పుట్టి ముంచిన వారిపైనే ప్రేమ: జగన్‌కు సొంత సెగ!
కానీ, సొంత కేడర్ నుంచి కూడా సెగ తగిలితే.. ఇప్పుడు మరోసారి వైసీపీ అధినేత జగన్ ఇదే ఎదుర్కొంటున్నారు.
రాజకీయాల్లో ప్రత్యర్థుల నుంచి సెగ తగలడం కామనే. కానీ, సొంత కేడర్ నుంచి కూడా సెగ తగిలితే.. ఇప్పుడు మరోసారి వైసీపీ అధినేత జగన్ ఇదే ఎదుర్కొంటున్నారు. ఎన్నికలకు ముందు కూడా.. వలంటీర్లకు ఇచ్చిన ప్రాధాన్యం తమకు ఇవ్వలేదని కేడర్ నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యేలు తిట్టిపోశారు. ''మేం ప్రజల దగ్గరకు వెళ్లే మమ్మల్ని ఎవరూ గుర్తు పట్టడం లేదు. మేం ఇక్కడి ఎమ్మెల్యేలమేనని వలంటీర్ వచ్చి చెప్పాల్సి వచ్చింది. ఇంతకన్నా అవమానం ఏముంది?'' అని తూర్పు గోదావరికి చెందిన ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు.
ఇక, కేడర్ కూడా పార్టీ జెండాలు మోసేందుకే మాత్రమే మేము.. అంటూ ఎన్నికల సమయంలో కాడి పడే శారు. ఫలితంగా వైసీపీ అనామక ఫలితాన్ని దక్కించుకుంది. అనంతరం.. మార్పుల దిశగా జగన్ అడుగు లు వేశారు. తాజాగా ఆయన పార్టీలో జిల్లాలకు అధ్యక్షులను నియమించారు. అదేవిధంగా క్షేత్రస్థాయిలో నూ అధ్యయనం చేస్తున్నారు. దీంతో తమకు పదవులు దక్కుతాయని.. పార్టీలో పనిచేసిన ద్వితీయ స్థాయి నాయకులు ఆశించారు. కానీ, పార్టీని అన్ని విధాలా భ్రష్టు పట్టించి.. పార్టీలో ఆధిపత్య రాజకీయాలకు తెరదీసిన వారికే పదవులు ఇస్తున్నారంటూ .. సోషల్ మీడియాలో ఇప్పుడు నిప్పులు చెరుగుతున్నారు.
దీనికి కారణం.. నాయకులను జిల్లాల నుంచి మార్చినా.. నాయకులను మాత్రం మార్చకపోవడమే. వైవీ సుబ్బారెడ్డి కారణంగానే విశాఖ సహా ఉత్తరాంధ్రలో పార్టీ అట్టర్ ఫ్లాప్ అయిందన్న వాదన ఉంది. ఆయన సాగించిన ఏకఛత్రాధిపత్యాన్ని అప్పటి మంత్రి ధర్మాన ప్రసాదరావు.. బహిరంగంగానే తిట్టిపోశారు. ఈయనను ఇప్పుడు ఇక్కడ మార్చారు సరే. కానీ, కడప, అనంతపురం, కర్నూల్ జిల్లాలకు ఇంచార్జ్ పదవి ఇచ్చారు. దీనిని అక్కడ రెడ్డి నేతలు ఛీత్కరిస్తున్నారు. ''మాకు ఆయన సలహలు అవసరం లేదు. మేం చూసుకుంటాం'' అని కాటసాని వర్గంలోని కీలక నేత వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. మేం పనికిరాలేదా? అనికూడా నిలదీస్తున్నారు. ఇక, ఎక్కడో ఉత్తరాంధ్రకు ఇంచార్జ్‌గా ఉండాల్సిన బొత్స సత్యనారాయణను తీసుకువచ్చి ఉభయ గోదావరి జిల్లాలకు ఇంచార్జ్ ని చేశారు. దీంతో ఇక్కడివారు.. మేం పనికి రాలేదా? ఆయన సొంత జిల్లాలోనే ఆయన పార్టీని నడిపించలేక పోయారు. ఇప్పుడు మా దగ్గర ఏంచేస్తారని.. కురసాల అనుచరులు ప్రశ్నిస్తున్నారు. ఇక, తూర్పు, పశ్చిమలో 'జీరో' పెర్‌ఫార్మెన్స్ చూపించిన మిథున్‌రెడ్డిని గుంటూరు, ప్రకాశం జిల్లాలకు ఇంచార్జ్‌లు గా నియమించారు. ఈయన నియామకాన్ని కూడా ఆయా జిల్లాల నేతలు తప్పుబడుతున్నారు. మొత్తంగా వైసీపీలో అంతర్గత సెగ ప్రారంభమై.. నిప్పులు చెలరేగేందుకు రెడీగా ఉన్నట్టయింది.