విలేజ్ క్లినిక్కులు ఏమయ్యాయి.. వలంటీర్లు ఏమయ్యారు? : జగన్
అందుకే.. విజయనగరం జిల్లాలోని గుర్లలో డయేరియా బాధితులకు సరైన వైద్యం అందలేక పోతోందన్నారు.
రాష్ట్రంలోని పేదలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వారి ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తూ.. తమ హయాం లో ఏర్పాటు చేసిన విలేజ్ క్లినిక్కులు ఇప్పుడు ఏమయ్యాయని.. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ప్రశ్నించారు. విలేజ్ క్లినిక్కుల ద్వారా వైసీపీ కి పేరు వస్తుందని.. జగన్‌కు పేరు వస్తుందన్న కారణంగానే వాటిని తొలగించారని ఆరోపించారు. అందుకే.. విజయనగరం జిల్లాలోని గుర్లలో డయేరియా బాధితులకు సరైన వైద్యం అందలేక పోతోందన్నారు.
గతంలో వలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చామనిచెప్పిన జగన్.. దాని వల్ల ఎక్కడ ఏం జరిగినా.. ప్రభుత్వా నికి తక్షణం తెలిసేదని.. ఫలితంగా బాధితులకు మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఉండేద న్నారు. కానీ, దీనిని కూడా రాజకీయ కక్షతో పక్కన పెట్టారని, ఫలితంగా పేదలు ఇబ్బందులు ఎదుర్కొం టున్నారని చెప్పారు. టీడీపీ నేతృత్వంలోని సర్కారు హయాంలో పరిస్థితులు అధ్వాన్నంగా మారాయని అన్నారు.
20 రోజులపైగా డయేరియా బారినపడిన వారిని ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. నాడు -నేడులో బాగం గా తాము అభివృద్ది చేసిన పాఠశాలల్లోని బెంచ్‌లపై వైద్యం చేస్తారా? అని జగన్ నిలదీశారు. మెరుగైన వైద్యం అందించి ఉంటే 14 మంది ప్రాణాలు కాపాడి ఉండేవారని చెప్పారు. కానీ, అలా చేయలేదని.. ఎక్కడ జగన్‌కు పేరు వస్తుందన్న కుట్రతోనే ఇలా చేశారని విమర్శించారు. వైసీపీ హయాంలో గ్రామస్వరాజ్యం తీసుకొచ్చామన్నారు.
అన్ని గ్రామాల్లోనూ ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని `విలేజ్ క్లినిక్`లను ఏర్పాటు చేయడమే కాకుండా.. 24 గంటలూ సేలు అందుబాటులోకి తీసుకువచ్చామని జగన్ చెప్పారు. ఇప్పుడు వాటిని ఎత్తేశారని.. దీంతో గుర్లలో డయేరియాతో 14 మంది చనిపోయారని, అయినా.. ప్రభుత్వం స్పందించలేదని దుయ్యబట్టారు. గత ఐదు నెలల్లో కనీసం క్లోరినేషన్ కూడా చేయలేదన్నారు.