స్వరం మార్చిన దానం నాగేందర్.. ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో ఆయనకు మద్దతు..

కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేటీఆర్‌కు మద్దతు తెలియజేసేలా ఈ వ్యాఖ్యలు ఉండడం గమనార్హం.

Update: 2025-01-11 08:25 GMT

హైదరాబాదుకు చెందిన ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సంచలనంగా మారిన ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారానికి సంబంధించి తాజాగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేటీఆర్‌కు మద్దతు తెలియజేసేలా ఈ వ్యాఖ్యలు ఉండడం గమనార్హం.

దానం నాగేందర్ 2023 సార్వత్రిక ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి భారతీయ రాష్ట్ర సమితి తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో భారతీయ రాష్ట్ర సమితి నుంచి బయటికి వచ్చిన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. గడిచిన కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్న ఆయన తాజాగా ఈ కార్ రేసు వ్యవహారంపై స్పందించారు. అది కూడా ఈ వ్యవహారంలో కేసులు ఎదుర్కొంటున్న భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మద్దతుగా మాట్లాడడం గమనార్హం. ప్రస్తుతం దానం నాగేంద్ర చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేకెత్తిస్తున్నాయి. దీనిపై మాట్లాడిన దానం నాగేందర్ ఈ రేసు తో ప్రపంచం దృష్టిని తెలంగాణ ఆకర్షించగలిగిందని వ్యాఖ్యానించారు.

ఈ రేసింగ్ నిర్వహించడం వల్ల హైదరాబాద్ నగరం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిందని దానం వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో అవినీతి జరిగిందా లేదా అన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని, జరగలేదని కేటీఆర్ చెబుతున్నారని పేర్కొన్నారు. తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు దానం నాగేందర్ మాట్లాడిన మాటలు వీడియోలను సర్కులేట్ చేస్తున్నారు. గతంలోనూ దానం నాగేందర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్న అక్రమ నిర్మాణాలను హైడ్రా ద్వారా తొలగిస్తున్నారు. అయితే హైడ్రా చేస్తున్న పనులను గతంలో దానం నాగేందర్ వ్యతిరేకించారు. హైడ్రా కారణంగా ప్రజలకు నష్టం జరుగుతోందని చెప్పిన దానం నాగేందర్.. ఈ వ్యాఖ్యలకు తాను కట్టుబడే ఉన్నానని మరో మారు స్పష్టం చేశారు. ఓటు బ్యాంకు అయిన ప్రజలను కాపాడుకోవాలని సూచించారు.

హైదరాబాదులో కాంగ్రెస్‌కు ఒక సీటు కూడా రాని విషయాన్ని గుర్తు చేస్తూ.. మనపై నమ్మకం లేదని, ఇప్పుడైనా ఆ నమ్మకాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలని దానం సూచించారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని హైదరాబాదులోని ఓడిసిపికి ఆయన హెచ్చరికలు కూడా జారీ చేశారు. కేసులు పెడతానంటూ బెదిరించడం వల్ల ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి చెడ్డ పేరు వస్తుందని దానం వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా దానం నాగేందర్ తాజాగా కేటీఆర్ కేసులు ఎదుర్కొంటున్న ఈ కార్ రేసు వ్యవహారంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. దానం నాగేందర్ చేసిన ఈ వ్యాఖ్యలు ద్వారా కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ లోకి వెళ్లినట్టు అయిందని.. బీఆర్ఎస్ నేతలకు ఆయుధాన్ని ఇచ్చినట్టు అయిందని పలువురు పేర్కొంటున్నారు.

Tags:    

Similar News