కూటమి పవర్ మూడేళ్ళు...ఈ లెక్కేంటి జగన్ ?
కానీ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ మరో మూడేళ్ళలో వైసీపీ ప్రభుత్వం వస్తుందని చెబుతున్నారు.;
ఏపీలోనే కాదు దేశంలో ఏ రాష్ట్రం అయినా కేంద్రంలో అయినా ప్రజలు అయిదేళ్లకు ఒక మారు ఎన్నుకుంటారు. సార్వత్రిక ఎన్నికలు రావాలీ అంటే అయిదేళ్ళ గడువు ఉంటుంది. కానీ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ మరో మూడేళ్ళలో వైసీపీ ప్రభుత్వం వస్తుందని చెబుతున్నారు.
కడప జిల్లాలో అరటి రైతులు పంట నష్టంతో బాధపడుతున్న వేళ ఆయన వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలే చర్చనీయాంశం అవుతున్నాయి. రైతులను వైసీపీ ప్రభుత్వం ఆదుకున్నట్లుగా మరే ప్రభుత్వం ఆదుకోలేదని అన్నారు ఇంపుట్ సబ్సిడీతో పాటు వారి కోసం అనేక చర్యలను తీసుకున్నామని చెప్పారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. రైతులను కూటమి సర్కార్ ఆదుకోవడం లేదని అన్నారు. అయితే రైతులు ఏమీ దిగాలు చెందాల్సిన అవసరం లేదని జగన్ అన్నారు. కళ్ళు మూసుకుంటే ఏడాది గడచిపోయింది. ఇక మరో మూడేళ్ళు ఓపిక పట్టండి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. రైతులకు అన్ని విధాలుగా మేలు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు.
జగన్ విపక్ష నేతగా హామీ ఇవ్వడంలో తప్పు లేదు. మరోసారి తాము అధికారమలోకి వస్తామని చెప్పుకోవడంలోనూ తప్పు లేదు కానీ ఈ మూడేళ్ళు గడువు ఏంటి అని అంతా అడుగుతున్నారు. ఏపీలో 2024 మేలో ఎన్నికలు జరిగాయి. జూన్ లో ప్రభుత్వం కొలువు తీరింది. అంటే 2029 లోనే మళ్లీ ఎన్నికలు రావాల్సి ఉంది.
జగన్ చెప్పినట్లుగా మరో రెండు నెలలు కూడా కలుపుకుని ఒక ఏడాది కూటమి ప్రభుత్వానికి నిండిందే అనుకుందాం. కానీ ఇంకా నాలుగేళ్ళ అధికారం కూటమికి ఉంది కదా అని అంటున్నారు. 2025లో ఇపుడు అంతా ఉన్నారు. ఈ రోజుకు కచ్చితంగా నాలుగేళ్ళకు పైగా కూటమి చేతిలో అధికారం ఉంటుంది. అపుడు కదా ఎన్నికలు అని అంటున్నారు.
ఒకవేళ జగన్ భావిస్తున్నట్లుగా జమిలి ఎన్నికలు 2028లో జరుగుతాయని అనుకున్నా ఆ దిశగా అయితే ఎవరికీ ఆశలు అయితే లేదు. జమిలి ఎన్నికలు అంటే అతి పెద్ద తతంగంగా ఉంటుంది. ఎన్నో అంశాలలో రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంది. ఈ రోజున దేశంలో బీజేపీతో సహా ఎవరూ జమిలి ఎన్నికల గురించి ఆలోచన చేయడం లేదు అని గుర్తు చేస్తున్నారు. ఎన్నికలు పెడితే తెలంగాణాలో అధికారం మాదే అని భావిస్తున్న బీజేపీ కూడా 2028 చివరి దాకా వేచి చూడాలని అనుకుంటోంది.
అలాంటపుడు ఒక్క జగన్ మాత్రమే జమిలి ఎన్నికలను నమ్ముకున్నారా అన్న చర్చ వస్తోంది. నిజంగా బీజేపీ పట్టుబట్టి జమిలి ఎన్నికలను తెస్తే ఏపీ లాంటి చోట ఎన్డీయేను గెలిపించుకోకుండా ఉంటుందా అన్న చర్చ కూడా ఉంది. మొత్తానికి చూస్తే జగన్ 2029లో అధికారంలోకి వస్తామని చెప్పడం మంచిదని అంటున్నారు. మూడేళ్ళే కూటమికి పవర్ అంటే లెక్కలలో ఎక్కడో తేడా కొడుతోందని అంటున్నారు.