జ‌గ‌న్ మైండ్ సెట్ మారాలి... !

దీనికి కారణం పార్టీ ఓడిపోయి మూడు నెలలు అయిపోయినా కూడా ఇంకా పుంజుకునే పరిస్థితిలో లేకపోవడమే అన్నది జరుగుతున్న చర్చ.

Update: 2024-09-12 07:30 GMT

జగన్ మైండ్ సెట్ మారాలనేది ఎక్కువ మంది నాయకులు చెబుతున్నా మాట. ఇది సొంత పార్టీలోనే వినిపిస్తుండడం పైగా సీనియర్ల నుంచి ఎక్కువగా వినిపిస్తుండటం పార్టీలో చర్చగా మారింది. నిజానికి ప్రతిపక్షాల నుంచి కూడా జగన్ మైండ్ సెట్ పై అనేక సందర్భాల్లో విమర్శలు వచ్చాయి. సరే, ప్రతిపక్షాల సంగతి ఎలా ఉన్నా సొంత పార్టీలో నేతలు మాత్రం ఇప్పుడు క‌స్సుబుస్సుమ‌నే పరిస్థితి ఉంది. దీనికి కారణం పార్టీ ఓడిపోయి మూడు నెలలు అయిపోయినా కూడా ఇంకా పుంజుకునే పరిస్థితిలో లేకపోవడమే అన్నది జరుగుతున్న చర్చ.

అయితే ఏంటి జగన్ మైండ్ సెట్ అంటే.. క్షేత్రస్థాయిలో నాయకులకు విలువ ఇవ్వకపోవడం, క్షేత్రస్థాయి నాయకులను పట్టించుకోకపోవడం, తాను చెప్పిందే వాస్తవమ‌ని భావించటం అనేది ఎక్కువగా జరుగుతున్న ప్రక్రియ. దీనిని మెజారిటీ నాయకులు ఒప్పుకోవడం లేదు. పార్టీ గెలిస్తే ఈ విధానం కొంత సమర్ధ నీయంగా ఉండేది. కానీ పార్టీ దారుణంగా ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా జగన్ మైండ్ సెట్ మారకపోవడం ఇప్పటివరకు జిల్లా స్థాయిలో ఇన్చార్జీలను కూడా నియమించకపోవడం అదేవిధంగా నియోజకవర్గాల్లో మార్పులు చేసినా కూడా ఇప్పటివరకు తిరిగి ఎవరి స్థానాలకు వారిని పంపించకపోవడం చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి.

ఎవరు సత్తా ఏమిటో గుర్తించకపోవడం వంటివి పార్టీలో నిరంతరం రగులుతూనే ఉన్నాయి. ఇదే విధానం కొనసాగిస్తే పార్టీ దారుణంగా దెబ్బతింటుందనేది మెజారిటీ నాయకుల అభిప్రాయం. అందుకే జగన్ మైండ్ సెట్ మారాలి అనేది ఎక్కువమంది నాయకులు కార్యకర్తలు చెబుతున్న మాట. దీనికితోడు జ‌గ‌న్ తన చుట్టూ ఒక కోటరీని నిర్మించుకుని అందులోనే ఉంటున్నారని దీంతో ఆయన ఏం చేయాలనుకున్నా ఆ కోటరీ చెప్పిందే వింటున్నారనేది ప్రధాన విమ‌ర్శ‌. అలా కాకుండా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది నాయకులు కార్యకర్తలు ఏమనుకుంటున్నారు అనేది ఆయన గమనించి దాని ప్రకారం వ్యవహరించాల‌ని కోరుకుంటున్నారు.

ఇదే జ‌రిగి ఉంటే పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదన్నది కొందరు చెబుతున్న మాట. ఈ నేపథ్యంలోనే కోటరీ రాజకీయాలకు స్వస్తి చెప్పి అందరినీ కలుపుకొని పోయేలా.. మెజారిటీ నాయకుల అభిప్రాయాన్ని పరిగణన‌లోకి తీసుకునేలా జగన్ వ్యవహరించాలని ఎక్కువమంది సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ మైండ్ సెట్ మారాలని కోరుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడం విశేషం. ప్రస్తుతం వైసీపీ అధినేత కూడా ఈ దిశగానే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News