిన ఈ పోరాటాలు అన్నీ కూడా వ్యూహాలతో కాదు, దూకుడుతో, ఆ దూకుడుకి ఇంధనంగా తండ్రి వైఎస్సార్ సానుభూతి కూడా చాలా దోహదపడింది

అయితే 2019 ఎన్నికల తరువాత ఆ సానుభూతి మెల్లగా ఇగిరిపోతూ వచ్చింది. జగన్ ని సీఎం గా చూడాలని జనాలు ఆరాటం అలాగే వైఎస్సార్ పాలన ఆయన నుంచి కోరుకున్న వారూ ఉన్నారు. ఇక క్యాడర్ కానీ వైఎస్సార్ ని అభిమానించే వారు కానీ జగన్ వెంట ఉండడానికీ ఇదే కారణం.

దాంతో జగన్ చుట్టూ అతి పెద్ద రక్షణ కవచం గా అది ఉంటూ వచ్చింది. అలా చంద్రబాబు మీదా మూడు ప్రత్యక్ష యుద్ధాలు చేసిన జగన్ ఒక యుద్ధంలోనే గెలిచారు అని గుర్తు పెట్టుకోవాలి. అందులో కూడా చంద్రబాబు వ్యూహాలు ఫెయిల్ అయి జగన్ సక్సెస్ కాలేదు. అలాగని జగన్ బాబుని మించిన వ్యూహాలు రూపొందించి అందలం ఎక్కలేదు.

ముందే చెప్పినట్లుగా ప్రజలు అంతా జగన్ ని సీఎం గా చూడాలని బలమైన కోరిక వల్లనే అది జరిగింది. ఇక 2024లో చూస్తే జగన్ తానుగా పోరాటం చేయాలి. వైఎస్సార్ సానుభూతి అన్నది లేదు, ఉన్నా అది చెల్లదు, ఎందుకంటే జగన్ సీఎం గా చేశారు. ఆ పదవిలో ఆయన చేసిన మంచి చెడులే ఆయనను మళ్లీ రాజకీయ మార్గాన వెనకకో ముందుకో నడిపిస్తాయి.

ఇదిలా ఉంటే జగన్ మాత్రం వేరేగా ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. చంద్రబాబుకు సీఎం పదవి వచ్చి పడింది లక్ గానే అని ఆయన భావిస్తున్నారులా ఉంది. అదే సమయంలో తనకు తరగని ప్రజాదరణ ఉందని దాని ముందు చంద్రబాబు ఓడిపోవడం ఖాయమని ఆయన భావిస్తున్నారు

అందుకే దారుణమైన ఓటమి తరువాత కూడా డే వన్ నుంచి చంద్రబాబు గద్దె దిగిపోతారు అనే అంటున్నారు. చంద్రబాబు ఢక్కామెక్కీలు తిన్న నాయకుడు. ఆయన ఊరకే ఎందుకు గద్దె దిగుతారు. ఆయన రాజకీయ జీవితం చూస్తే ఎన్నో వ్యూహాలు చతురతతోనే పదవిని సాధించుకుని వస్తున్నారు

పదవి విలువ ఏంటో ఆయనకు చాలా బాగా తెలుసు. పైగా ఆయనకు ప్రత్యర్ధి బలాబలాల మీద పూర్తి అవగాహన ఎపుడూ ఉంటుంది. అందుకే ఆయన జగన్ ని తక్కువ చేయడం లేదు, అలాగని ఎక్కువా చేయడం లేదు. ఆయన వాస్తవ దృష్టితోనే చూస్తూ కరెక్ట్ దారిలోనే జగన్ అనే ప్రత్యర్థిని ఎదుర్కొంటున్నారు.

అన్ని రకాల ఎత్తుగడలతోనే జగన్ ని కట్టడి చేసెందుకు చూస్తున్నారు. కానీ జగన్ మాత్రం చంద్రబాబు హామీలు ఏవీ అమలు చేయలేదని, ఇక మీదట కూడా సూపర్ సిక్స్ అయినా మరోటి అయినా చేయలేడని అందుకే ఆయనను జనాలు ఓడిస్తారు అని తనను గద్దెనెక్కిస్తారు అని ఆలోచిస్తున్నారు

రాజకీయాల్లో ఎవరికీ పదవి శాశ్వతం కాదు కానీ అదే సమయంలో ఆ పదవి దక్కడమూ కూడా అంత సులువు కాదు. జగన్ కి అద్భుతమైన మెజారిటీతో దక్కిన పదవిని ఆయన అయిదేళ్ల పాలన తరువాత కోరి దూరం చేసుకున్నారు. ఇపుడు మళ్ళీ జనాలు ఇస్తారని వారి కంటే ముందే చంద్రబాబు తన అధికారం ముంత ఒలకబోసుకుని చాన్స్ ఇస్తారని భావిస్తున్నారు.

నిజంగా ఇది భ్రమగానే అంతా చూస్తున్నారు. ఈసారి చంద్రబాబు అనేక రకాలుగా ఆరితేరి ఉన్నారు. ఆయన చేతిలో నుంచి అధికారం వైసీపీ పరం కావడం అంటే ఒక అద్భుతమే జరగాలి. జగన్ మాత్రం అది సాధార ప్రక్రియగా చూస్తున్నారు. అద్భుతాలు చేయడానికి వైసీపీ కానీ జగన్ కానీ సిద్ధంగా లేరు.

అందుకే బాబే తన పదవిని వదులుకుని బంగారు పళ్లెంలో ముఖ్యమంత్రిత్వం 2029 నాటికి ఇస్తారని భావిస్తున్నారు. ఆయన తాజాగా గుంటూరు జైలు వద్ద మీడియాతో మాట్లాడుతూ అన్న మాటలూ అదే సూచిస్తున్నాయి. ఈసారి టీడీపీకి సింగిల్ డిజిట్ నంబర్ కూడా రాదు అని అంటున్నారు. మరి ఆయనకు తన మీద కంటే బాబు మీద అంత నమ్మకమా అని సెటైర్లు పడుతున్నాయి. చంద్రబాబుని తక్కువగా అంచనా వేసి ఇలాగే కలలు కంటూంటే వైసీపీకి 2029 ఎన్నికలు కూడా చేదు అనుభవాలే చూపిస్తాయని అంటున్నారు.

Tags:    

Similar News