అటు జగన్ ఇటు బాబు..కౌంటింగ్ స్ట్రాటజీ !
ఇక జగన్ వచ్చిన వెంటనే పార్టీ వారితో వరస భేటీలు జరపబోతున్నారు అని తెలుస్తోంది.
దాదాపుగా రెండు వారాల సుదీర్ఘమైన విదేశీయానం ముగించి ముఖ్యమంత్రి జగన్ ఏపీకి వస్తున్నారు. ఆయన భారత కాల మానం ప్రకారం శుక్రవారం రాత్రి లండన్ లో బయలుదేరి శనివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు అని తెలుస్తోంది.
ఆ వెంటనే ఆయన తాడేపల్లిలోని తన నివాసానికి వెళ్తారు. ఇక జగన్ వచ్చిన వెంటనే పార్టీ వారితో వరస భేటీలు జరపబోతున్నారు అని తెలుస్తోంది. శనివారం మధ్యాహ్నం ఆయన పార్టీ ముఖ్యులతో ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు పోస్టల్ బ్యాలెట్ వివాదంతో పాటు కౌటింగ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా నేతలతో మీటింగ్ సందర్భంగా చర్చిస్తారు అని అంటున్నారు.
అదే విధంగా ఇప్పటికే తన వద్దకు చేరిన ఎగ్జిట్ పోల్ సర్వేల అంచనాలను కూడా ఆయన పార్టీ పెద్దలతో పంచుకుంటారు అని అంటున్నారు. అదే విధంగా ఆయన రానున్న మూడు రోజులు పార్టీ శ్రేణులను అలెర్ట్ చేయడంతో పాటు కౌంటింగ్ వేళ ఎలా వ్యవహరించాలి ఏమి చేయాలన్న దాని మీద దిశా నిర్దేశం చేస్తారు అని అంటున్నారు.
ఇక చంద్రబాబు విషయానికి వస్తే ఆయన కూడా శనివారమే ఏపీకి వస్తున్నారు. ఆయన ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు అని తెలుస్తోంది. జూన్ 1వ తేదీన కౌంటింగ్ విషయంలో శిక్షణా తరగతులను కూడా టీడీపీ నిర్వహిస్తోంది. అంతే కాదు పలువురు సీనియర్ నేతలంతో చంద్రబాబు కౌంటింగ్ స్ట్రాటజీ గురించి చర్చిస్తారు అని అంటున్నారు. ఇక కూటమి నేతలతో కూడా ఆయన సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
అదే విధంగా ఏపీలో రచ్చ రేపుతున్న పోస్టల్ బ్యాలెట్ విషయంలో కూడా చంద్రబాబు నేతలతో సమాలోచనలు చేస్తారు అని తెలుస్తోంది. ఇక కచ్చితంగా గెలుస్తామని టీడీపీ కూటమి భావిస్తోంది. బాబు దగ్గర కూడా పక్కాగా లెక్కలు ఉన్నాయని అంటున్నారు.
దాంతో ఈసారి కౌంటింగ్ లో అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకోవాలని బాబు నేతలకు గట్టిగా ఒకటికి పదిసార్లుగా చెప్పనున్నరు అని అంటున్నారు. మరో వైపు చూస్తే ఏపీలో జగన్ చంద్రబాబు లేక పదిహేను రోజులు దాటింది. ఇపుడు ఇద్దరు నేతలూ ఒకేసారి ఏపీకి వస్తున్నారు. ఇద్దరూ సీరియస్ గా తమ పార్టీ నేతలతో మీటింగ్స్ పెడుతున్నారు. దాంతో కౌంటింగ్ కి ముందు మరోసారి రాజకీయ వేడి ఏపీలో రగులుకోనుంది అని అంటున్నారు.