ప్ర‌భుత్వం విఫ‌ల‌మైందా?: జ‌గ‌న్ వ‌ర్సెస్ టీడీపీ!

అయితే.. ఈ వ్యాఖ్య‌ల‌పై టీడీపీ నాయ‌కులు మండి ప‌డుతున్నారు. జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల్లో నిజం లేద‌న్నారు.

Update: 2024-09-05 04:37 GMT

విజ‌య‌వాడ‌లో వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల‌ను బుధ‌వారం ప‌రిశీలించిన మాజీ సీఎం జ‌గ‌న్‌.. స‌ర్కారుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని అన్నారు. వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లోని బాధితుల‌ను ఆదుకునేందుకు ఎలాంటి చ‌ర్య‌లూ చేప‌ట్ట‌డం లేద‌ని విమ‌ర్శించారు. బుధ‌వారం ఆయన వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతం రాజ‌రాజేశ్వ‌రీ పేట‌లో ప‌ర్య‌టించారు. వ‌ర‌ద బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. చంద్ర‌బాబు త‌న ప్ర‌చారం కోసం.. వ‌ర‌ద నీటిలో తిరిగార‌ని.. ఇదేనా పాల‌న అని ప్ర‌శ్నించారు. ఇలాంటి సంద‌ర్భాలు వ‌చ్చిన‌ప్పుడు.. అధికారుల‌ను ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పంపించాల‌ని అన్నారు.

త‌మ హ‌యాంలో కూడా వ‌ర‌ద‌లు, వ‌ర్షాలు వ‌చ్చాయ‌ని చెప్పారు. అయితే.. తాము కొంత గ‌డువు ఇచ్చి.. ఆ స‌మ‌యంలోగా ప‌నులు చ‌క్క‌దిద్దాల‌ని అధికారుల‌కు దిశానిర్దేశం చేసిన‌ట్టు జ‌గ‌న్ చెప్పారు.

ఆ త‌ర్వాత‌.. త‌ను ప రిశీలించాన‌ని, ప్ర‌చారం కోసం ఎప్పుడూ తహ‌త‌హ‌లాడ‌లేద‌ని వ్యాఖ్యానించారు. అయితే.. ఈ వ్యాఖ్య‌ల‌పై టీడీపీ నాయ‌కులు మండి ప‌డుతున్నారు. జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల్లో నిజం లేద‌న్నారు. ప్ర‌భుత్వం విప‌లం కాలేద‌ని.. యంత్రాంగంలోనే కొంత అల‌స‌త్వం క‌నిపించింద‌ని దానిని ప‌ట్టుకుని మొత్తం ప్ర‌భుత్వంపై ఆయ‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం ఏంట‌ని నిప్పులు చెరుగుతున్నారు.

బాధ్య‌తాయుత ముఖ్య‌మంత్రిగా ఉన్న చంద్ర‌బాబు బాధిత ప్రాంతాల‌కు వెళ్తే.. ప్ర‌భుత్వం త‌మ‌కు అండ‌గా ఉంద‌న్న భావ‌న‌, భ‌రోసా బాధితుల‌కు ద‌క్కుతాయ‌ని.. ప్యాలెస్‌ల‌లో కూర్చుని కాలం గ‌డ‌ప‌డం.. క‌లెక్ట‌ర్ల‌కే బాధ్య‌త‌లు అప్ప‌గించి చేతులు దులుపుకోవ‌డం చేయ‌లేద‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు.

గ‌తంలో జ‌గ‌న్.... వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించి.. బాధితుల‌తో సెల్ఫీలు దిగ‌లేదా? అని ప్ర‌శ్నించారు. ఇప్పుడు నీతులు చెప్ప‌డం కాద‌ని.. బాధితుల‌ను ఆదుకునేందుకు వైసీపీ నాయ‌కులు ఏం చేశార‌ని వారు నిల‌దీస్తున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు గుప్పెడు ఆహారాన్ని బాధితుల‌కు అందించేందుకు ఎవ‌రూ ముందుకు రాలేద‌ని.. వీరి కంటే.. ఇత‌ర ప‌క్షాలు న‌య‌మ‌ని నాయ‌కులు తిట్టిపోశారు. ప్ర‌భుత్వం స‌రిగానే ప‌నిచేస్తోంద‌ని.. కాబ‌ట్టే ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌కుండా.. చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని చెబుతున్నారు. జ‌గ‌న్ హ‌యాంలో ఎంతోమంది చ‌నిపోయార‌ని.. కానీ, ఇప్పుడు ప్రాణ న‌ష్టం పెద్ద‌గా జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని అంటున్నారు. జ‌గ‌న్ ఏం మాట్లాడినా.. చెల్లుతుంద‌ని అనుకుంటున్నార‌ని.. కానీ, ప్ర‌జ‌లు ఆయ‌న‌ను ఎప్పుడో ప‌క్క‌న పెట్టార‌ని ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News