జనాన్ని టెస్ట్ చేస్తున్న జగన్!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ జనంలోకి రావడం లేదు ఆయన ఉంటే తాడేపల్లి లేకపోతే బెంగళూరు అన్నట్లుగానే ఉంటున్నారు అన్న చర్చ సాగుతోంది.

Update: 2024-11-23 07:30 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ జనంలోకి రావడం లేదు ఆయన ఉంటే తాడేపల్లి లేకపోతే బెంగళూరు అన్నట్లుగానే ఉంటున్నారు అన్న చర్చ సాగుతోంది. ఇక ఆయన అపుడపుడు మీడియా మీటింగ్స్ కి వస్తున్నారు. అంతకు మించి జగన్ పెద్దగా హడావుడి చేయడం లేదు. ఇక శాసన సభ సమావేశాలకు సైతం హాజరు కావడం లేదు

టోటల్ గా చూస్తే వైసీపీ వాయిస్ చాలా తక్కువగా ఉంది. ఈ విధంగా లో ప్రొఫైల్ మెయింటెయిన్ చేయడం వెనక ఏమైనా వ్యూహం ఉందా అంటే జగన్ పక్కా వ్యూహంతోనే ఇదంతా చేస్తున్నారు అని అంటున్నారు. ఇప్పటికే కొన్ని మీడియా సంస్థలతో పాటు చాలా మంది ఇతర పార్టీల నేతలు జగన్ జనంలోకి రావడం లేదు అని విమర్శలు చేస్తున్నారు

అయితే దానికి ఒక టైం ఉందని భావించే జగన్ ఆ విధంగా వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలల సమయమే అయిందని ఇంక జనాలు కొత్త ప్రభుత్వం మీద కోటి ఆశలతో వేచి చూస్తున్నారు అని జగన్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. కూటమి ప్రభుత్వం మీద జనాలు ఇంకా ఆశలు పెంచుకున్న వేళ మధ్యలో వెళ్ళి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే అవి జనం బుర్రలకి ఎక్కకపోగా బూమరాంగ్ అవుతుందని భావించే జగన్ కొంత సమయం కావాలని అనుకుంటున్నారు అని చెబుతున్నారు

జనాలకు కూటమి ప్రభుత్వం మీద మబ్బులు వీడిపోయే సమయం వచ్చినపుడు కచ్చితంగా జగన్ జనంలోకి వస్తారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే జనంలో కొంత నిరాశ అసంతృప్తిలో కూడిన వ్యతిరేకత వచ్చిందని అది మరింతగా ముదిరిన నాడు వైసీపీ జనంలోకి వెళ్తేనే మంచి ఫలితాలు ఉంటాయని అంటున్నారు.

ఇక జగన్ కూడా జనం మూడ్ ని గమనిస్తున్నారు గ్రౌండ్ లెవెల్ నుంచి ఎప్పటికప్పుడు ప్రజల మనోభావాల మీద అభిప్రాయాలు సేకరించి వాటిని పరిశీలిస్తున్నారు అని అంటున్నారు. అందుకే ఆయన ఎక్కడా తొందర పడటం లేదని అంటున్నారు. ఇక వైసీపీ నేతలు అయితే జగన్ ఒక్కసారి తాడేపల్లి గడప దాటి జనంలోకి వస్తే బ్రహ్మరథం జనాలు పడతారని అదే సమయంలో ప్రజలలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత తోడు అయితే అది కూటమి గుండెలలో రైళ్ళను పరిగెత్తించే విధంగా ఉంటుందని అంటున్నారు.

మొత్తానికి చూస్తే జగన్ ఊరికే లేరని ఆయన తనదైన వ్యూహాలతో తగిన విధంగా కసరత్తు చేస్తున్నారు అని అంటున్నారు. అదే విధంగా జగన్ జనాల ఓపికను సహనాన్ని కూడా టెస్ట్ చేస్తున్నారు అని అంటున్నారు. జనంలో ఓపిక నశించి కూటమి ప్రభుత్వం మీద వారు తన అసంతృప్తిని బాహాటంగా వెళ్లగక్కిన నాడు జగన్ వస్తే ఆయనతో వారు కచ్చితంగా గొంతు కలుపుతారు అని అదే వైసీపీకి భారీగా పొలిటికల్ అడ్వాంటేజ్ గా మారుతుందని అంటున్నారు. అప్పటివరకూ లో ప్రొఫైల్ లోనే ఉండడం బెటర్ అన్నదే వైసీపీ ఆలోచన గా చెబుతున్నారు. సో జగన్ జనంలోకి వెళ్ళేందుకు ఇంకా చాలా టైం ఉందన్నది వైసీపీ వర్గాల నుంచి వినవస్తున్న మాట.

Tags:    

Similar News