తిరుమలకు జగన్‌.. ఏం జరగబోతోంది?

మరోవైపు తిరుమలతోపాటు తిరుపతిలోనూ ఎలాంటి సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, సమావేశాలకు అనుమతి లేదని తాజాగా పోలీసులు ప్రకటించారు.

Update: 2024-09-27 06:52 GMT

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వులు, నూనెలు వాడారంటూ కూటమి నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తిరుమలకు వెళ్తుండటం ఒక్కసారిగా హీట్‌ ను పెంచింది. జగన్‌ దర్శనానికి వస్తే ఆయన నుంచి డిక్లరేషన్‌ తీసుకోవాలని కూటమి నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

మరోవైపు తిరుమలతోపాటు తిరుపతిలోనూ ఎలాంటి సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, సమావేశాలకు అనుమతి లేదని తాజాగా పోలీసులు ప్రకటించారు. సెప్టెంబర్‌ 25 నుంచి అక్టోబర్‌ 24 వరకు నెల రోజులపాటు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్‌ 30 అమల్లో ఉంటుందని ఎస్పీ ప్రకటించారు. ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించాలనుకుంటే పోలీసుల నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాలన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ నేపథ్యంలో జగన్‌ తిరుమల టూరు కాక రేపుతోంది. ఆయన పర్యటనను అడ్డుకోవడానికి హిందూ సంఘాలు ఉద్యుక్తమవుతున్నాయని తెలుస్తోంది. మరోవైపు శ్రీవారిని దర్శించుకోవాలంటున్న జగన్‌ నుంచి డిక్లరేషన్‌ పై సంతకం తీసుకోవాలని కూటమి నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. గత ఐదేళ్లూ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్‌ ఎలాంటి డిక్లరేషన్‌ ఇవ్వలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్‌ డిక్లరేషన్‌ ఇస్తారా, లేదా అనేది హాట్‌ టాపిక్‌ గా మారింది.

కాగా జగన్‌ సెప్టెంబర్‌ 27 సాయంత్రం 4 గంటలకు విజయవాడ నుంచి విమానంలో బయలుదేరి రాత్రి 7 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి బయలుదేరి తిరుమలకు కారులో వెళ్తారు. ఆ రాత్రికి తిరుమలలోనే బస చేస్తారు. సెప్టెంబర్‌ 28న ఉదయం 10.30 గంటల సమయంలో శ్రీవారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత తిరుపతి నుంచి ఆయన బెంగళూరుకు వెళ్తారు.

ఈ నేపథ్యంలో ఓవైపు తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వులు కలిపారనే వార్త దేశంలో సంచలనం సృష్టిస్తోంది. మరోవైపు జగన్‌ తిరుమలలో శ్రీవారి దర్శనానికి వస్తుండటం హాట్‌ టాపిక్‌ గా మారింది. ఓవైపు పోలీసుల ఆంక్షలు, ఇంకోవైపు జగన్‌ ను అడ్డుకోవడానికి సిద్ధమవుతున్న హిందూ సంఘాలు ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక జగన్‌ తిరుమలకు వెళ్తుండటం ఇదే మొదటిసారి. అందులోనూ తన పాలనలో లడ్డూ తయారీలో జంతువుల నూనెలు, కొవ్వులు కలిశాయని ఆరోపణలు వచ్చాక తిరుమలకు వెళ్తుండటం ఉత్కంఠను రేపుతోంది.

Tags:    

Similar News