జగన్...బాబు ఎదురెదురుగా... వాటే సీన్...!
ఈ కార్యక్రమంలో కూడా జగన్ చంద్రబాబు మాట్లాడుకోలేదు, అసలు అలాంటి వీలు కూడా లేదు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇద్దరూ కలసి కనిపించి చాలా కాలం అవుతోంది. 2021 వర్షాకాల సమావేశాల సందర్భంగా చంద్రబాబు కఠోర శపధం చేశారు. తాను మళ్లీ అసెంబ్లీలోకి అడుగు పెట్టేది సీఎం గానే అంటూ ఆయన వెళ్ళిపోయారు. తన సతీమణి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసారు అని ఆయన ఆ రోజు సభలో మండిపడ్డారు.
ఆ తరువాత చంద్రబాబు జగన్ ఎదురెదురు పడినది పెద్దగా లేదు. ఈ ఏడాది లో జరిగిన గవర్నర్ ఎట్ హోం కార్యక్రమంలో జగన్ చంద్రబాబు హాజరైనా వేరు వేరు దారుల లోనే వెళ్ళిపోయారు. అయితే ఒక అరుదైన సన్నివేశం ఏపీ రాజకీయాల్లో శుక్రవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం లో చోటు చేసుకుంది.
ఏపీ హై కోర్టుకు నూతన ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ధీరజ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారానికి సీఎం జగన్ హాజరయ్యారు. ప్రోటోకాల్ ప్రకారం విపక్ష నేతగా చంద్రబాబు కు ఆహ్వానం లభించింది. అలాగే మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు.
ఈ కార్యక్రమంలో కూడా జగన్ చంద్రబాబు మాట్లాడుకోలేదు, అసలు అలాంటి వీలు కూడా లేదు. కాకపోతే ముఖ్యమంత్రి హోదా లో జగన్ వేదిక మీద ఉన్నారు. గవర్నర్ పక్క సీట్లో ఆయన ఉంటే చంద్రబాబు దిగువన ఉన్న సీట్లలో మొదటి వరస లో ముందున కూర్చున్నారు.
ఆ విధంగా జగన్ కి ఎదురుగా చంద్రబాబు వేదిక దిగువన ఉన్నారన్న మాట. ఈ కార్యక్రమం జరిగినంతసేపూ బాబు జగన్ అలా ఎదురుబొదురుగా కనిపించి అందరికీ ఆసక్తిని పెంచారు. మరో విశేషం ఏమిటి అంటే ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రుల లో అంబటి రాంబాబు కూడా ఒకరు.
ఆయన చంద్రబాబు పక్క సీట్లోనే కూర్చున్నారు. ఈ సందర్భంగా ఈ ఇద్దరు మాట్లాడుకోవడం అందరి దృష్టిని ఆకట్టుకుంది. మరి ఏమేమి మాట్లాడుకున్నారు అన్నది మాత్రం ఎవరికీ తెలియలేదు. అయితే ఆ తరువాత మంగళగిరి పార్టీ ఆఫీస్ వద్ద మీడియా అయితే ఉత్సాహాన్ని ఆపుకోలేక మీరూ మంత్రి రాంబాబు ఏమి మాట్లాడుకున్నారు అని ప్రశ్నించింది.
దానికి చంద్రబాబు తనదైన శైలి లో బదులిచ్చి సస్పెన్స్ కి తెర దించారు తన పక్కన ఉన్న మంత్రి రాంబాబు ఏదో మాట్లాడాల్ని చూశారు. తాను మాత్రం మాట్లాడలేదని పట్టించుకోలేదని చెప్పి షాక్ తినిపించారు. అంతే కాదు వైసీపీ వాళ్ళతో మాట్లాడాలీ అంటే సిగ్గుగా ఉంటుందని బాబు భారీ కౌంటరే వేశారు.
మొత్తానికి చూస్తే చంద్రబాబు మళ్లీ జోరు చేస్తున్నారు. గతం లో ఇలాంటి కార్యక్రమాల కు పెద్దగా కనిపించని ఆయన తరచుగా అటెండ్ అవుతున్నారు. బహుశా మళ్లీ ఏపీ లో అధికారం లోకి వచ్చేది తానే అన్న ధీమాతో ఆయన ఉన్నారేమో అని అంటున్నారు. ఏది ఏమైనా దేశం లో రాజకీయాలు ఒకలా ఉంటే ఏపీ లో మరోలా ఉన్నాయి.
ఇక్కడ అధికార విపక్ష పార్టీల నేతలు మాట్లాడుకోరు, ఎదురు పడినా కనీసం విష్ చేసుకోరు. ఇక మాట్లాడాలీ అంటే సిగ్గు అంటూంటారు. మరి రాజకీయాలు ఇలా వ్యక్తిగతంగా మారిపోవడానికి కారణం ఎవరు అంటే అంతా అని జవాబు ఒక్కటే వస్తుంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టి మళ్లీ రాజకీయాన్ని కేవలం ప్రజా సేవ కోసం అభివృద్ధి కోణంలో చూస్తూ రాజకీయాల్లో అంతా ప్రత్యర్ధులు పోటీదారులే తప్ప శత్రువులు కారని, లేరని చెప్పడానికి వీలైన వాతావరణం తీసుకుని వస్తారా అంటే ఆలోచించాల్సిందే.