బాబు వయసు : జగన్ బాబు మాటల తూటాలు

ముందుగా ముఖ్యమంత్రి జగన్ విషయానికి వస్తే బాబుని హామీలు నెరవేర్చని మోసగాడు, పెత్తందారు అని నిందించారు.

Update: 2024-01-27 16:55 GMT

ఏపీలో చాలా విషయాలు ఎన్నికల అంశాలుగా మారిపోతున్నాయి. వ్యక్తిగతాలు కూడా ఇందులోకి వచ్చేస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు ఒకే రోజున మీటింగ్స్ పెట్టారు. జగన్ విశాఖ జిల్లా భీమిలీలో సిద్ధం అంటూ ఎన్నికల యుద్ధం ప్రకటిస్తే చంద్రబాబు అనంతపురం జిల్లా ఉరవకొండలో రా కదలిరా అంటూ భారీ బహిరంగ సభను నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇద్దరు నేతలూ ఒకరి మీద మరొకరు భారీ పంచులేసుకున్నారు. డైలాగులు తూటాలుగా పేల్చారు. ముందుగా ముఖ్యమంత్రి జగన్ విషయానికి వస్తే బాబుని హామీలు నెరవేర్చని మోసగాడు, పెత్తందారు అని నిందించారు. బాబు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన పాలన ఇదీ అనే మార్క్ ఏదైనా ఉందా అని ఎద్దేవా చేశారు.

బాబుకు డెబ్బై అయిదేళ్ల వయసు వచ్చింది. కానీ పాలనలో నిబద్ధత అంటే తెలియదు. పేదలకు న్యాయం చేయాలన్న ఆలోచనలు ఎపుడూ రావు ఆయనకు ఓటేస్తే ఇంతే సంగతులు అని సిద్ధం సభలో హాట్ కామెంట్స్ చేశారు. ఇక చంద్రబాబు ఊరుకుంటారా. ఆయన ఉరవకొండ సభలో మాట్లాడుతూ ఈ ముఖ్యమంత్రికి పాలన అంటే తెలియదు అని ఎగతాళీ చేశారు.

తాను చేసిన అభివృద్ధిని పూర్తిగా ప్రతీకారంతో పక్కన పెట్టేశారు అని ఫైర్ అయ్యారు. ఉల్లి గడ్డకు ఆలు గడ్డకు తేడా తెలియని వ్యక్తి మన సీఎం అని ఘాటు విమర్శలు చేశారు. ముఖ్యమంత్రికి రైతుల కష్టాలు తెలియవు, అందుకే వ్యవసాయం పడకేసింది అని అన్నారు.

తాము అధికారంలోకి వచ్చాక వ్యవసాయానికి పెద్ద సాయమే చేస్తామని ఒక్కో రైతుకూ ఇరవై వేల రూపాయలు ఏటా భరోసా కింద చెల్లిస్తామని ప్రకటించారు. ఇక తన వయసు గురించి చంద్రబాబు మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన వయసు జస్ట్ ఒక నంబర్ మాత్రమే అని జగన్ కి రిటార్ట్ ఇచ్చారు.

తాను బలమైన చురుకైన నేతను అని చంద్రబాబు అలా చెప్పుకున్నారు అన్న మాట. తన ఆలోచనలను మరో ఇరవై ఏళ్ల అభివృద్ధి మీద ఉన్నాయని చంద్రబాబు అన్నారు. తనకు యువత కంటే కూడా ఎక్కువ ఆవేశం ఉందని చెబుతూ తాను పక్కా యూత్ అని బాబు జగన్ మాటలను తిప్పికొట్టారు.

మొత్తం మీద చూసుకుంటే జగన్ చంద్రబాబు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఇద్దరూ వేదికను ఎక్కి మరీ ప్రత్యర్ధుల మీద మాటల తూటాలను గురి పెట్టారు. జనాలు ఈ రెండు సభలను టీవీల ద్వారా తిలకించారు. మరి బాబు వయసు అయిపోయిందా లేక ఆయన నవ యువకుడా అన్నది జనాలు తేల్చాల్సి ఉంది. అలాగే జగన్ పరిపాలన అనుభవం నచ్చితే జనాలు ఆయనకే ఓటేస్తారు అని అంటున్నారు.


Tags:    

Similar News